Komatireddy Raj Gopal Reddy | హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): సాక్షాత్తు అసెంబ్లీ వేదికగా మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి సొంత ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నిధులన్నీ ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలకే తీసుకెళ్తున్నారని, మిగతా ఎమ్మెల్యేల పరిస్థితేమిటని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు లేకుండానే ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎ
మ్మెల్యేలు, నియోజకవర్గాలు, ప్రజలపై సీఎం, మంత్రులు వివక్ష చూపెడుతున్నారని అసహనం వ్యక్తంచేశారు. నిధులన్నీ, అభివృద్ధి కార్యక్రమాలన్నీ ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకు, సీఎం రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌కు తరలిస్తున్నారని, అలాంటప్పుడు మిగిలిన నియోజకవర్గాలు, ప్రజలు ఏం కావాలని ప్రశ్నించారు. బిల్లుల కోసం మంత్రులు, సీఎం వద్ద అడుక్కోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఇదేం పద్ధతని నిలదీశారు. కొడంగల్ ప్రజలు గెలిపిస్తేనే తాను ముఖ్యమంత్రి అయ్యానని, కొడంగల్‌కు అన్ని రకాల పనులు మంజూరు చేసి అభివృద్ధి చేసుకుంటానని రేవంత్‌రెడ్డి పదే పదే చెప్తున్నారని, అలాంటప్పుడు ఒక శాసనసభ్యుడిగా రాజగోపాల్‌రెడ్డికి కూడా తన ప్రాంత ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత ఉండదా? అని ప్రశ్నించారు.
హుజూర్‌నగర్‌లో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రతి ఎకరాకూ నీళ్లు ఇస్తున్నారని, ప్రతి ఐదువేల ఎకరాలకూ ఒక లిఫ్ట్ పెడుతున్నారని, కానీ తమ నియోజకవర్గానికి ఒక లిఫ్ట్లేదని, కాలువ లేదని, చెరువు లేదని ఇలాగైతే మునుగోడు ప్రజలు ఏం కావాలని ప్రశ్నించారు. తనను ఎన్నుకున్న ప్రజలకు ఏం సమాధానం చెప్పాలని నిలదీశారు. తనకు మాట్లాడటం చేతకాదా? అని ఆగ్రహం వ్యక్తంచేశారు. సొంత ప్రభుత్వం ఉండి కూడా తన ప్రజలకు న్యాయం చేయలేకపోతే, మాట్లాడకపోతే నేరమని అన్నారు. ఒకవేళ తమ ప్రాంత ప్రజలకు న్యాయం చేయలేకపోతే ఈ పదవిలో ఉండటం కూడా అన్యాయమని, ఉండేందుకు అనర్హుడునని వ్యాఖ్యానించారు.
ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వని ప్రభుత్వం.. ఇదేం దిక్కుమాలిన ప్రభుత్వం
రేవంత్ రెడ్డిపై, సొంత ప్రభుత్వంపై మరోసారి మండిపడ్డ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి కొడంగల్‌ను అభివృద్ధి చేసుకున్నట్లు, నాకు నా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఉండదా?
భట్టి విక్రమార్క మధిర… pic.twitter.com/FX9fk4fiml
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2026
‘రెండున్నరేండ్లుగా బాధపడుతూ మనోవేదన చెందుతున్నాను. ఇప్పుడు సమయం వచ్చింది కాబట్టి, అన్నీ అంశాలను బయటపెడుతున్నాను’ అని రాజగోపాల్‌రెడ్డి తెలిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నేతృత్వంలోని ఈ ప్రభుత్వం ప్రాంతాలు, నియోజకవర్గాలు, ప్రజల మీద వివక్ష చూపించొద్దని కోరారు. అందర్నీ సమానంగా చూడాలని, వారంతా తెలంగాణ ప్రజలేనని గుర్తించాలని హితవు పలికారు. ఉదయసముద్రం కాలువలు పూర్తి చేసి నల్లగొండ, మునుగోడు, నకిరేకల్ నియోజకర్గాల్లోని లక్ష ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
బడ్జెట్లో విద్యారంగానికి నంబర్ 1 ప్రాధాన్యం ఇవ్వాల్సి ఉండగా, ఈ ప్రభుత్వం అత్యంత తక్కువగా నిధులు కేటాయించిందని రాజగోపాల్‌రెడ్డి విమర్శించారు. దేశంలో అన్ని రాష్ర్టాలతో పోల్చితే విద్యకు అత్యంత తక్కువగా 8.2% నిధులు కేటాయించింది తెలంగాణ ప్రభుత్వమని విమర్శించారు. ఎక్కడో పొరపాటు జరుగుతున్నదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ల పరిస్థితి దారుణంగా ఉన్నదని, ఇప్పటికైనా అధిక నిధులు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కను కోరారు. ప్రభుత్వ హాస్టళ్లలో యుద్ధ ప్రాతిపదికన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను నియోజకవర్గానికి ఒకటి కాకుండా ప్రతి మండలానికి ఒకటి ఏర్పాటు చేయాలని సూచించారు. ప్రభుత్వ స్కూళ్లల్లోకి వెళ్లేందుకు ఎవరూ ఆసక్తి చూపించడంలేని ఆవేదన వ్యక్తంచేశారు. మౌలిక వసతులు కూడా ప్రభుత్వాలు కల్పించడంలేదని దుయ్యబట్టారు. సింగిల్ టీచర్ స్కూళ్లను ప్రీ స్కూళ్లుగా కన్వర్ట్ చేయాలని సూచించారు. కేజీబీవీల్లో 350 మంది విద్యార్థినులు ఉంటే వాష్‌రూమ్‌కు వెళ్లేందుకు మూడు గంటలు వేచి ఉండాల్సి వస్తున్నదని ఆ పిల్లలు ఆవేదన వ్యక్తంచేస్తున్నారని తెలిపారు. అక్కడ అనేక సమస్యలున్నాయని పేర్కొన్నారు.
అసెంబ్లీలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు లేని లోటు తీరుస్తున్న రాజగోపాల్ రెడ్డి
నిధులు మొత్తం ముగ్గురు మంత్రులున్న ఖమ్మం జిల్లాకే పోతున్నాయని బైట టాక్ నడుస్తుంది
రేవంత్ రెడ్డి కొడంగల్ నియోజకవర్గానికి పదే పదే నిధులు తీసుకుపోతా అన్నప్పుడు.. నా ప్రజలకు కూడా న్యాయం చేయాల్సిన బాధ్యత నాకు… https://t.co/ERa1fe0V0n pic.twitter.com/gfgg7rni4c
— Telugu Scribe (@TeluguScribe) March 29, 2026
‘రిజర్వాయర్లు పూర్తి చేసి హెడ్‌వర్క్ పూర్తి చేయకుండా, కాలువలు తవ్వకుండా పొలాలకు నీళ్లు ఎలా వస్తాయి? పనులు నత్తనడకన సాగుతున్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు రావడం లేదు. ప్రస్తుతం డిండి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ పనులు ఎక్కడివక్కడే ఆగిపోయాయి. అధికార పార్టీ ఎమ్మెల్యేగా అత్యంత బాధతో ఈ విషయం చెప్తున్నాను’ అని రాజగోపాల్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాల్లోనే పనులు చేస్తూ, ఆ కాంట్రాక్టర్లకు బిల్లులు ఇస్తున్నారని, ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో మాత్రం బిల్లులు ఇవ్వడం లేదని ఆరోపించారు. ఈ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలు లేకుండానే మంత్రులు, ముఖ్యమంత్రి ఉన్నారా? అని ప్రశ్నించారు. బిల్లుల కోసం మంత్రులు, ముఖ్యమంత్రిని అడుక్కోవాల్సిన పరిస్థితి ఉన్నదని, ఇదేం పద్ధతని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇది చాలా బాధాకరమని, ఎమ్మెల్యేలకు సైతం ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్ చేశారు.