హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): ప్రయాణికుల రద్దీని పరిగణనలోకి తీసుకొని బస్సుల సంఖ్యను ఎందుకు పెంచడం లేదని సర్కార్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. 50 మంది ఎక్కాల్సిన బస్సులో 170 మంది ఎక్కినందుకు నిర్మల్ డిపో బస్సు రెండు టైర్లు ఊడిపోయి ప్రయాణికులు పడ్డ అవస్థలను ఆదివారం ఎక్స్‌లో కేటీఆర్ పోస్ట్ చేశారు. ‘అదృష్టవశాత్తు ప్రయాణికులెవరికీ ఏమీ కాలేదు.. జరగరానిది జరిగితే బాధ్యులెవరు?’ అంటూ ఆవేదన చెందారు.
నేడు ఆడబిడ్డలకు అందుబాటులో కేటీఆర్
హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ): సోమవారం ఉదయం 11 గంటల నుంచి తెలంగాణ భవన్లో పార్టీ శ్రేణులకు కేటీఆర్ అందుబాటులో ఉండనున్నారు. రాఖీ పౌర్ణమి సందర్భంగా ఆడబిడ్డల సమక్షంలో వేడుకలు నిర్వహించుకోనున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.