హైదరాబాద్, జూలై 30 (నమస్తే తెలంగాణ) : కాంగ్రెస్ పాలనలోనే రైతు ఆత్మహత్యలు మళ్లీ పెరిగాయని, వ్యవసాయ, అనుబంధ రంగాలకు బడ్జెట్ కేటాయింపుల్లో యావత్ రైతాంగాన్ని ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రకటించిన వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ఎలాంటి నిబంధనల్లేకుండా పాస్‌బుక్ కలిగిన ప్రతి రైతుకు రూ.2 లక్షలలోపు పంట రుణాలను ఏకకాలంలో మాఫీ చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడు నెలలు గడుస్తున్నా ఇప్పటికీ వ్యవసాయ పాలసీని రూపొందించకపోవడం దారుణమని విమర్శించారు. రైతు భరోసా, రుణమాఫీ విషయంలోనూ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని దుయ్యబట్టా రు. మంగళవారం అసెంబ్లీలో వ్యవసాయం, మార్కెటింగ్, సహకారశాఖ పద్దులపై జరిగిన చర్చలో పల్లా మాట్లాడుతూ కొత్త ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ రంగ పాలసీపై వ్యవసాయ రంగం ఎంతో ఆశగా ఎదురుచూసిందని, 40 ఏండ్ల రాజకీయ అనుభ వం, వ్యవసాయంపై పట్టున్న వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు ఆ శాఖకు న్యాయం చేస్తారని ఆశించామని, కానీ నామమాత్రపు కేటాయింపులు చేసి నిరుత్సాహపరిచారని విమర్శించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రాగానే తెలంగాణలో వ్యవసాయాన్ని స్థిరీకరించాలనే లక్ష్యంతో నాటి సీఎం కేసీఆర్ ప్రత్యేక పాలసీ రూపొందించారని పల్లా తెలిపారు. వ్యవసాయ విధానంలో ఎంఎస్ స్వామినాథన్, అశోక్ గులాటీ, అర్వింద్ సుబ్రహ్మణ్యం లాంటి ప్రముఖులందరి సలహాలు తీసుకున్నామని, నీటి తీరువా రద్దు చేశామని చెప్పారు. ప్రాజెక్టుల కింద ఎన్ని నీళ్లు తీసుకున్నా ఒక్క పైసా వసూలు చేయలేదని, 24 గంటల ఉచిత నాణ్యమైన కరెంట్ ఇచ్చామని గుర్తుచేశారు. దేశంలోనే తొలిసారిగా రైతు బంధు అమలు చేసి 12 సార్లు ఇచ్చామని చెప్పారు. 70లక్షల మంది రైతులకు కోటీ 52 లక్షల ఎకరాలకు సంబంధించి రూ.82వేల కోట్లను దేశంలోనే ఎవరూ ఇవ్వని విధంగా ఇచ్చామని, ప్రపంచంలోనే ఇది అతిగొప్ప పథకంగా కీర్తికెక్కిందని తెలిపారు. 2014కు ముందు నేషనల్ క్రైం రికార్డుల ప్రకారం రాష్ట్రంలో ఏటా 2వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని వివరించారు. రైతు కుటుంబాలకు భరోసా కల్పించాలనే లక్ష్యంతో బీఆర్ఎస్ రైతుబీమా పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు. 9 ఏళ్లలో 1.40 లక్షల మంది రైతులకు రైతుబీమా అందించామని, సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ వేశామని, బీఆర్ఎస్ తెచ్చిన సంస్కరణలతో తెలంగాణలో వ్యవసాయ స్థిరీకరణ జరిగిందని గుర్తుచేశారు. ఎన్సీఆర్బీ రికార్డు లు చూపిస్తూ గడిచిన పదేళ్లలో రైతు ఆత్మహత్యల వివరాలను వెల్లడించారు. బీఆర్ఎస్ హయాంలో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గాయని టైమ్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఎక్స్‌ప్రెస్ సహా పలు పత్రికలు రాసిన కథనాలను ఉటంకించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 2023 డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో 204 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.
ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సొంత నియోజకవర్గం చింతకాని మండలం పొద్దుటూరులో బోరెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య చేసుకుంటే భరో సా కల్పిచేందుకు తాము వెళ్తున్న విషయం తెలుసుకొని భట్టి కూడా వచ్చారని, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు సొంత గ్రామం ఆశ్వారావుపేట మండలం అన్నపురెడ్డిపల్లిలో శ్రీరాముల శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడని, కొడంగల్‌లోని బొ మ్మరాజుపల్లిలో బైరం నర్సింహులు, వైరాలోని ఉసిరికాలపల్లిలో పచ్చికాల భద్రయ్య అనే రైతు ఆత్మహత్యాయత్నం చేశారని మంత్రులు వారి కుటుంబాలనే పరామర్శించలేదని పల్లా ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యవసాయ యాంత్రీకరణలో భాగం గా బీఆర్ఎస్ ప్రభుత్వం 13వేల ట్రాక్టర్లను సబ్సిడీ కింద ఇచ్చిందని, రైతు వేదికలు నిర్మించామని, 2,600 మందిని ఏఈవోలుగా నియమించామని, ఇవన్నీ చేయడంతో దేశంలో తెలంగాణ వరి పండించడంలో నంబర్ వన్ స్థానానికి చేరిందని వివరించారు.
ఒకప్పుడు ఎకరాకు 15 నుంచి 16 క్వింటాళ్ల ధాన్యం పండితే ఇప్పుడు 25 నుంచి 30 క్వింటాళ్లు పండుతున్నదని, 3 కోట్ల మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తితో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ సహా అన్ని రాష్ర్టాలను దాటేసి తెలంగాన నంబర్ 1కు చేరిందని గుర్తుచేశారు. నాడు 131లక్షల ఎకరాలు సాగైతే ప్రస్తుతం 210 లక్షల ఎకరాలు సాగవుతున్నాయని వివరించారు. ధాన్యం సేకరణలో 2014లో 24 లక్షల మెట్రిక్ టన్నులుంటే గతేడాది 141 లక్షల టన్నులు సేకరించారని చెప్పారు. ఇప్పుడు రైతుబంధు ఇవ్వకపోవడంతో వ్యవసాయ రంగం తిరోగమనంలోకి వెళ్లిందని, మద్దతు ధర కల్పించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. జనగామలో క్వింటాల్‌కు రూ.2087 ఉంటే జనగామ మార్కెట్లో రూ.1530 ఇచ్చారని ఉదహరించారు. దీనిపై సీఎం స్పందించి అధికారులను అప్రమత్తం చేస్తే రూ.1560కి పెంచారని గుర్తుచేశారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్‌లో ప్రకటించిన రైతు డిక్లరేషన్‌ను ఎప్పుడు అమలు చేస్తారని పల్లా ప్రశ్నించారు. కౌలు రైతులకు రూ.15 వేల రైతుభరోసా ఇస్తామన్నారని, ఇందుకు మార్గదర్శకాలను రూపొందించారా? అని, ఎప్పటి నుంచి అమలు చేస్తారో స్పష్టం చేయాలని నిలదీశారు. 60 లక్షల మందికి ఉపాధి హామీ జాబ్ కార్డు లు ఉన్నాయని, వారందకీ కౌలు రైతుల కిచ్చే రుణమాఫీని అమలు చేస్తారా? అని ప్రశ్నించారు.
కేంద్రం అమలు చేస్తున్న ఫసల్ బీమా యోజనాతో రైతులకు ప్రయోజనం లేదని, రైతులు చెల్లించే దానికంటే ఇన్సూరెన్స్ సంస్థలు చెల్లించే పరిహారం చాలా తక్కువ ఉండటం వల్లే ఆ పథకం నుంచి అప్పటి ప్రభుత్వం తప్పుకున్నదని పల్లా వివరించారు. తెలంగాణనే కాకుండా గుజరాత్, కర్నాటక, తమిళనాడు, జార్ఖండ్, కేరళ వంటి రాష్ర్టాలు కూడా ఈ పథకం నుంచి బయటకి వచ్చాయని గుర్తుచేశారు. 2016 నుంచి 2021 వరకు రైతులు రూ.2150 కోట్లు ప్రీమియం చెల్లిస్తే ఇన్సూరెన్స్ సంస్థ రూ.1871 కోట్లే చెల్లించిందని వివరించారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం రూ.లక్ష రుణమాఫీ చేసినప్పటి కంటే కాంగ్రెస్ ప్రభుత్వం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి నిధులు తగ్గించడం వెనుక మర్మమేమిటో చెప్పాలని పల్లా డిమాండ్ చేశారు. రుణమాఫీకి రూ.41వేల కోట్లు కావాలని ప్రకటించిన ప్రభుత్వం ఆ తర్వాత రూ.31వేల కోట్లుగా పేర్కొని, బడ్జెట్లో రూ.26వేల కోట్లకే తగ్గించిందని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం 4.5 లక్షల మంది పోడు రైతులకు రైతుబంధుతోపాటు, రైతుబీమా చెల్లించిందని, మొదటి విడత రూ.లక్ష రుణమాఫీకి రూ.16,144కోట్లు, రెండో విడత రూ.లక్ష రుణమాఫీకి రూ.19వేల కోట్లు ఖర్చు చేస్తే కాంగ్రెస్ ప్రభుత్వం 2 లక్షల రుణమాఫీకి కేవలం రూ.26వేల కోట్ల లెక్క చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
జిల్లా టేకులపల్లి మండలం కోయగూడెం గ్రామంలో యువ రైతు జాల ఉపేందర్ (32) సోమవారం రాత్రి పురుగుల మందుతాగి ఆ త్మహత్యకు పాల్పడ్డాడు. నాలుగెకరాల్లో పంట సాగు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నిరుడు మిర్చి పంట పండకపోవడంతో నష్టం రావడం, అదనంగా కొనుగోలు చేసిన భూమి అప్పు తీర్చలేక మనోవేదనతో కొన్ని రోజులుగా మద్యానికి బానిసయ్యాడు. సోమవారం సాయంత్రం 6 గంటలకు చేను వద్దకెళ్తున్నట్టు ఇంట్లో చెప్పి బయలుదేరాడు. మద్యం మత్తులో గుర్తు తెలియని పురుగుల మందుతాగి చేను వద్ద పడిపోయాడు. రాత్రి 7 గంటలకు గ్రామస్థులు చూసి కుటుంబసభ్యులకు సమాచారం ఇచ్చారు. ఉపేందర్‌ను కొత్తగూడెం ప్రభుత్వ దవాఖానకు తరలించగా.. చికిత్సపొందుతూ 11.30 గంట లకు మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు.
2014: 1340 మంది
2015: 1400 మంది
2016: 645 మంది
2017: 851 మంది
2018: 908 మంది
2019: 499 మంది
2020: 471 మంది
2021: 359 మంది
2022: 178 మంది
2023 డిసెంబర్ 9 నుంచి ఇప్పటివరకు : 204