దుబ్బాక, ఆగస్టు 27 : కాంగ్రెస్ ప్రభుత్వం తన తప్పులను కప్పి పుచ్చుకునేందుకు హైడ్రా పేరిట హైడ్రామా అడుతున్నదని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా దుబ్బాకలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి, హైడ్రా పేరిట పేదలను ఇబ్బందులకు గురిచేస్తూ విధ్వంసాన్ని సృష్టిస్తుందని ఆరోపించారు. పంట రుణాల మాఫీ, సంక్షేమ పథకాలను మరిచిపోయేందుకు హైడ్రా పేరిట నాటకాన్ని ప్రారంభించిందని విమర్శించారు. ప్రజాపాలనలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. గ్రామాల్లో పారిశుద్ధ్యం పడకేసిందని, ప్రజలు డెంగ్యూ, మలేరియా, చికున్‌గున్యా, విష జ్వరాలతో బాధపడుతున్నారని, దవాఖానలకు పోతే అక్కడ సరైన వైద్య సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రత్యేకాధికారుల పాలనలో గ్రామాలు అస్తవ్యస్తంగా మారాయని విమర్శించారు.