హైదరాబాద్, మార్చి 17 (నమస్తే తెలంగాణ): తన నియోజకవర్గం దుబ్బాకలోని జ్యోతి బాపూలే గురుకుల పాఠశాలలో ఆరో తరగతి చదివే విద్యార్థి ఉరేసుకొనే పరిస్థితి ఎందుకు వచ్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఘటన జరిగిన మూడు రోజులు అవుతున్నా విషయం బయటకు పొక్కకుండా ఎందుకు గోప్యంగా ఉంచారని నిలదీశారు. విషయాన్ని బయటికి చెప్పొందంటూ వార్డెన్‌ను కలెక్టర్, ఆర్డీవో హెచ్చరించారని తెలిపారు.
సోమవారం అసెంబ్లీలో గురుకుల పాఠశాలల్లో వసతులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రభుత్వ హాస్టల్స్, గురుకులాల్లో పరిస్థితులు దుర్భరంగా ఉన్నాయని, 15 నెలల్లో 83 మంది విద్యార్థులు చనిపోయారని ఆందోళన వ్యక్తంచేశారు. ఫుడ్ పాయిజన్, పాము కాటు నిత్య కృత్యంగా మారాయని చెప్పారు.
గురుకులాల్లో పరిస్థితులను మార్చాలని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా కల్పించాలని ప్రభాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. మంత్రి సీతక్క స్పందిస్తూ అస్వస్థతకు గురైన దుబ్బాక గురుకుల విద్యార్థికి హైదరాబాద్‌లోని నీలోఫర్ దవాఖానలో చికిత్స అందిస్తున్నామని వెల్లడించారు. విద్యార్థుల సంరక్షణ, గురుకులాల బలోపేతానికి కృషిచేస్తున్నామని పేర్కొన్నారు.