పటాన్చెరు/ కేపీహెచ్బీ కాలనీ/హైదరాబాద్, ఏప్రిల్ 26 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ రజతత్సోవ సభ బ్రహ్మాండంగా జరగనున్నదని వార్తలు వస్తుండడంతో కాంగ్రెస్, బీజేపీ బెంబేలెత్తుతున్నాయి. సభ సక్సెస్ అయితే ఉనికి కోల్పోతామనే భయంతో చీకట్లో చేతులు కలిపి కుట్రలకు తెరలేపాయి. పెహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో సభ వాయిదా పడ్డదని సోషల్ మీడియా వేదికగా దుష్ప్రచారానికి దిగాయి. తప్పుడు పోస్టులు సృష్టించి వాట్సాప్, ఫేసుబుక్, ఇన్స్టాగ్రాంలో షేర్ చేస్తున్నాయి.
కొన్నిచోట్ల పోస్టర్లను చించివేసి, ఫ్లెక్సీలను తొలగించారు. రజతోత్సవ సభ వాయిదా పడ్డదంటూ వస్తున్న పుకార్లను నమ్మవద్దని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. బీఆర్ఎస్ జెండా చూస్తే కాంగ్రెస్ నేతలకు వణుకు పుడుతుందని, అందుకే మహాసభ ఫ్లెక్సీలు, బ్యానర్లను తొలగించేందుకు అధికారులను పావులుగా వాడుతున్నారని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు విమర్శించారు. పటాన్చెరు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో అంబేద్కర్ సర్కిల్ సమీపంలో ఏర్పాటు చేసిన ‘చలో వరంగల్’ ఫ్లెక్సీలను అధికార పార్టీ నాయకుల ప్రోద్బలంతో జీహెచ్ఎంసీ డీఆర్ఎఫ్ సిబ్బంది తొలిగించారని బీఆర్ఎస్ ఇన్చార్జి ఆదర్శరెడ్డి మండిపడ్డారు.