స్పెషల్ టాస్క్ బ్యూరో హైదరాబాద్, జూలై 10, (నమస్తే తెలంగాణ): మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ రూ.వంద కోట్లు ఖర్చు పెట్టిందని ఆ పార్టీ ఎమ్మెల్యే బాహాటంగా చెప్పారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక సమయంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలను కొనుగోలు చేసి, వారిని ఈటల రాజేందర్ విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారని ఆ పార్టీకే చెందిన సీనియర్ నేత జితేందర్‌రెడ్డి ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు బీజేపీ తరఫున స్వామిజీల వేషంలో వచ్చిన రాజకీయ దళారీలు పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన విషయం తెలిసిందే. మరి వీటిపై కేంద్ర దర్యాప్తు సంస్థలు రంగంలోకి దిగుతాయా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతున్నది. అవినీతి, నాయకుల సచ్ఛీలతపై నీతులు వల్లించే ప్రధాని మోదీ, అమిత్‌షా ఎందుకు స్పందించడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
వీరు చెప్పే నీతులు, హుంకారాలు సొంత పార్టీకి వర్తించవా? బీజేపీ నేతలకు చట్టాలు వర్తించవా? చట్టాలు వారికి చుట్టాలా? విపక్ష పార్టీలకేనా చట్టాలు? ఎవరో అనామకుడు ఢిల్లీలో లిక్కర్ స్కామ్ జరిగిందని చెప్తే ఆగమేఘాల మీద రంగంలోకి దిగిన ఈడీ, సీబీఐలకు మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ వంద కోట్లు ఖర్చు పెట్టిందని బాధ్యతాయుతమైన ఒక ఎమ్మెల్యే చెప్పినా ఉలుకు పలుకు లేదు ఎందుకు? ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థల పరిధి నుంచి బీజేపీకి, ఆ పార్టీ నేతలకు మినహాయింపు ఉన్నదా? దీనికి ఏమని సమాధానం చెప్తారు? దీనిపై ప్రధాని మోదీ, అమిత్‌షా ఏవిధంగా స్పందిస్తారో చూడాలని రాజకీయ వర్గాలు, రాజకీయ పరిశీలకులు ఆసక్తి చూపిస్తున్నారు.
మునుగోడు ఉప ఎన్నికలలో వంద కోట్లు ఖర్చు పెట్టినట్టు ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్వయంగా చెప్పినప్పుడు, ఆ డబ్బు ఎక్కడి నుంచి వచ్చిందో ఆరా తీయడం ఈడీ, సీబీఐ పని కాదా? ఒకవేళ ఇదేమాట విపక్ష ఎమ్మెల్యే కానీ, నాయకుడు కానీ చెప్పి ఉంటే ఈ పాటికి ఈడీ, సీబీఐ, ఐటీ వంటి సంస్థలు ఎంత రచ్చ చేసేవి. భ్రష్టాచార్ను రూపుమాపుతామని నీతులు వల్లించే మోదీ, అమిత్‌షా ద్వయం దీనిపై ఎందుకు స్పందించడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు.
పార్టీ సంస్థాగత ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్ డైరెక్షన్లోనే తాము ఎమ్మెల్యేలకు ఎర వేయడానికి వచ్చామని స్వామీజీల వేషంలో రాజకీయ దళారులు స్పష్టంచేసినా.. వారిపై చర్యకు కేంద్రం ఉపక్రమించలేదు. దర్యాప్తు సంస్థలు స్పందించలేదు. బీజేపీ సర్కారు దర్యాప్తు సంస్థలను తన పెరటిలో కట్టేసుకుందన్న ఆరోపణలకు ఇది బలం చేకూర్చింది. కర్ణాటక ఎన్నికల్లో ఓ బీజేపీ నాయకుడి ఇంట్లో రూ.8 కోట్లు పట్టుబడినా తూతూ మంత్రంగా కేసు నమోదు చేయడంతో ఒక్కరోజులోనే బెయిల్ లభించింది. కేంద్రం, కేంద్ర దర్యాప్తు సంస్థలకు కానీ బీజేపీ నేతల అవినీతి కనిపించదు. బీజేపీ సర్కార్ చెప్పే మాటలకు, చేష్టలకు పొంతన లేదనేందుకు ఇదే నిదర్శనం.
హుజూరాబాద్ ఉప ఎన్నికల సమయంలో సర్పంచ్‌లు, ఎంపీటీసీలను కొనుగోలు చేసి, వారిని ఈటల రాజేందర్ విమానంలో ఢిల్లీకి తీసుకెళ్లారు.
–బీజేపీ సీనియర్ నేత జితేందర్‌రెడ్డి
మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ వంద కోట్లు ఖర్చు పెట్టినా గెలువలేదు
–బీజేపీ దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు
బీఎల్ సంతోష్ డైరెక్షన్లోనే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఎర వేసేందుకు వచ్చాం
–బీజేపీ దూతలుగా వచ్చిన స్వామీజీలు