ఎమ్మెల్యే ధనదాహం.. ఆఫీసర్లకు సంకటం
వారినే అడ్డంపెట్టి ఇష్టారీతిన సెటిల్మెంట్లు
వినకుంటే బదిలీ చేస్తానని బెదిరింపులు
హైదరాబాద్ సిటీబ్యూరో, జూలై 29 (నమస్తే తెలంగాణ): నగర శివారులోని ఓ ఎమ్మెల్యే ధనదాహానికి అధికారులే ఆగమవుతున్నట్టు తెలిసింది. ఆఫీసర్లకే నెలవారీ వసూ ళ్ల టార్గెట్లు విధిస్తున్నట్టు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయనగారి ఒత్తడి తట్టుకోలేక ‘ఇక్కడ పనిచేయడం కష్టంగా ఉన్నది’ అంటూ ఉన్నతాధికారులతో సదరు అధికారులు మొరపెట్టుకుంటున్నట్టు సమాచారం. మున్సిపల్, రెవెన్యూ, ఇరిగేషన్, ఆర్అండ్బీ, పోలీస్, ఎక్సైజ్ ఇలా అన్ని శాఖల అధికారులకూ వసూళ్ల టార్గెట్లు తప్పడం లేదని బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. అధికారులను అడ్డం పెట్టుకొని శివారులో రియల్ ఎస్టేట్ వ్యాపారుల నుంచి పెద్దమొత్తంలోనే సదరు ప్రజాప్రతినిధి వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. నేరుగా తన మాట వినకుంటే మున్సిపల్ అధికారులతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయించి మరీ తన దారికి తెచ్చుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నా యి. హెచ్ఎండీఏ అనుమతి పొందిన బిల్డర్లు కూడా మున్సిపల్ అధికారుల ద్వారా పెద్ద సారును కలవాల్సిందేనన్న చర్చ నడుస్తున్నది. ఆ నియోజకవర్గంలోని ఫామ్‌హౌస్‌ల యజమానులతో గతంలో ఎమ్మెల్యే సమావేశం నిర్వహించారు. ‘ఎవరికి పడితే వారికి డబ్బులివ్వొద్దు.. అవసరముంటే మేమే అడుగుతాం’ అని యజమానులకు సదరు ప్రజాప్రతినిధి హింట్ ఇచ్చినట్టు తెలిసింది. కొన్నాళ్ల తర్వాత ఎక్సైజ్ అధికారులు రంగంలోకి దిగి ఒక్కో ఫామ్‌హౌస్ నుంచి నెలకు రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు వసూళ్లు మొదలుపెట్టి వాటాలు పంచుకుంటున్నట్టు సమాచారం.
అధికారులతోనే ఫిర్యాదులు
తన పరిధిలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరెవరు చేస్తున్నారో, తనను కలువని వాళ్లెవరున్నారో ఆరా తీసి మరీ వసూళ్లకు దిగుతున్నట్టు తెలుస్తున్నది. తనదారికి రాని వ్యాపారులపై అధికారులను ప్రయోగించి మున్సిపాలిటీలో ఫిర్యాదులు చేయించి, అక్కడ కాకుం టే మున్సిపల్ అధికారులతోనే పోలీసులకు ఫిర్యాదు చేయించి దారికి తెచ్చుకుంటున్నట్టు తెలిసింది. ఇటీవల ప్రీ లాంచ్ ఆఫర్లో ప్లాట్ల విక్రయం అనే ప్రకటన సోషల్ మీడియాలో వచ్చింది. దానిపై ఓ మున్సిపల్ కమిషనర్ పో లీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైం ది. దేనికీ స్పందించని మున్సిపల్ అధికారులు ఈ ప్రకటనపైనే స్పందించి పోలీసులకు ఫిర్యా దు చేయడం వెనుక సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారే టార్గెట్ అన్న చర్చ నడుస్తున్నది.
కాగా సంబంధిత బాధితులు ఎవరంటూ అధికారులను పోలీసులు వివరాలు అడగడంతో అవేవీ లేవని సమాధానమిచ్చారు. ఎలాంటి వివరాల్లేకుండా కేసు దర్యాప్తు ఎలా సాధ్యమ ని? కనీసం కొన్ని వివరాలైనా ఇస్తే దర్యాప్తు ప్రారంభిస్తామని పోలీసులు చెప్పారు. రోజు లు గడుస్తున్నా ఎలాంటి వివరాలు ఇవ్వకపోవడంతో అటు మున్సిపల్.. ఇటు పోలీసు అధికారులపై ఎమ్మెల్యే నుంచి ఒత్తిళ్లు పెరిగాయి. సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి ఎమ్మెల్యేను కలవక పోవడం వల్లే మున్సిపల్ అధికారులను ముందు పెట్టి ఫిర్యాదు చేయించినట్టు తెలుస్తున్నది. అధికారులు రియల్టర్‌ను పట్టుకోకపోవడంతో అందర్నీ ఇక్కడి నుంచి బదిలీ చేయిస్తానని బెదిరించినట్టు సమాచారం. ఇలాంటి ఒత్తిళ్లతో తాము పనిచేయలేక పోతున్నామంటూ అధికారులు పైఅధికారులతో వాపోయినట్టు తెలిసింది.