హైదరాబాద్, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): బీసీ కులగణనపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ చెప్తున్న దానికి, రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు చేస్తున్నదానికి పొంతనలేదని బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్ మండిపడ్డారు. బీసీ కులగణన విషయంలో సర్కారు తీరుచూస్తుంటే బీసీలను మోసం చేస్తున్నట్టుగా కనిపిస్తున్నదని విమర్శించారు. కులగణన సర్వే లో 98 లక్షల జనాభాను తగ్గించారని మండిపడ్డారు. కులగణన సర్వేపై మంగళవారం అసెంబ్లీలో నిర్వహించిన చర్చలో ఆయన మా ట్లాడుతూ.. ప్రభుత్వ వెబ్సైట్ ప్రకారం రాష్ట్ర జనాభా 4.33కోట్లు ఉన్నట్టు తెలుస్తున్నదని, సర్వే ప్రకారం 3.54 కోట్లుగా ప్రకటించారని ఇదెలా సాధ్యమని ప్రశ్నించారు.
2014లో నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే వివరాలతో పోల్చుకుంటే, ప్రస్తుత లెక్కల్లో బీసీల జనాభా గణనీయంగా తగ్గిందని పేర్కొన్నారు. బీసీలు కాపురాలు చేయడంలేదా? పిల్లలు పుట్టడంలేదా? బీసీలేమైనా కనుమరుగవుతున్న జాతులా? ఏ కారణం వల్ల తగ్గిందో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కులగణన సర్వేలో ప్రపంచంలో ఎక్కడాలేని విధంగా హిందూ బీసీలు, ముస్లిం బీసీలు అని కొత్త పదాలు సృష్టించారని ఇదేమిటని పాయల్ శంకర్ ప్రశ్నించారు. ముస్లిం బీసీ పదంపై సాధారణ వ్యక్తి కోర్టుకెళ్లినా ఈ సర్వే నిలబడదని పేర్కొన్నారు. ఈ పదం పెట్టడం ద్వారా, కోర్టుకు వెళ్లే అవకాశం ప్రభుత్వం కల్పించినట్టు అవుతుందని అన్నారు.