హైదరాబాద్, అక్టోబర్ 25 (నమస్తే తెలంగాణ): ‘రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన రెండేండ్లలో 110 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు. నిన్న వంగర గురుకుల పాఠశాలలో శ్రీవర్షిత అనే విద్యార్థిని సూసైడ్ చేసుకుని తనువు చాలించింది. ఈ చావులకు కాంగ్రెస్ పాలకులదే బాధ్యత. ఇలా విద్యార్థుల రక్తంతో తడిచిన చేతులతో జూబ్లీహిల్స్ ఓటర్ల వద్దకు వెళ్లి వారు ఓట్లడుగుతున్నరు’ అని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ విమర్శించారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శనివారం హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి సీతక్క ఆధ్వర్యంలో నడిచే జువైనల్ హోమ్‌లో, అక్కడి ప్రిన్సిపల్ పిల్లలను లైంగికంగా వేధిస్తే ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నించారు.
శ్రీవర్షిత చదివిన గురుకులం మంత్రి పొన్నం ప్రభాకర్ నియోజకవర్గంలోనే ఉన్నా, ఆయన కనీసం స్పందించక పోవడం, అక్కడికి వెళ్లకపోవడం శోచనీయమని పేర్కొన్నారు. 110 మంది విద్యార్థులు చనిపోయినా ఒక్క సందర్భంలో కూడా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించలేదని, బాధిత కుటుంబాలను పరామర్శించలేదని విమర్శించారు. ఒకవైపు గురుకులాల్లో విద్యార్థులు మరణిస్తుంటే, మరోవైపు పాలనను గాలికొదిలిన కాంగ్రెస్ మంత్రులు జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంకోసం కందిరీగల మాదిరిగా తిరుగుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతాగోపీనాథ్ భావోద్వేగంపై మంత్రులు తుమ్మల, పొన్నం ప్రభాకర్ మానవత్వం లేకుండా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడం గర్హనీయం అని మండిపడ్డారు.
రిజ్వీ సహా ఐఏఎస్‌లకు రక్షణ కల్పించాలి
జూబ్లీహిల్స్‌లో గూండాలకు రక్షణ కల్పిస్తున్న కాంగ్రెస్ సర్కారు.. ఐఏఎస్ అధికారులకు మాత్రం రక్షణ కల్పించడం లేదని ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ ధ్వజమెత్తారు. రిజ్వీ సహా ఐఏఎస్ అధికారులకు తగిన రక్షణ కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రిజ్వీ వీఆర్ఎస్ అంశంపై ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎందుకు మాట్లాడటం లేదని అనుమానం వ్యక్తంచేశారు. బోరబండలో కాంగ్రెస్ నాయకుడు బాబా ఫసియుద్దీన్‌కు ఎందుకు గన్మెన్లను ఇచ్చారని ప్రశ్నించారు. సర్దార్ ఆత్మహత్య చేసుకునేలా అదే ఫసియుద్దీన్ వేధించారని ఆరోపించారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ ర్యాలీలో పలువురు రౌడీలు పాల్గొన్నారని తెలిపారు. వ్యభిచార గృహాలు నడిపిన అఖిల్ పహిల్వాన్ సైతం పాల్గొన్నాడని తెలిపారు.
కోటి పరిహారం ఇవ్వాలి: పాడి కౌశిక్‌రెడ్డి
వంగర గురుకులంలో ఆత్మహత్య చేసుకున్న శ్రీవర్షిత కుటుంబానికి రూ.కోటి ఎక్స్‌గ్రేషియో చెల్లించాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థిని సూసైడ్‌కు బాధ్యుడైన ప్రిన్సిపాల్‌ను విధుల నుంచి తొలగించాలని, లేకుంటే బీఆర్ఎస్ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. గురుకులంలో వంటలకు కావాల్సిన నిత్యవసరాలను ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపల్ తీసుకెళ్లుతుంటే చూసిందని, ఆతర్వాత ఆమెను వారు తీవ్ర వేధింపులకు గురిచేశారని ఆరోపించారు. గురుకులంలో ఉండలేనని ఫోన్లో తన తల్లిదండ్రులతో మాట్లాడిన ఆ విద్యార్థిని.. సూసైడ్ చేసుకుని శవమవడం విచారకరమని పేర్కొన్నారు.