హైదరాబాద్, మార్చి 4: మహారాష్ట్రలోని బీడ్ జిల్లా మజల్గావ్ ఎన్సీపీ ఎమ్మెల్యే ప్రకాశ్ సోలంకీ శనివారం హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఇద్దరు నేతల మధ్య సుదీర్ఘ చర్చ జరిగింది. తెలంగాణ తరహాలో దేశ రైతులందరూ సంతోషంగా, సంతృప్తిగా జీవిస్తే ఎంతోబాగుండేదని సోలంకీ వ్యాఖ్యానించారు. ఈ భేటీలో చెన్నూరు ఎమ్మెల్యే బాల్క సుమన్, భారత రాష్ట్ర సమితి కిసాన్ సెల్ మహారాష్ట్ర అధ్యక్షుడు మాణిక్‌రావు కదం పాల్గొన్నారు.
ప్రకాశ్ దాదా సోలంకి.. మహారాష్ట్ర బీడ్ జిల్లాలోని మజల్గావ్ ఎమ్మెల్యే. 1955లో జన్మించిన సోలంకీ సీనియర్ రాజకీయనేత. మజల్గావ్ నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. థాక్రే ప్రభుత్వంలో రెవెన్యూ మంత్రిగా పనిచేశారు. ఆయన తండ్రి సుందర్రావు సోలంకీ కూడా ప్రముఖ రాజకీయ నాయకుడే. మహారాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్‌గా పనిచేశారు. ప్రకాశ్ సోలంకీ ఎకనమిక్స్‌లో మాస్టర్స్ చేశారు. మజల్గావ్ పంచాయతీ సమితికి డిప్యూటీ చైర్మన్‌గా సేవలందించారు. మరాఠ్వాడా శిక్షన్ ప్రసారక్ మండల్ అధ్యక్షునిగా పనిచేశారు. ప్రస్తుతం మహారాష్ట్ర ఎన్సీపీ ఉపాధ్యక్షుడిగా కొనసాగుతున్నారు.