CM Revanth | హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): చట్టసభలకు ఒక పవిత్రత ఉంటుంది. సభ్యులు మాట్లాడే భాషపై నియంత్రణ ఉంటుంది. ఆన్‌పార్లమెంటరీ భాష ఉపయోగించకూడదన్న నియమ, నిబంధనలు ఉన్నాయి. కానీ శాసనసభలో సభా నాయకుడు, మంత్రులు, అధికార కాంగ్రెస్ సభ్యులు ఇవేమీ పట్టించుకోకుండా సభా నియామావళిని ఉల్లంఘించి ఇష్టానుసారంగా ప్రతిపక్ష నాయకులను దూషించే కొత్త సంప్రదాయానికి తెరలేపారు. శాసనసభలో బుధవారం బడ్జెట్‌పై చర్చ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, మాజీ సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి పదేపదే చేసిన వ్యాఖ్యలకు నిరసనగా ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ సభ నుంచి వాకౌట్ చేసే పరిస్థితికి దారితీసింది.
సీనియర్ సభ్యుడు కడియం శ్రీహరి అభ్యంతరం చెప్పగా ఆయనపై కూడా మంత్రి పొన్నం ప్రభాకర్, కాంగ్రెస్ సభ్యుడు కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని ప్రతిపక్ష సభ్యులు కోరినా స్పందనలేకపోవటంతో విధిలేక నిరసనగా సభ నుంచి వాకౌట్ చేశారు. పైగా నల్లగొండ బహిరంగ సభలో తమను కేసీఆర్ దుషించలేదా? అని పాలకపక్ష సభ్యులు సమర్థించుకోవడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.