మల్కాజిగిరి, నవంబర్ 20: రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను ఉపసంహరించుకోవాలని ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి డిమాండ్ చేశారు. మౌలాలి డివిజన్లోని పీబీ కాలనీ, సూర్యనగర్, రాక్హిల్స్ కాలనీ, హరిజన బస్తీ, షఫీనగర్, సాదుల్లానగర్, సుభాష్ నగర్లలో రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో బుధవారం సమావేశం ఏర్పాటు చేశారు. ఉత్వర్వులకు వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 30 ఏండ్ల కిందట ఈ కాలనీలు ఏర్పడ్డాయని, ఇప్పటికే రోడ్లు, డ్రైనేజీలు, నల్లా కనెక్షన్లు ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. ప్రజలు కూడా అన్ని పన్నులు కడుతున్నారని, ఇప్పుడు హఠాత్తుగా రిజిస్ట్రేషన్లు నిలిపివేయడం ప్రభుత్వ అనాలోచిత చర్య అని మండిపడ్డారు. ప్రజల పక్షాన హైకోర్టు, సుప్రీంకోర్టులో పోరాడుతానని చెప్పారు. కార్యక్రమంలో అమీనుద్దీన్, భాగ్యనందరావు, ఉస్మాన్, వంశీ, ఇబ్రహీం, సంతోష్నాయుడు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.