హైదరాబాద్, జూలై 7 (నమస్తే తెలంగాణ): ‘కూనిరాగాలు తీస్తున్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి ఏమీ తెలియదు. ఆయన ఉత్త మంత్రి మాత్రమే’ అని బీఆర్ఎస్ జనగామ ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి ఎద్దేవాచేశారు. ఉత్తమ్‌కు రైతులపై నిజంగా ప్రేమ ఉంటే ఎన్డీఎస్ఏ నివేదిక పేరిట గాలి మాటలు పకనబెట్టి తక్షణమే కన్నెపల్లిలో మోటర్లు ఆన్‌చేసి నీళ్లు అందించి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కన్నెపల్లి పంప్‌హౌస్, సమ్మకసాగర్ (తాటిపూడి), సీతమ్మసాగర్ నుంచి ప్రాణహిత నీటిని ఎత్తిపోసి జలాశయాలను నింపుకొనే అవకాశం ఉన్నా రాజకీయాల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కనీస ప్రయత్నమే చేయడం లేదని దుయ్యబట్టారు. తాము కన్నెపల్లి పంప్‌హౌస్‌కు వెళ్తుంటే ప్రభుత్వం ఎందుకు భయపడి అడుగడుగునా ఆటంకాలు సృష్టించిందని ప్రశ్నించారు. కన్నెపల్లి నుంచి నీటిని ఎత్తిపోస్తే హైదరాబాద్‌తోపాటు కోదాడ వరకు నీటిని తీసుకెళ్లవచ్చని సూచించారు. హైదరాబాద్ తెలంగాణభవన్‌లో మంగళవారం బీఆర్ఎస్ నేతలు ఉపేంద్రాచారి, విద్యాసాగర్ తదితరులతో కలిసి పల్లా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావంతో కరువు ముప్పు పొంచి ఉన్నదని వాతావరణశాఖ హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ సర్కార్‌కు ఏమాత్రం సోయిలేదని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రాష్ట్రవ్యాప్తంగా లోటు వర్షపాతంతో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నా వ్యవసాయ, నీటిపారుదల శాఖల మంత్రులు ప్రత్యామ్నాయ మార్గాలపై కనీసం సమీక్ష కూడా నిర్వహించకపోవడం దారుణమని పేర్కొన్నారు. ఆరుద్ర కార్తెలోనే నాట్లు వేసుకోవాల్సి ఉండగా, కనీసం ఆ పరిస్థితి కూడా లేదని, వానల్లేక చాలాచోట్ల పత్తి, కందులు, మక పంటలు మొలకెత్తలేదని ఆందోళన వ్యక్తంచేశారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదని మండిపడ్డారు. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటివరకు 246 మండలాల్లో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని, రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లలో 15-20 శాతానికి మంచి నీళ్లు లేవని ఆందోళన వ్యక్తంచేశారు. భూగర్భజలాలు పడిపోయాయని తెలిపారు.
అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను కూల్చే కుట్ర
కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారానే తెలంగాణలో రికార్డు స్థాయిలో ధాన్యం ఉత్పత్తి జరిగిందని పల్లా రాజేశ్వర్‌రెడ్డి గుర్తుచేశారు. 2014కు ముందు కాంగ్రెస్ పాలనలో 24 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే పండితే, కేసీఆర్ హయాంలో సాగునీటి విస్తీర్ణం భారీగా పెరిగి దేశానికే తెలంగాణ అన్నపూర్ణగా మారిందని చెప్పారు. మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లను బాంబులతో కూల్చాలన్న కుట్రలు నెరవేరకపోవడంతో.. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు ధనదాహంతో బరాజ్‌ల వద్ద లక్షలాది టన్నుల ఇసుకను తోడేస్తున్నారని, వేల లారీలు ఇప్పటికీ బరాజ్‌లపై తిరుగుతున్నాయని ఆరోపించారు. ఇసుక తోడి అన్నారం, సుందిళ్ల బరాజ్‌లను కూల్చాలని ఏపీ సీఎం చంద్రబాబు కుట్రలు పన్నారని, దానికి తగ్గట్టే ఆదిత్యానాథ్‌దాస్ ఇకడ నీటిపారుదల శాఖ సలహాదారుగా పనిచేస్తున్నారని మండిపడ్డారు.
దాస్‌ను పెట్టుకొని చంద్రబాబు ఇకడి ప్రభుత్వాన్ని నడిపిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ నేతలు బానిస మనస్తత్వంతో ఉన్నారని, మాట్లాడితే పదవి పోతుందనే భయంతో పెదవులు మూసుకుంటున్నారని మండిపడ్డారు. క్యాబినెట్‌లోని ముగ్గురు నేతలు రాష్ట్రాన్ని దోచుకొంటుంటే, మిగతా మంత్రులకు ఏమీ తెలియడం లేదని విమర్శించారు. గతంలో జరిగిన జలదోపిడీ తరహాలోనే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి ద్వారా చంద్రబాబు తెలంగాణ జలసంపదను దోచుకొంటున్నారని ధ్వజమెత్తారు. ఇసుక తోడి బరాజ్‌లను కూల్చే కుట్రలు మానుకోకపోతే తెలంగాణ సమాజం క్షమించబోదని హెచ్చరించారు. సాగునీటి అంశంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌కు తమకు ఆహ్వానం లేదని, అది చంద్రబాబు ఆదేశాల మేరకు ఆదిత్యానాథ్‌దాస్ ఇచ్చే తెలంగాణ వ్యతిరేక ప్రజెంటేషన్ అని కొట్టిపారేశారు. తెలంగాణ సోయి లేనివారే అకడికి వెళ్లి చప్పట్లు కొడుతారని చెప్పారు. రైతుల ఉసురు పోసుకొంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తే ఫలితం ఉండదని చెప్పారు.