చేగుంట, జనవరి 17 : ‘మీరు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు ఎక్కడికి పోయినయ్? సీఎం రేవంత్ సార్ గిదేనా మీ పాలన’ అంటూ మెదక్ జిల్లా నార్సింగి మండలం నర్సంపల్లి తండాలో గిరిజనులు మండిపడ్డారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి శుక్రవారం పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసేందుకు నర్సంపల్లి తండాకు రాగా, గిరిజన మహిళలు ఆయన ఎదుట తమ గోడు వెళ్లబోసుకున్నారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో అనేక హామీలిచ్చి ఇప్పుడు అమలు చేయకుండా తమను మోసం చేసిందని వారు ఆవేదన వ్యక్తంచేశారు. ‘సన్న బియ్యం ఇస్తమంటిరి, రుణమాఫీ అంటిరి, పింఛన్లు పెంచుతమంటిరి, రైతుబంధు ఇస్తలేక పోతిరి, మీరిచ్చిన హామీలు ఎక్కడ పోయినయ్’ అని గిరిజన మహిళలు రేవంత్ సర్కార్‌పై మండిపడ్డారు. తాము కూరగాయలు సాగుచేస్తూ బతుకుతున్నామని, రూ.2 లక్షల రుణమాఫీ కాలేదని, రైతుబంధు వస్తలేదని అన్నారు.