హైదరాబాద్, జనవరి 2(నమస్తే తెలంగాణ) : ఓఆర్ఆర్ పరిధిలోని కార్పొరేషన్లు, మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనంపై అధికార పార్టీకి చెందిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అభ్యంతరాలు వ్యక్తంచేశారు. విలీనం విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అనుసరించిన తీరును అసెంబ్లీ వేదికగా తప్పుబట్టారు. అసెంబ్లీలో చర్చ సందర్భంగా మల్రెడ్డి సర్కారును ఇరుకునపెట్టే వ్యాఖ్యలు చేశారు. ఆదాయం రంగారెడ్డి జిల్లా నుం చే వస్తున్నదని, కానీ ఈ జిల్లాకే తీరని అన్యాయం జరుగుతున్నదని ఆందోళన వ్యక్తంచేశారు. జిల్లా ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్షమించరంటూ అసెంబ్లీలో ఆయన ఘాటుగా వ్యాఖ్యానించారు. రంగారెడ్డి జిల్లా పేరిట కొత్త మున్సిపల్ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేయాలని ఆయన డిమాండ్ చేశారు. వార్డుల ఏర్పాటు సక్రమంగా జరుగలేదు. మ్యాప్‌లను చూసి పేపర్ల మీద వార్డులను విభజించారు. తప్పుల తడకగా విలీనం చేశారు. ఒక నియోజకవర్గాన్ని మూడు జోన్లు చేశారు. దీనిని వ్యతిరేకిస్తూ ప్రజలు ధర్నాలు చేస్తున్నారు. ఎమ్మెల్యేలు ప్రజల్లో తిరిగే పరిస్థితి లేదు. అధికారులను కూడా తిరగని వ్వరు.. పేరుకు తగ్గట్టు ప్రజాపాలన అని నిరూపించుకోండి’ అంటూ మల్రెడ్డి సూచించారు.
జీహెచ్ఎంసీ విలీనం అశాస్త్రీయం : పాల్వాయి
జీహెచ్ఎంసీ చట్ట సవరణ బిల్లులో స్పష్టత లేదని, అశాస్త్రీయంగా విలీనం చేశారని సిర్పూర్ కాగజ్‌నగర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు అసెంబ్లీలో ఆరోపించారు. ఒక పార్టీకి అనుకూలంగా విలీనం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ బిల్లు ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఉన్నదని, లోపాలను సరిదిద్దకుండా బిల్లు రూపొందించడాన్ని తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
ఒకే గొడుగు కింద ఉంటాయా?: దానం
మూడు కార్పొరేషన్లను ఎలా విభజించారని, వాటికి ఏం పేర్లు పెట్టారని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రశ్నించారు. మూడు కార్పొరేషన్లు చేయాలన్న అంశంపై పత్రికల్లో కథనాలొస్తున్నప్పటికీ హైదరాబాద్ విస్తరణకు పూనుకోవడం శుభపరిణామమని ఆయన పేర్కొన్నారు. వాటర్, విద్యుత్తు, రెవెన్యూశాఖలు ఒకే గొడుగు కింద ఉంటాయా?, లేక మూడు కార్పొరేషన్ల కింద ఉంటాయా? అన్నది స్పష్టం చేయాలన్నారు.