హైదరాబాద్, ఏప్రిల్ 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి సీఎం కేసీఆరే తెలంగాణకు శ్రీరామ రక్ష అని, ఆయన నాయకత్వంలోనే తెలంగాణ సురక్షితంగా ఉంటుందని 27న జరిగిన ఎల్కతుర్తి సభతో అది మరోసారి నిరూపితమైందని కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద పేర్కొన్నారు. కేసీఆర్‌కు దీటైన నాయకుడు తెలంగాణలో ఎవరూ లేరన్నారు. తెలంగాణ భవన్లో మంగళవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభతో కాంగ్రెస్ వెన్నులో వణుకు ఫుట్టిందని చెప్పారు. కేసీఆర్ లేవనెత్తిన ప్రశ్నలకు సమాధానాలు దాటవేస్తున్న కాంగ్రెస్ నేతలు పిచ్చికూతలు కూస్తున్నారని మండిపడ్డారు. కేసీఆర్ సభపై రేవంత్ మీడియాతో చిట్‌చాట్ చేయడం కాదని, నేరుగా మాట్లాడాలని నిలదీశారు. ఆపరేషన్ కగార్‌ను నిలిపివేయాలని కేంద్రాన్ని కేసీఆర్ కోరిన వెంటనే జానారెడ్డి వద్దకు రేవంత్ వెళ్లారని దుయ్యబట్టారు.
కాంగ్రెస్ నేతలకు మైండ్ బ్లాంక్
ఎల్కతుర్తి సభలో కేసీఆర్ చేసిన ప్రసంగంతో కాంగ్రెస్ నేతలకు దిమ్మ తిరిగి మైండ్ బ్లాంక్ అయిందని ఎమ్మెల్యే వివేకానంద అన్నారు. కేసీఆర్ పదేండ్లు ఏం చేశారని మంత్రులు పొంగులేటి, సీతక్క అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో రైతులు, కార్మికులు, పెన్షనర్లు, నిరుద్యోగులు, విద్యార్థులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను గాలికొదిలేసి ‘అందాల పోటీల’ పేరుతో కమాండ్ కంట్రోల్ నుంచే సమీక్షలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్‌రెడ్డి వైఖరిని తప్పుబట్టారు. డబుల్ బెడ్రూం ఇండ్లను ఇందిరమ్మ ఇండ్లుగా మార్చుతున్నారని విమర్శించారు. హైదరాబాద్‌లో తాగునీటి ఎద్దడి ఏర్పడినా రేవంత్‌రెడ్డి సమీక్ష కూడా నిర్వహించడం లేదని మండిపడ్డారు.