హైదరాబాద్, అక్టోబర్ 19 (నమస్తే తెలంగాణ): తమ ప్రభుత్వ హయాంలో పెట్టుబడులను కేటీఆర్ గొడుగుపట్టి స్వాగతించారని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద కొనియాడారు. బీఆర్ఎస్ హయాంలో పెట్టుబడులకు తెలంగాణ స్వర్గధామంగా మారిందని ప్రశంసించారు. కానీ, 22 నెలల కాంగ్రెస్ పాలనలో పరిశ్రమలు వెనక్కి వెళ్లిపోతున్నాయని విమర్శించారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ శంభీపూర్ రాజుతో కలిసి ఆయన మాట్లాడారు.
పదేండ్ల బీఆర్ఎస్ సర్కారు హయాంలో హైదరాబాద్‌కు పెట్టుబడులు తీసుకురావడానికి కేటీఆర్ ఎంతో కృషి చేశారని, ఆయన కృషి వల్ల అధికారిక లెక్కల ప్రకారం 7 లక్షల మంది యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించాయని పేర్కొన్నారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో పెట్టుబడులు రాకపోవడంతో పాటు ఉన్న పరిశ్రమలు కూడా వెనక్కి తరలిపోతున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. శాంతిభద్రతలకు కేసీఆర్ అధిక ప్రాధాన్యం ఇచ్చారని గుర్తుచేశారు. కేసీఆర్, కేటీఆర్ హయాంలో తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని చెప్పారు.
వసూళ్ల కోసం ముఖ్యమంత్రి, మంత్రులు పోటీలు పడుతున్నారని, అందులో సీఎం రేవంత్ నంబర్ వన్ స్థానంలో ఉంటే ఆ తర్వాతి స్థానాల్లో మంత్రులు ఉన్నారని వివేకానంద ఆరోపించారు. వారిలో పొంగులేటి 2వ స్థానంలో, డిప్యూటీ సీఎం భట్టి 3వ స్థానంలో ఉన్నారని ఆరోపించారు. మిగతా మంత్రులు కూడా తామేం తక్కువ తినలేదన్నట్టు వారి వసూళ్లు వారు చూసుకుంటున్నారని పేర్కొన్నారు. గన్లతో బెదిరించి మరీ వసూళ్లకు పాల్పడుతున్నారని, మంత్రి కొండా సురేఖ ఉదంతమే ఇందుకు ఉదాహరణ అని తెలిపారు.
కేసీఆర్ పాలన దేశానికే ఆదర్శమని చెప్పిన ఎంఐఎం నేతలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఇప్పుడు మాట మార్చారని దుయ్యబట్టారు. బీహార్‌లో బీజేపీని గెలిపించేందుకు ప్రయత్నిస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఎంఐఎం మద్దతునివ్వడాన్ని తప్పుబట్టారు. ఆరెస్సెస్ టిల్లు అని సీఎం రేవంత్‌రెడ్డిని విమర్శించిన అసదుద్దీన్ కాంగ్రెస్‌కు ఎలా మద్దతిస్తారని వివేకానంద ప్రశ్నించారు. ఎన్నికల ముందు సైతాన్‌లా కనిపించిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు భగవాన్‌లా కనిపిస్తున్నారా? అని ఎద్దేవా చేశారు.
దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశారని, బోరబండను బంగారుబండగా మార్చారని వివేకానంద కొనియాడారు. జూబ్లీహిల్స్ ఓటర్లు మాగంటి గోపీనాథ్ రుణం తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీతను భారీ మెజార్టీతో గెలిపిస్తారని ధీమా వ్యక్తంచేశారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్‌యాదవ్ నామినేషన్ ర్యాలీ అట్టర్ ఫ్లాప్ అయిందని పేర్కొన్నారు. హైదరాబాద్ బీఆర్ఎస్కు కంచుకోట అని, గత ఎన్నికల్లో అన్ని నియోజకవర్గాల్లో విజయం సాధించిందని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి వల్ల తెలంగాణ పరువు పోతున్నదని మండిపడ్డారు. రేవంత్‌రెడ్డి ప్రజా దర్బార్‌కు బదులుగా వసూళ్ల దర్బార్ నడిపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు.