స్టేషన్‌ఘన్‌పూర్, అక్టోబర్ 18: ఎమ్మెల్యే కడియం శ్రీహరి అల్లుడు, ఎంపీ కడియం కావ్య భర్త నజీర్ ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని స్టేషన్‌ఘన్‌పూర్ మాజీ ఎమ్మెల్యే రాజయ్య ఆరోపించారు. శుక్రవారం ఆయన జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మున్సిపాలిటీ పరిధిలోని చాగల్లులో ఆర్ఎస్ కెనాల్‌ను బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి సందర్శించారు.
అనంతరం తెలంగాణ ఉద్యమకారుడు ఇనుగాల నర్సింహారెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో రాజయ్య మాట్లాడారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టరేట్ వరకు ప్రతి పనిలో కమీషన్ తీసుకుంటున్నాడని, ఎవరికి కాంట్రాక్టు ఇవ్వాలి.. ఎవరికి పదవులు ఇవ్వాలనే విషయాలను మొత్తం కడియం అల్లుడే చూసుకుంటున్నారని ఆరోపించారు. ఎంపీ నిధుల పనులకు కాంట్రాక్టర్ల నుంచి 20 శాతం కమీషన్ తీసుకుంటున్నట్టు కాంట్రాక్టర్లు చెప్పుకుంటూ బాధపడుతున్నారని తెలిపారు.