Telangana Assembly | హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో గాడితప్పిన శాంతిభద్రతలపై చర్చతో ఇటు శాసనసభ, అటు శాసన మండలి దద్దరిల్లిపోయాయి. 9రోజులపాటు జరిగిన సమావేశాల్లో రెండు రోజుల పాటు ఈ అంశంపై ఉభయసభల్లో హాట్‌హాట్ చర్చ జరిగింది. పదేండ్లలో ఒక్కటంటే ఒక్క అవాంఛనీయ ఘటన జరగలేదని, కేవలం ఆరు నెలల్లోనే శాంతి భద్రతలు అదుపుతప్పి నేరాలు పెరిగిపోయాయని విపక్షాలు మండిపడ్డాయి. శాంతిభద్రతలపై చర్చకు పట్టుబట్టడంతో తగిన చర్యలు తీసుకుంటున్నామని ప్రభుత్వ పెద్దలు చెప్పారు తప్ప ఆరునెలల్లో జరిగిన హత్యలెన్ని? లైంగికదాడులెన్ని? దోపిడీల, దొంగతనాలెన్ని? వైట్ కాలర్ మోసాలు ఎన్ని? ఎస్సీ, ఎస్టీలపై జరిగిన నేరాలెన్ని? అరికట్టేందుకు ఏం చర్యలు తీసుకున్నారనే విషయాలను సవివరంగా సభ్యులకు తెలియజెప్పలేదు.
ఆర్నెళ్ల నుంచి రోజూ రాష్ట్రంలో హత్యలు జరుగుతున్నాయని, ఒక్కోరోజు నాలుగైదు లైంగికదాడి కేసులు నమోదయ్యాయని, రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయా? అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డి వంటి వారు అధికార పక్షాన్ని నిలదీశారు. రాత్రి పదిగంటలైతే హైదరాబాద్‌లో పోలీసు రాజ్యం నడుస్తున్నదని, రోడ్డున వెళ్లేవారిని సైతం ఇష్టారీతిన కొడుతున్నారని ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ ఆందోళన వ్యక్తంచేశారు.
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త క్రిమినల్ చట్టాలపై రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సభలో డిమాండ్ చేశారు. ఇంతకు మునుపే ఈ విషయంపై రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. కొత్త క్రిమినల్ చట్టాల్లోని పలునిబంధలు, సెక్షన్లు ప్రజల హకులు, స్వేచ్ఛను హరించేలా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. పోరాటాల గడ్డ అయిన తెలంగాణలో ధర్నాలు చేసుకునేందుకు కూడా ఎన్నో అడ్డంకులు ఉన్నాయని తెలిపారు. కొత్త చట్టాల ప్రకారం ప్రభుత్వ చర్యలకు వ్యతిరేకంగా నిరాహార దీక్ష చేయడం నేరమని, ఇది అత్యంత దురదృష్టకరమని పేరొన్నారు.
ప్రజల హకుల కోసం పోరాటం చేసే పౌరులకు ప్రమాదకారిగా మారుతుందని చెప్పారు. గతంలో ఉన్న 15 రోజుల పోలీసు కస్టడీ ఇప్పుడు 90 రోజులకు పెంచారని, ఆగడువులో ఎన్ని సార్లయినా కస్టడీలోకి తీసుకునే అవకాశం కల్పిస్తున్నదని, తద్వారా నిందితుడికి న్యాయస్థానం బెయి ల్ మంజూరు చేసినా పోలీసులు కస్టడీలోకి తీసుకునే అవకాశముంటుందని తెలిపారు. కాంగ్రెస్ పాలిత రాష్ర్టాలు కొత్త క్రిమినల్ చట్టాలపై సమీక్ష చేసి సవరణలు ప్రతిపాదించాయని, తెలంగాణ ప్రభుత్వ వైఖరి ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. కొత్త చట్టాలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీధర్ చెప్పారు.