మెదక్, మే 9 (నమస్తే తెలంగాణ) : మెదక్ కలెక్టర్ ప్రతిమాసింగ్ సహా అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యంగా విధులు నిర్వర్తిస్తున్నారని, నాలుగు రోజులు కలెక్టర్ సెలవుపై వెళ్తే ఇన్చార్జిగా ఏ అధికారికి బాధ్యతలు అప్పగించరా? అని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం మెదక్ కలెక్టరేట్లో అధికారులతో ఎమ్మెల్యే మైనంపల్లి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ మాట్లాడుతూ.. ‘కలెక్టర్ సెలవులో ఉంటే ఇన్చార్జిని ఎందుకు నియమించలేదు?. పర్యవేక్షణ ఎవరు చేస్తారు?. జిల్లాలో పనిచేయడం ఇష్టం లేకపోతే వెళ్లిపోండి’ అని అనేక అంశాలపై జిల్లా అదనపు కలెక్టర్ నగేశ్‌ను ఎమ్మెల్యే ప్రశ్నించారు.
అధికారులు ఇష్టారాజ్యంగా పనిచేస్తే సహించేది లేదని హెచ్చరించారు. జిల్లాలో ధాన్యం కొనుగోళ్లు సక్రమంగా చేయకపోవడంతో రైతులు ధర్నాలు చేస్తున్నా కలెక్టర్ పట్టించుకోవడం లేదని, రైతుల సమస్యలపై స్పందించకుండా కలెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. అధికారులు ప్రజల కోసం పని చేయాలని, ఇష్టం లేకపోతే బదిలీపై వెళ్ల్లాలని హెచ్చరించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పౌరసరఫరాలశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ధాన్యం కొనుగోలులో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజాప్రతినిధుల మెప్పు కోసం అధికారులు పని చేయవద్దని, రైతుల సమస్యలు పరిష్కరించేందుకు పని చేయాలని సూచించారు. జిల్లాస్థాయి అధికారులు క్షేత్రస్థాయి పర్యటనకు వెళ్లకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని పేర్కొన్నారు. వారం రోజులుగా పలు అంశాల్లో కలెక్టర్ ప్రతిమాసింగ్, ఎమ్మెల్యే రోహిత్‌రావు మధ్య విబేధాలు చోటుచేసుకుటున్నట్టు సమాచారం. ఎమ్మెల్యే పలు విషయాల్లో కలెక్టర్ ప్రతిమాసింగ్పై ఒత్తిడి తేవడంతో ఆమె ససేమిరా అన్నట్టు తెలిసింది. ఇందులో భాగంగానే కాంగ్రెస్ శ్రేణులతో శుక్రవారం కలెక్టర్ ఆవరణలో ఆందోళన చేయించారని, శనివారం ఎమ్మెల్యే కలెక్టరేట్లో అధికారులతో సమీక్ష నిర్వహించి ఘాటుగా హెచ్చరించినట్టు సమాచారం. సమావేశంలో అదనపు కలెక్టర్ నగేశ్, మెదక్ మున్సిపల్ చైర్ పర్సన్ రాధిక, వైస్ చైర్మన్ దొంతి నరేశ్‌గౌడ్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.