హైదరాబాద్, జనవరి 30 (నమస్తే తెలంగాణ): హుజూరాబాద్ నియోజకవర్గంలోని వీణవంకలో నిర్వహిస్తున్న సమ్మక్క, సారలమ్మ దర్శనానికి వెళ్లిన తనపై అనుచితంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈమేరకు శుక్రవారం రాష్ట్ర అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌ను స్వయంగా కలిసి ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యేపై పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర అసెంబ్లీకే అవమానం జరిగినట్టుగా ఉందని పేర్కొన్నారు. ఈ ఘటన శాసనసభ సభ్యుల అధికారాలు, హక్కులను ఉల్లంఘించడమేనని తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యేనని చూడకుండా తనను అడ్డుకోవడంతో పాటు తన కుటుంబసభ్యులపట్ల కూడా అనుచితంగా ప్రవర్తించారని మండిపడ్డారు. వెంటనే ఆ పోలీసులపై చర్యలు తీసుకొని ప్రజాప్రతినిధుల హక్కులు కాపాడాలని కోరారు. కరీంనగర్ సీపీ గౌస్ అలామ్, ఏసీపీ మాధవి, జమ్మికుంట సీఐ లక్ష్మీనారాయణ తీరును ఆయన ఖండించారు.
వీణవంక మండలంలో పోలీస్ అధికారులు దురుద్దేశపూర్వకంగా వ్యవహరించలేదని తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం స్పష్టంచేసింది. ఈ మేరకు సంఘం అధ్యక్షుడు డీజీపీ శివధర్‌రెడ్డి శుక్రవారం ఓ ప్రకటన విడుదల చేశారు. విధుల్లో ఉన్న పోలీస్ అధికారుల పట్ల అనుచితంగా ప్రవర్తించిన ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి బహిరంగంగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. మరోవైపు తెలంగాణ పోలీసు అధికారుల సంఘం కూడా కౌశిక్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది.