హైదరాబాద్, సెప్టెంబర్ 14(నమస్తే తెలంగాణ) : వ్యవసాయ శాఖ సలహాదారుగా ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఈ మేరకు పబ్లిక్ గార్డెన్స్‌లోని ఉద్యానశాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. కార్యక్రమానికి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరయ్యారు. పోచారం నియామకానికి సంబంధించి ఉత్తర్వులు వెలువడిన 25 రోజులకు బాధ్యతలు స్వీకరించడం గమనార్హం. ఆయనను వ్యవసాయ శాఖ సలహాదారుగా నియమిస్తూ ఆగస్టు 20న ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
‘వ్యవసాయం’లో రాష్ర్టానికి అత్యుత్తమ పురస్కారం
హైదరాబాద్, సెప్టెంబర్ 14 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వానికి చెందిన వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి సక్రమ వినియోగంలో రాష్ర్టానికి దేశంలోనే అత్యుత్తమ అవా ర్డు లభించింది. ఢిల్లీలో శనివారం కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమశాఖ మంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ రాష్ట్ర అధికారులకు అవార్డును ప్రదానం చే శారు. రాష్ర్టానికి రూ. 2,836 కోట్ల ప్రయోజనం కలిగిందని, 2,199 ఇన్ఫ్రాస్ట్రక్చర్ యూనిట్లను నెలకొల్పినట్టు రాష్ట్ర వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి రఘునందన్‌రావు వెల్లడించారు. యూనిట్లలో 1322 వ్యవసాయ ప్రాథమిక ప్రాసెసింగ్, 785 గిడ్డంగు లు, 163 కస్టమ్ హైరింగ్ సెంట ర్లు,101 పోస్ట్-హార్వెస్ట్ తదితర సదుపాయాలు ఉన్నాయని తెలిపారు. నిజామాబాద్, ఖమ్మం, సిద్దిపేట
జిల్లాలోని బ్యాంకులు అత్యుత్తమ పనితీరు కనబర్చినట్టు గుర్తించారు.