సికింద్రాబాద్, జనవరి21: బీఆర్ఎస్ సీనియర్ నేత, సికింద్రాబాద్ ఎమ్మెల్యే తిగుళ్ల పద్మారావుగౌడ్‌కు గుండెపోటు వచ్చింది. అత్యవసర చికిత్స అందించడంతో ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. డెహ్రాడూన్ టూర్లో ఉన్న పద్మారావుగౌడ్‌కు అకస్మత్తుగా ఛాతీలో నొప్పి వచ్చింది. వెంటనే ఉన్న కుటుంబసభ్యులు స్థానిక దవాఖానలో చేర్పించారు. అక్కడి డాక్టర్లు వైద్యపరీక్షలు నిర్వహించి, అత్యవసరంగా స్టంట్వేసి ప్రాణాపాయం లేదని నిర్ధారించారని కుటుంబ సభ్యులు తెలిపారు. పద్మారావుగౌడ్‌కు గుండెపోటు వచ్చిందన్న సమాచారంతో సికింద్రాబాద్ ప్రజల్లో ఆందోళన నెలకొన్నది. పలువురు నేతలు హుటాహుటిన డెహ్రాడూన్‌కు బయలుదేరి వెళ్లారు. పద్మారావును కలిసి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. స్టంట్ వేసిన తర్వాత ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నట్టు డాక్టర్లు తెలిపారు. ఆయన కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.
ఆరోగ్యంగానే ఉన్నా ఆందోళన వద్దు: ఎమ్మెల్యే పద్మారావు
తాను సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నానని, అభిమానులు, కార్యకర్తలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సికింద్రాబాద్ ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ స్పీకర్ తిగుళ్ల పద్మారావుగౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు. తాను పూర్తిగా కోలునున్నానని, ఆరోగ్యంగానే ఉన్నానని పద్మారావుగౌడ్ పేర్కొన్నారు.
పద్మారావుకు కేసీఆర్, కేటీఆర్ పరామర్శ
డెహ్రాడూన్ పర్యటనలో అస్వస్థతకు గురై, వైద్యచికిత్స అనంతరం హైదరాబాద్ చేరుకున్న ఎమ్మెల్యే పద్మారావుగౌడ్‌ను బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు. ఫోన్‌తో స్వయంగా ఆయనతో మాట్లాడి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వైద్యుల సూచన మేరకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. చికిత్స అనంతరం తాను ఆరోగ్యంగానే ఉన్నానని పద్మారావుగౌడ్ వారికి తెలిపారు.