లింగాలఘనపురం, డిసెంబర్ 9 : కడియం శ్రీహరి మూడేండ్లు పదవిలో ఉంటానని కలలు కంటున్నాడని.. మూడు నెలలలోపే ఫిరాయింపుల వేటు పడనుందని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం జనగామ జిల్లా లింగాలఘనపురంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మూడేండ్లు ఎమ్మెల్యేగా ఉంటా.. ఎంపీగా కడియం కావ్య.. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటది.. కాంగ్రెస్ అభ్యర్థులను సర్పంచ్‌లుగా గెలిపించకుంటే ఆ గ్రామాలు ఆగమైతయి.. నయా పైసా ఇవ్వం’ అంటూ కడియం శ్రీహరి ఓటర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు. కడియంపై మూడు నెలలలోపే ఫిరాయింపుల వేటుపడుతుందని స్పష్టంచేశారు.
గ్రామపంచాయతీల నిధులు ఆయన అబ్బ సొమ్ముకాదని, సర్పంచ్‌గా ఎవరున్నా రావాల్సిన నిధులు వస్తాయని చెప్పారు. కోన్‌కిస్కా గొట్టం గాళ్ల బెదిరింపులకు ఓటర్లు భయపడవద్దని పిలుపునిచ్చారు. పోలీసులు, అధికారులతో ఓటర్లు, బీఆర్ఎస్ అభ్యర్థులను బెదిరిస్తున్నారని విమర్శించారు. మూడురోజుల క్రితం కార్నర్ సమావేశాలకు దరఖాస్తు చేసుకుంటే.. అధికారులు, పోలీసులు కడియం తొత్తులుగా మారి ఈ రోజు మధ్యాహ్నం వరకే అనుమతి ఇచ్చారని తెలిపారు. రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని..అధికారులు గమనించి ప్రవర్తించాలని సూచించారు. కడియం ఖబడ్దార్.. పిచ్చి వేషాలు వేస్తే తాట తీస్తాం అని హెచ్చరించారు.