Padi Kaushik Reddy | కాంగ్రెస్ ప్రభుత్వం తన ఫోన్‌ని ట్యాప్ చేస్తోందంటూ హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలోని ప్రతి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీతో పాటు పార్లమెంట్ సభ్యుడి ఫోన్‌ని సైతం ట్యాపింగ్ చేస్తుందని ఆరోపించారు. కరీంనగర్లో గురువారం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రుణమాఫీ జరుగకపోవడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారని.. రాష్ట్రంలో కేవలం 40శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ జరిగిందన్నారు. అదికూడా ఏకకాలంలో జరుగలేదన్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఓడిపోయిన వారు చెక్కులు పంచుతుండడం విడ్డూరంగా ఉందన్నారు.
పార్లమెంట్ పరిధిలో సీపీ ఫోన్ ట్యాప్ జరిగిన సమయంలో కేంద్రమంత్రి బండి సంజయ్ ఎందుకు స్పందించలేదని నిలదీశారు. ఈ అంశంలో సీబీఐతో విచారణ జరిపించాలని కౌశిక్‌రెడ్డి డిమాండ్ చేశారు. అధికారులకు తాను ఓ బ్లాక్ బుక్‌ని సిద్ధం చేశానని.. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఆ అధికారులకు చీకటి రోజులేనని హెచ్చరించారు. ఎన్నికలకు ముందు పెన్షన్లు పెంచుతామని సీఎం రేవంత్.. అధికారంలోకి మరిచిపోయారని విమర్శించారు. రైతుబంధు, రైతుబీమా, పెన్షన్ల పెంపుపై ప్రశ్నిస్తే కాంగ్రెస్ ఎదురుదాడి చేస్తుందని మండిపడ్డారు. ఒక్కో కుటుంబంలో ఇద్దరికి పెన్షన్ ఇవ్వాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో ప్రోటోకాల్ ఎందుకు పాటించడం లేదని.. అధికారులు ప్రోటోకాల్ ప్రకారం చెక్కుల పంపిణీ చేపట్టకపోతే హైకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు.