కాళేశ్వరం నీళ్లు ఇవ్వకపోవడం వెనుక రేవంత్‌రెడ్డి భారీ కుట్ర ఉన్నది. అది రైతాంగాన్ని శాశ్వతంగా దెబ్బతీయడమే. మేడిగడ్డ బరాజ్‌కు మరమ్మతు చేయిస్తే రైతులకు నీళ్లు ఇవ్వాలి. నీళ్లు ఇస్తే యూరియా సరఫరా చేయాలి. యూరియా సరఫరా చేస్తే పంట కొనాలి. పంట కొనుగోలు చేస్తే ఆ సొమ్ము చెల్లించాలి. దానికి తోడు బోనస్ వేయాలి. ఇన్ని చేసే బదులు అసలు మేడిగడ్డను రిపేర్ చేయకపోతేనే బెటర్ కదా! అనే ఆలోచనకు వచ్చే అద్భుతమైన ప్రాజెక్టును రేవంత్‌రెడ్డి పడావు పెట్టిండు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి, సీఎం రేవంత్‌రెడ్డికి సిగ్గుంటే తక్షణమే పంపులు ప్రారంభించి నీటిని ఎత్తిపోసి జలాశయాలను నింపాలె. లక్షల క్యూసెకుల నీటిని వృథాగా కిందికి పారదోలుతున్న అంశంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులను రైతులు గల్లా పట్టి అడుగాలె. రైతుల గోస పట్టించుకొని ప్రభుత్వం వెంటనే పంపులు ఆన్‌చేసి నీటిని ఎత్తిపోయాలె. లేదంటే 50, 60 వేల మందితో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడించి మేమే ఆన్చేస్తం.
-కేటీఆర్
వరంగల్, జూలై 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ‘ అయ్యా రేవంత్ రెడ్డీ.. నీకు మనసు లేకపోతేనో.. తెలివిలేక పోతేనో మా నాయకుడు కేసీఆర్‌కు వారం రోజులు కాళేశ్వరాన్ని అప్పగించు.. నువ్వేం భయపడకు.. నీ పదవి మళ్లీ నీకే ఇస్తం.. మేడిగడ్డను రిపేర్ చేసి చూపిస్తం.. మొత్తం తెలంగాణ అంతా నీళ్లు పారించి సస్యశ్యామలం చేసి చూపించే బాధ్యత మాది’ అని కాంగ్రెస్ సర్కార్‌కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. కాళేశ్వరం పంప్‌హౌస్ నుంచి వెంటనే నీటిని ఎత్తిపోసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఒకవేళ నీటిని ఎత్తిపోయకపోతే యాభై, అరువై వేల మందితో కలిసి వచ్చి కన్నెపల్లిని ముట్టడించి పంపులను ఆన్‌చేసి రైతులకు నీళ్లు ఇస్తామని హెచ్చరించారు. ఓవైపు రాష్ట్రంలో కరువు పరిస్థితులు, మరోవైపు ఎల్‌నినో ప్రభావం రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడంలేదని మండిపడ్డారు.
ఇంతటి కరువు పరిస్థితుల్లో కూడా మేడిగడ్డ వద్ద లక్షల క్యూసెకుల గోదావరి నీరు సముద్రంలో కలిసిపోతున్నా, రైతులకు సాగునీరు అందించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని నిప్పులు చెరిగారు. రైతుల కోసం ప్రధాన ప్రతిపక్షంగా కాళేశ్వరం ప్రాజెక్టు వద్దకు వస్తుంటే తమను పోలీసులు ఎకడికకడ అడ్డుకోవడాన్ని తెలంగాణ సమాజం చూసిందని పేరొన్నారు. ప్రజల సమస్యల కోసం వస్తున్న తమపై ఇంతటి పోలీసు నిర్బంధం ఎందుకు విధిస్తున్నారని నిలదీశారు. ‘రైతుల కోసం మేము వస్తే రేవంత్‌రెడ్డికి ఎందుకంత భయం?’ అని నిలదీశారు. ‘రాష్ట్రానికి పట్టిన శని రేవంత్‌రెడ్డి’ అని ధ్వజమెత్తారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన కన్నెపల్లి పంప్‌హౌస్ సమీపంలో గోదావరి నదీ ప్రవాహాన్ని కేటీఆర్ ఆదివారం పరిశీలించారు. అనంతరం శాసనమండలిలో విపక్షనేత సిరికొండ మధుసూదనాచారి, మాజీ మంత్రులు గంగుల కమలాకర్, జగదీశ్‌రెడ్డి, జీవన్‌రెడ్డి, సత్యవతి రాథోడ్, కొప్పుల ఈశ్వర్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, పాడి కౌశిక్‌రెడ్డి, ఎమ్మె ల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎంపీలు బోయినపల్లి వినోద్‌కుమార్, మాలోత్ కవిత, బడుగుల లింగయ్య యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు పుట్ట మధూకర్, వొడితెల సతీశ్‌కుమార్, గండ్ర వెంకటరమణారెడ్డి, పెద్ది సుదర్శన్‌రెడ్డి, గొంగిడి సునీత, బాల్క సుమన్, అరూరి రమేశ్, రసమయి బాలకిషన్, తాటికొండ రాజయ్య, చల్లా ధర్మారెడ్డి, జీవన్‌రెడ్డి, సుంకె రవిశంకర్, నడిపెల్లి దివాకర్‌రావు, ఎన్.భాస్కర్‌రావు, బొల్లం మల్లయ్య యాదవ్, చిరుమర్తి లింగయ్య, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, పార్టీ నాయకులు వాసుదేవరెడ్డి, నాగుర్ల వెంకటేశ్వర్లు, పెద్ది స్వప్న, బడే నాగజ్యోతి, లక్ష్మణ్‌బాబు తదితరులతో కలిసి ఆయన మీడియా తో మాట్లాడారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ స ర్కార్ అనుసరిస్తున్న జలవిధానంపై నిప్పులు చెరిగారు. కాళేశ్వరం ప్రాజెక్టు మరమ్మతుల విషయంలో మంత్రి ఉత్తమ్ చెప్తున్న కుంటిసాకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి ఉత్తమ్‌కు, సీఎం రేవంత్‌రెడ్డికి సిగ్గుంటే తక్షణమే పంపులు ప్రారంభించి నీటిని ఎత్తిపోసి జలాశయాలు నింపాలని డిమాండ్ చేశారు. లక్షల క్యూసెకుల నీటిని వృథాగా కిందికి పారదోలుతున్న అంశంలో అధికారులు, కాంగ్రెస్ నాయకులను రైతులు గల్లా పట్టి అడుగాలని పిలుపునిచ్చారు. ప్రభుత్వం స్పందించి వెంటనే పంపులను ఆన్‌చేసి నీటిని ఎత్తిపోయకుంటే యాభై, 60 వేల మందితో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడించి తామే పంపులను ఆన్‌చేస్తామని రేవంత్ సర్కార్‌కు అల్టిమేటం జారీ చేశారు.
కాళేశ్వరం అనేది తెలంగాణ రాష్ర్టానికి కేసీఆర్ ఇచ్చిన వరం. ఇప్పటికీ మేడిగడ్డ వద్ద లక్ష క్యూసెక్కుల నీళ్లు వృథాగా సముద్రంలోకి పోతున్నయ్. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రైతాంగానికి తీరని అన్యాయం చేస్తున్నది. ఈ విషయంలో రైతాంగం ఆలోచించాలె. కలసి కట్టుగా ఉండి ప్రభుత్వాన్ని నిలదీయాలె.
-కేటీఆర్
రైతుల గోస చూడలేక కన్నెపల్లికి వచ్చినం. కేసీఆర్ చెప్తే ఇక్కడికి వచ్చినం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, మొద్దునిద్ర రైతాంగానికి ఎలా చేటు చేస్తున్నదో వివరించేందుకు వచ్చినం. గోదావరిలో వృథాగా పోతున్న నీటిని చూపేందుకు వచ్చినం. రైతన్నల్లారా.. రేవంత్ సర్కార్ చేస్తున్న మోసాన్ని చూడండి అని చెప్పేందుకే మేము కన్నెపల్లికి వచ్చినం. అంతేతప్ప ఇందులో రాజకీయ కోణమేదీ లేదు.
-కేటీఆర్
కన్నెపల్లి పంప్‌హౌస్ పరిశీలనకు కేటీఆర్‌తోపాటు బయల్దేరిన బీఆర్ఎస్ బృందాన్ని జనగామ జిల్లా పెంబర్తి వద్ద జాతీయ రహదారిపై బారికేడ్లు పెట్టి అడ్డుకుంటున్న పోలీసు బలగాలు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ శ్రేణులు, పోలీసులకు మధ్య తోపులాట ఉద్రిక్తతకు దారితీసింది.
కన్నెపల్లి పంపుహౌస్‌లోకి ప్రవహిస్తున్న జలాలను పరిశీలిస్తున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఆయన వెంట పార్టీ ప్రధాన కార్యదర్శి జీవన్‌రెడ్డి, మంత్రులు జగదీశ్‌రెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల, సత్యవతి, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి, నేతలు వినోద్‌కుమార్, బాల్క సుమన్ తదితరులు
రైతుల ప్రయోజనాల దృష్ట్యా రాజకీయాలు పకనబెట్టి వెంటనే కాళేశ్వరం పంపులను ప్రారంభించి సాగునీరు విడుదల చేయాలని కేటీఆర్ కోరారు. ‘రైతులకు మించిన ప్రయారిటీ రాష్ర్టాధినేతకు ఉండకూడదు. కానీ, రేవంత్ రెడ్డి ప్రయారిటీ ఏందో.. ఆయన ప్రాధాన్యతా క్రమమేందో మాకే అర్థమైతలేదు’ అని పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ అయిన కాళేశ్వరాన్ని జాతికి అంకితం చేసినా, ఆ ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తించే స్పృహ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి లేకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు.
కాళేశ్వరం ప్రాజెక్టును వారం రోజులు కేసీఆర్‌కు అప్పగిస్తే మేడిగడ్డను రిపేర్ చేసి, రాష్ట్ర మంతా నీళ్లు పారించి సస్యశ్యామలం చేసి చూపిస్తామని కేటీఆర్ సవాల్ విసిరారు. ‘కండ్లముందట లక్షల క్యూసెక్కుల నీరు వృథాగా సముద్రంలోకి పోతున్నాయి. గోదావరి నుంచి వస్తున్న పాయను కన్నెపల్లికి మళ్లిస్తే నీళ్లు మేడిగడ్డను ముట్టుకోకుండా ఎత్తిపోయవచ్చు’ అని వివరించారు. కన్నెపల్లి వద్ద పంప్‌లు ఆన్‌చేస్తే పదమూడున్నర కిలోమీటర్లు గ్రావిటీ ద్వారా అన్నారం చేరుతాయని, అక్కడి నుంచి 93 మీటర్ల నుంచి ఎత్తిపోస్తే తెలంగాణ అంతా నీరు పారించవచ్చని సూచించారు.
‘నల్లగొండ, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్ రైతన్నలారా ఇటు చూడం డి. నీళ్లు వృథాగా పోతున్నయి. ప్రభుత్వం సోయి లేకుండా రైతులను మోసం చేస్తున్నది. ఈ అన్యాయంపై ఆలోచనలు చేయండి.. కేసీఆర్ ఉంటే పరిస్థితి ఇలా ఉండేదా? ఇతర ఖర్చులు పక్కన పెట్టయినా సరే రైతు బంధు వేస్తుండె.. పంటలకు నీళ్లిస్తుండె.. పంటలు కొంటుండే’ అని కేటీఆర్ గుర్తుచేశారు. ‘కేసీఆర్ సృష్టించిన అద్బుతం కాళేశ్వరంతో తెలంగాణ రాష్ట్రం దేశానికి అన్నం గిన్నెగా మారింది’ అని తెలిపారు. ‘ప్రభుత్వం దిగివచ్చి సమస్యను పరిష్కరించకుంటే పార్టీ అధినేత కేసీఆర్‌తో సంప్రదించి అవసరమైతే త్వరలోనే 50-60 వేల మందితో కన్నెపల్లి పంప్‌హౌస్‌ను ముట్టడిస్తం. మేమే కన్నెపల్లి పంపులను ఆన్‌చేసి తెలంగాణ అంతా నీళ్లు పారిస్తం’ అని అల్టిమేటం జారీ చేశారు. రైతులకు ఎప్పుడూ బీఆర్ఎస్ అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
కాళేశ్వరం ప్రాజెక్ట్ తెలంగాణకు వరప్రదాయిని అని కేటీఆర్ పునరుద్ఘాటించారు. ఇది కేసీఆర్ సంకల్ప బలంతో చేపట్టిన మహాయజ్ఞమని అభివర్ణించారు. ‘కాలంతో పోటి పడుతూ సముద్ర మట్టానికి 80 మీటర్ల నుంచి 600 మీటర్ల పైకి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కాళేశ్వరాన్ని రి కార్డు స్థాయిలో మూడున్నరేండ్లలో ని ర్మించి చరిత్ర సృష్టించినం. కాళేశ్వరం అంటే ఒక్క మేడిగడ్డ బారాజో.. ఒక్క రి జర్వాయరో.. ఒక్క పంప్ హౌసో, ఒక్క సబ్స్టేషనో కాదు. ప్రాజెక్టులో భాగంగా 15 రిజర్వాయర్లు ఉన్నయ్. 21 పంప్‌హౌస్‌లు, 19 సబ్ స్టేషన్లు, 203 కి.మీ సొరంగ మార్గాలు, 1,531 కిలో మీటర్ల కాలువలు, 98 కిలోమీటర్ల పెజర్ మొత్తం కలిపి 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన ఎన్నో అద్భుతాల సమాహారమే కాళేశ్వరం ప్రాజెక్టు’ అని వివరించారు.
రైతులను మించిన ప్రయారిటీ రాష్ట్ర అధినేతకు ఉండకూడదు. కానీ, ఇవ్వాళ పయారిటీ ఏందో? ఆయన ప్రాధాన్యతా క్రమం ఏందో మాకే అర్థమైతలేదు. రైతుల కోసం అందరం అండగా ఉండాలె. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టయిన కాళేశ్వరాన్ని జాతికి అంకితం చేసినా, ఆ ప్రాజెక్టు ప్రాముఖ్యతను గుర్తించే స్పృహ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి, మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డికి లేకపోవడం బాధాకరం.
-కేటీఆర్

తొమ్మిదన్నరేండ్లలో కేసీఆర్ ప్రభుత్వం రైతుల కోసం రూ.5 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కేటీఆర్ వివరించారు. లక్ష కోట్లు విద్యుత్తు సదుపాయల కోసం రూ.50 వేల కోట్లు రైతులకు ఉచిత కరెంట్ మీద ఖర్చు చేశామని, రూ.73 వేల కోట్లు రైతుబంధు, 29 వేల కోట్లు రెండుసార్లు లక్ష రూపాయల చొప్పున రుణ మాఫీ కోసం ఖర్చు చేశామని తెలిపారు. రూ. లక్షా 80 వేల కోట్లు ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల కోసం కేసీఆర్ ప్రభుత్వం ఖర్చు పెట్టడం వల్లే దేశానికే బువ్వపెట్టే అవ్వగా తెలంగాణ మారిందని గుర్తుచేశారు. రైతు ప్రయోజనాల కోసం కేసీఆర్ చేసిన ఖర్చు వల్లే ఇంత సంపద పెరిగిందనే విషయం మరచిపోవద్దని, కాళేశ్వంపై అబద్ధాలు చెప్పడం మానుకోవాలని కాంగ్రెస్ సర్కార్‌కు హితవు పలికారు.
తమ్మిడిహట్టి సామర్థ్యం 16 టీఎంసీలేనని, కానీ కాళేశ్వరం ప్రాజెక్టు రూపకల్పనతో అది 142 టీఎంసీలకు పెంచింది కేసీఆర్ అని కేటీఆర్ గుర్తుచేశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం 370 పిల్లర్లున్న మూడు బరాజ్‌లలో ఒక్క బరాజ్‌లోని ఒక్క బ్లాక్‌లో రెండు పిల్లర్లు మాత్రమే కుంగాయని, అదీ ఎన్నికల సమయంలో కుంగడం వల్ల అనేక అనుమానాలున్నాయని చెప్పారు.
కుంగిన పిల్లర్లు.. లేదా మొత్తం బ్లాక్ తిరిగి నిర్మించినా రూ.400 కోట్ల ఖర్చవుతుందనీ, అదీ ప్రజలపై భారం పడకుండా తామే నిర్మిస్తామని ఎల్అండ్టీ ఇప్పటికే అనేక సందర్భా ల్లో ప్రకటించిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజె క్ట్ ద్వారా 40 లక్షల ఎకరాలకు నీరందించే బృహత్తర ప్రాజెక్ట్‌ను కేసీఆర్ మీద కోపంతో పడావుపెట్టడం దుర్మార్గమని మండిపడ్డారు.
కాళేశ్వరం కాల పరీక్షలకు నిలబడే ప్రాజెక్ట్ అని కేటీఆర్ వివరించారు. మూడు సీజన్లలో సాగునీరు అందించే ప్రాజెక్ట్ కాళేశ్వరమని తెలిపారు. ‘ప్రతి సారీ మేడిగడ్డ నుంచి నీళ్లు లిఫ్ట్ చేసే అవసరం లేదు. అధిక వర్షాలు పడితే మోటర్లు ఆన్‌చేసే అవసరం లేదు. ఎస్సారెస్పీ నిండితే మిడ్ మానేరు నుంచి నీళ్లు పంపించవచ్చు. సాధారణ వర్షపాతం పడితే ఎస్సారెస్పీ నుంచి కడెం మీదుగా ఎల్లంపల్లి నుంచి లిఫ్ట్ చేసి పంపించవచ్చు. మూడు బరాజ్‌లలో నీరు నిల్వ ఉంచుకుంటే పంపులు ఆన్ చేయకుండా పంపించవచ్చు. వర్షాలు పడకుంటే, కరువులు, ఎల్ నినో, సూపర్ ఎల్ నినో వంటి పరిస్థితులు వచ్చినా తెలంగాణ రైతాంగానికి నీరందించే అవకాశం ఉన్నది.
అది కన్నెపల్లి పంప్ నుంచే సాధ్యమనే విషయాన్ని ముందుచూపుతో కేసీఆర్ గుర్తించారు’ అని వివరించారు. ‘సీడబ్ల్యూసీ లెక్కల ప్రకారం గోదావరి మీద ఎక్కడ నీళ్లు దొరుకుతాయంటే కన్నెపల్లి పంప్‌హౌస్ వద్ద అని గుర్తించే కేసీఆర్ ఇక్కడ పునాది వేశారు’ అని తెలిపారు. ‘కేసీఆర్ చెప్తే కన్నెపల్లికి వచ్చినం. రైతుల గోస చూడలేక ఇక్కడికి వచ్చినం. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యం, మొద్దునిద్ర రైతాంగానికి ఎలా చేటు చేస్తున్నదో వివరించేందుకు వచ్చినం. గోదావరిలో వృథాగా పోతున్న నీటిని చూపేందుకు వచ్చినం’ అని చెప్పారు. వాతావరణ శాస్త్రవేత్తలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు మూడు నెలల నుంచి హెచ్చరిస్తున్నా కాంగ్రెస్ ప్రభుత్వం నిద్ర నటిస్తున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు.
తమ పర్యటనపై ఇంత నిర్బంధం ఎందుకని రేవంత్ సర్కార్‌ను కేటీఆర్ ప్రశ్నించారు. ‘రైతాంగం ఇబ్బందులు పడుతున్నది. ప్రభుత్వ నిర్లక్ష్యంతో గోదావరిలో లక్షల క్యూసెక్కుల నీరు దిగువకు పోతున్న విషయాన్ని చూపి, రేవంత్ ప్రభుత్వ దురుద్దేశాన్ని ఎండగడుదామని బయలుదేరితే దారిపొడవునా పోలీసులను పెట్టి నిర్బందించిండ్రు. ఇంత దుర్మార్గమా?’ అని నిప్పులు చెరిగారు. సాధారణంగా హైదరాబాద్‌లో బయలుదేరిన తమకు కన్నెపల్లి రావడానికి నాలుగు గంటలు పడితే ఇప్పుడు పోలీసులు అడ్డుకోవడం వల్ల ఏడెనిమిది గంటలు పట్టిందని తెలిపారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పెంబర్తి నుంచి పోలీసుల ఆంక్షలు, అడ్డగింతలు మొదలయ్యాయని వివరించారు.
స్టేషన్‌ఘన్‌పూర్, పరకాల, భూపాలపల్లి, కాటారం, మహదేవ్పూర్ ఇలా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రధాన రహదారిపై బారికేడ్లు పెట్టి తమను అడ్డుకుంటే ప్రభుత్వానికి వచ్చిన లాభమేంది? అని ప్రశ్నించారు. ఉమ్మడి నల్లగొండ, కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్ నాయకులు, శ్రేణులను గృహనిర్బంధం చేశారని మండిపడ్డారు. తమ పర్యటన ఎవరినో విమర్శించడానికో, నిందించడానికో కాదని, రాజకీయం చేయడానికి అస్సలే కాదని స్పష్టం చేసినా పోలీసు ఆంక్షలు కొనసాగడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తంచేశారు.
‘కృష్ణా, గోదావరి జలాలు తెలంగాణను ఒరుసుకుంటూ పారినా మా నేల నీటి కోసం తండ్లాడింది. బాసరలో ప్రవేశించే గోదావరి భద్రాచలం వరకు వందల కిలోమీటర్లు తెలంగాణ తలాపునే ప్రయాణిస్తున్నా దశాబ్దాలుగా తెలంగాణ ఎడారిగానే మిగిలిపోయింది. అందుకే ‘తలాపునే పారుతుంది గోదారి.. మన చేను, మన చెలక ఎడారి’ అని పాడుకున్న పరిస్థితులను చూసి కేసీఆర్ గులాబీ జెండా ఎగురవేసి నీళ్లు.. నిధులు.. నియామకాలు’ అనే ట్యాగ్ లైన్‌తో తెలంగాణ ఉద్యమాన్ని మొదలుపెట్టారు’ అని కేటీఆర్ గుర్తుచేశారు. సుదీర్ఘ ఉద్యమాల ఫలితంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం.. పదేండ్ల కేసీఆర్ పాలనలో నీటిని ఎలా సాధించుకున్నదో ప్రపంచమే కీర్తించిందని పేర్కొన్నారు. సొంతంగా కేసీఆర్ రైతు గనుక.. ఒకరైతు ముఖ్యమంత్రితో రైతుకు ఏం లాభం ఉంటుందో ఆచరించి చూపారని వివరించారు. ‘రైతులకు కేసీఆర్ పాలన స్వర్ణయుగమైతే .. రేవంత్ పాలన శనేశ్వరంలా దాపురించిందనే అభిప్రాయం నెలకొన్న మాట వాస్తం కాదా?’ అని ప్రశ్నించారు.

తమ్మిడిహట్టి ప్రాజెక్టును మళ్లీ తెరమీదికి తెస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో, మహారాష్ట్ర రాష్ర్టాల్లోనే కాకుండా కేంద్రంలో అధికారంలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వాలే. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు ఎత్తును 152 మీటర్లతో కడితే ఎట్టిపరిస్థితుల్లోనూ ఒప్పుకోబోమని ఆ ప్రభుత్వాలు చెప్పిన మాట నిజం కాదా? అంతర్రాష్ట్ర జలవివాదం తెరపైకి వస్తుందన్న విషయం నిజంకాదా? ముంపు సమస్యను మహారాష్ట్ర ముందుపెట్టి తాము ఎట్టిపరిస్థితుల్లో ఒప్పుకోబోమని తేల్చిచెప్పిన విషయం నిజంకాదా? అప్పుడు వద్దన్న ప్రాజెక్టును.. అప్పుడు వివాదాస్పద ప్రాజెక్టును ఇప్పుడెందుకు తిరిగి తెరమీదికి తెస్తున్నారనే విషయం తెలంగాణ ప్రజలకు తెల్వదా?’ అని కేటీఆర్ ప్రశ్నించారు. ఎలాంటి వివాదం లేకుండా.. ఇటు తెలంగాణ, అటు మహారాష్ట్రలో ముంపు సమస్య అసలే లేకుండా కాళేశ్వరాన్ని కేసీఆర్ అద్భుతమైన ప్రాజెక్టుగా రూపొందించి రికార్డు స్థాయిలో నిర్మించింది వాస్తవం కాదా? అని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీశారు. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ), భౌతిక శాస్త్రవేత్తలు, వ్యాప్కోస్, నిపుణులైన ఇంజినీర్లతో కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి తెలంగాణను సస్యశ్యామలం చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని కొనియాడారు.
మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డివి అన్నీ ఉత్తమాటలేనని కేటీఆర్ కొట్టిపారేశారు. కాళేశ్వరంతో సంబంధం లేకుండానే తాము రికార్డు స్థాయిలో పంట పండించామని, అందుకు తాము చేసిన కొనుగోళ్లే నిదర్శమని మంత్రి ఉత్తమ్ పేర్కొనడాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ‘కాళేశ్వరం కట్టకముందు.. అదీ 2014కు ముందు కాంగ్రెస్ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నయ్ కదా! మరి అప్పుడెందుకు ఇంత పంట పండలేదు? ఇప్పుడే ఎందుకు పండిందో చెప్పాలి?’ అని డిమాండ్ చేశారు. తమ నాయకుడు కేసీఆర్ అద్భుత విజన్ వల్ల కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణమైందని, తద్వారా తెలంగాణలో పంటలు పండాయని, అన్ని వర్గాల ప్రజలకు సంపద పెరిగిందనే విషయం అందరి అనుభవంలో ఉన్నదని గుర్తుచేశారు.
‘కాళేశ్వరం రైతు ఆత్మహత్యలను ఆపింది. భూముల విలువను పెంచింది. తెలంగాణ రైతుకు విలువను పెంచిన ప్రాజెక్టు కాళేశ్వరం. పంజాబ్, హర్యానాలను తలదన్ని తెలంగాణను నంబర్ వన్‌గా నిలిచింది’ అని ఉదహరించారు. కాళేశ్వరం మొత్తం నిర్మాణానికే రూ.94 వేల కోట్లయితే, లక్ష కోట్ల అవినీతి జరిగిందని ఎట్లా అంటామని స్వయానా ముఖ్యమంత్రి మామనే పేర్కొన్న విషయాన్ని గుర్తుచేశారు. ‘మేడిగడ్డ మరమ్మతులు చేయించేందుకు ‘గుంపు మేస్త్రీ’ దగ్గర సుతార్లు దొరుకుతలేరా?’ అని వివిధ మాధ్యమాల్లో రైతులు చేస్తున్న వ్యాఖ్యలను ఏకరువు పెట్టారు.
కాళేశ్వరం జలాలతో ఉమ్మడి 7 జిల్లాలకు ప్రయోజనం కలుగుతుందని కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌కు తాగునీటిని కాళేశ్వరమే అందించిందని చెప్పారు. అదే ఇప్పుడు హైదరాబాద్‌లో 15 వేల ట్యాంకర్లను కేవలం తాగునీటి కోసమే వినియోగించుకోవాల్సిన దుస్థితి నెలకొన్నదని ఆవేదన వ్యక్తంచేశారు. ఆ ట్రాక్టర్ల సంఖ్య భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉన్నదని తెలిపారు. మరోవైపు కాళేశ్వరంతో భూగర్భ జలాలు పెరిగాయని, కాంగ్రెస్ ప్రభుత్వ మోసపూరిత, ద్రోహపూరిత నిర్లక్ష్యం వల్ల ఇవ్వాళ రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర నీటి ఎద్దడి ఎదురుకాబోతున్నదని ఆవేదన వ్యక్తంచేశారు.
‘కేంద్ర ప్రభుత్వమే నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టుకు అనేకసార్లు అనేక కాఫర్ డ్యామ్‌లు కొట్టుకుపోయినా.. డయాఫ్రంవాల్ కూలిపోయినా ఎన్డీఎస్ఏ ఉలుకదూ..పలుకదు..కానీ, మేడిగడ్డ బరాజ్‌లో 2 పిల్లర్లు కుంగితే మాత్రం 24 గంటల్లో వాలిపోతది’ అని కేటీఆర్ విమర్శించారు. ‘ఈ విషయంలో బీజేపీ, కాంగ్రెస్ ఏమీ మాట్లాడవు. వాళ్లు..వాళ్లు దోస్తులు. రికార్డుస్థాయిలో కేసీఆర్ కాళేశ్వరాన్ని నిర్మించి రైతుల కష్టాలు తీర్చారనే అక్కసు కాంగ్రెస్, బీజేపీకి ఉన్నది. ‘దేశంలో ఎవరూ చేయలేని పని.. మా మోదీ చేయలేని పని కేసీఆర్ ఎట్లా చేసిండు?’ అనేది బీజేపీ కడుపు మంట’ అని దుయ్యబట్టారు.
ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు గురించి తన చిన్నప్పటి నుంచీ చెప్తున్నారని, దశాబ్దాలుగా వింటున్నా ఆ ప్రాజెక్టు ఇప్పటికీ పూర్తి కాలేదని కేటీఆర్ ఏకరువు పెట్టారు. దశాబ్దాలు గడిచినా పోలవరం ఇప్పటికీ పూర్తికాలేదని అదే కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రైతాంగం కష్టాలను శాశ్వతంగా దూరం చేయాలనే తపనతో కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం మూడున్నరేండ్లలోనే పూర్తి అయిందని వివరించారు.
కాళేశ్వరం నీళ్లు ఇవ్వకపోవడం వెనుక రేవంత్‌రెడ్డి భారీ కుట్ర ఉన్నదని, అది రైతాంగాన్ని శాశ్వతంగా దెబ్బతీయడమేనని కేటీఆర్ విమర్శించారు. ‘మేడిగడ్డ బరాజ్‌ను మరమ్మతు చేయిస్తే రైతులకు నీళ్లు ఇవ్వాలి. నీళ్లు ఇస్తే యూరియా సరఫరా చేయాలి. యూరియా సరఫరా చేస్తే పంట కొనాలి. పంట కొనుగోలు చేస్తే ఆ సొమ్ము చెల్లించాలి. దానికి తోడు బోనస్ వేయాలి. ఇన్ని చేసే బదులు అసలు మేడిగడ్డను రిపేర్ చేయకపోతేనే బెటర్ కదా! అనే ఆలోచనకు వచ్చే అద్భుతమైన ప్రాజెక్టును రేవంత్‌రెడ్డి పడావు పెట్టిండు’ అని కేటీఆర్ ధ్వజమెత్తారు. ‘తెలంగాణ నాశనమైనా పర్వాలేదనే ఉద్దేశంతోనే కాళేశ్వరం నీళ్లు ఇవ్వకుండా బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే లక్ష్యంతోనే ముందుకు పోతున్నరు’ అని విమర్శించారు. రాష్ర్టానికి కాళేశ్వరం కేసీఆర్ ఇచ్చిన అద్భుత వరమని, రాష్ర్టానికి పట్టిన శనేశ్వరం రేవంత్‌రెడ్డి అని జగిత్యాల సభలో జీవన్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు.