హైదరాబాద్, సెప్టెంబర్ 23(నమస్తే తెలంగాణ): ‘ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నోటిఫికేషన్లు జారీచేయకుండా రాష్ట్రంలోని ఈ తోలుమందం ప్రభుత్వం నిరుద్యోగుల గోసపుచ్చుకుంటున్నది’ అని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ధ్వజమెత్తారు. ‘రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ నోటిఫికేషన్లను జారీ చేయాలని డిమాండ్ చేస్తూ నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షపై రాష్ట్ర ప్రభు త్వం వెంటనే స్పందించాలి. ఆయనతో దీక్షను విరమింపజేయాలి’ అని ఆయన డిమాండ్ చేశారు.10 రోజులుగా ఆమరణ దీక్ష చేస్తున్న అశోక్‌ను మంగళవారం మాజీ ఎమ్మెల్యేలు కంచర్ల భూపాల్‌రెడ్డి, రవీంద్రనాయక్‌తో కలిసి హైదరాబాద్ ఉస్మానియా దవాఖానలో జగదీశ్‌రెడ్డి పరామర్శించారు.
అశోక్ ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. 10 రోజులుగా ఆమరణ దీక్షలో ఉన్న అశోక్ పరిస్థితి విషమంగా ఉన్నదని, ఆయన షుగర్, బీపీ లెవెల్స్ తగ్గుతున్నాయని, ఇంత జరుగుతుంటే ప్రభుత్వానికి చీమకుట్టినట్టయినా లేదా? అని మం డిపడ్డారు. ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగా లు ఇస్తామని యువతను నమ్మించి కాంగ్రెస్ ప్రభుత్వం దారుణంగా మోసం చేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది ఆ యువత వల్లేనని, కానీ ఇప్పటివరకు 10 వేల ఉద్యోగాలకు కూడా నోటిఫికేష న్లు ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అనేక సందర్భా ల్లో నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడమే లేదని తెలిపారు. ఇదే నిరుద్యోగుల వెంట తిరిగిన కొందరు ఎమ్మెల్సీలయ్యారని, వాళ్లకు మొరపెట్టుకున్నా నిరుద్యోగుల గోడు పట్టించుకోవడం లేదని చెప్పారు. పేదల ఇండ్లను నిర్ధాక్షిణ్యంగా కూలగొడుతున్న ఈ ప్రభుత్వం.. నిరుద్యోగుల దీక్షలకు స్పందిస్తుందన్న నమ్మకం తనకు లేదని తెలిపారు.
సుల్తాన్‌బజార్, సెప్టెంబర్ 23: నిరుద్యోగుల తరఫున ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న నిరుద్యోగుల హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్‌కు ఏం జరిగినా రాష్ట్రం అగ్నిగుండంగా మారుతుందని రాజ్యసభ సభ్యుడు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వ చొరవ తీసుకొని అశోక్‌తో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నోటిఫికేషన్లను సత్వరమే ప్రకటించాలని కోరారు. అశోక్‌ను మంగళవారం ఆయన ఉస్మానియా దవాఖానలో పరామర్శించారు. అనంతరం సచివాలయంలో పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబును కలిసి అశోక్ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. అశోక్ ఆరోగ్యం విషమంగా మారిందని, కిడ్నీలు పాడయ్యే ప్రమాదం ఉన్నదని, ఏదైనా జరుగరానిది జరిగితే నిరుద్యోగులు రాష్ర్టాన్ని అగ్నిగుండంగా మారుస్తారని తెలిపారు. ఆయన వెంట బీసీ సంక్షేమ సంఘం జాతీయ కన్వీనర్ గుజ్జ కృష్ణ, నాయకులు కోన మహేందర్ యాదవ్, రాజు నేత, లింగం యాదవ్, రవి కుమార్‌యాదవ్, బలరాం, కుల్దీప్సింగ్, ప్రవీణ్ ముదిరాజ్, అఖిల్ ముదిరాజ్, అభిగౌడ్, సాయికుమార్, ప్రభాకర్, సాయి మహేందర్ తదితరులు ఉన్నారు.
‘సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా వచ్చి హామీ ఇచ్చి, నిమ్మరసం ఇస్తేనే నిరాహార దీక్ష విరమింపజేస్తా.. లేకుంటే చావనైనా చస్తా’ అని నిరాహారదీక్ష చేస్తున్న నిరుద్యోగ హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ స్పష్టంచేశారు. గత 10 రోజులుగా నిరాహారదీక్ష చేస్తున్న తనను పోలీసులతో నిర్బంధించారే తప్ప, సమస్య పరిష్కారానికి ప్రభుత్వం నుంచి చొరవ చూపనేలేదని మండిపడ్డారు. ఎన్నికల సమయంలో 2 లక్షల ఉద్యోగాలిస్తామని, ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిందని, అధికారంలోకి వచ్చాక వాటిపై చేతులెత్తేసిందని మండిపడ్డారు. 50 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని దీక్ష చేపడితే పోలీసులతో నిర్బంధం విధించడమేమిటని సర్కార్‌ను ప్రశ్నించారు. సిటీ లైబ్రరీ, ఉస్మానియా దవాఖాన చుట్టూ పోలీసులను కాపలా పెట్టడం సరికాదని చెప్పారు. తక్షణమే ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. తన ఆరోగ్యం క్షీణించినా పర్వాలేదని, ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్లు ప్రకటించేంత వరకు, సీఎం రేవంత్‌రెడ్డి వచ్చి నిమ్మరసం ఇచ్చేవరకు దీక్షను విరమించబోనని స్పష్టంచేశారు.
చిక్కడపల్లి,సెప్టెంబర్ 23: ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేయాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ నిరుద్యోగు హక్కుల వేదిక అధ్యక్షుడు అశోక్ గత 10 రోజులుగా చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడాన్ని నిరసిస్తూ మంగళవారం హైదరాబాద్ చిక్కడపల్లిలోని నగర కేంద్ర గ్రంథాలయంలో నిరుద్యోగులు ధర్నా నిర్వహించారు. ప్రభుత్వం నిర్లక్ష్యంపై మండిపడ్డారు. 10రోజులుగా కొనసాగుతున్న దీక్ష ఈ ప్రభుత్వానికి కన్పించడం లేదా? అని ప్రశ్నించారు. అశోక్ ఆరోగ్య పరిస్థితి పై నిరుద్యోగులందరూ ఆందోళన చెందుతున్నారని, ఆయన డిమాండ్లను వెంటనే నేరవేర్చి మెరుగైన వైద్యం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.