హైదరాబాద్, ఫిబ్రవరి 24(నమస్తే తెలంగాణ): ‘ఎస్ఎల్బీసీ టన్నెల్ కూలి మూడు రోజులు దాటింది. ఎనిమిది మంది కార్మికులు ప్రాణాపాయస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. కానీ, సీఎం రేవంత్‌రెడ్డి మానవత్వం మరిచి, శ్రమజీవుల ప్రాణాలను గాలికొదిలి ఎన్నికల ప్రచారానికి వెళ్లడం దుర్మార్గం’ అంటూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ముఖ్యమంత్రికి కార్మికుల ప్రాణాలకన్నా ప్రచారమే ముఖ్యమా? అని ప్రశ్నించారు. సోమవారం ఆయన తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఎస్ఎల్బీసీ ప్రమాద ఘటన ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని ఆరోపించారు. ఘటన జరిగి మూడు రోజులైనా ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత లేకపోవడమే ఇందుకు నిదర్శమని దుయ్యబట్టారు. ఈ విషయంలో ప్రభుత్వానికి బీఆర్ఎస్ సహకరించేందుకు సిద్ధంగా ఉన్నదని చెప్పారు. కానీ సీఎం, మంత్రులు మాత్రం రాజకీయం చేస్తున్నామంటూ తమపై బురదజల్లడం విడ్డూరమని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వ సాయం అడగకుండా, ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్లలో అనుభవం ఉన్న నిపుణులను రప్పించకుండా తాత్సారం చేయడం బాధాకరమని చెప్పారు. ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి హెలికాప్టర్లో చక్కర్లు కొడుతుంటే, మంత్రులు టన్నెల్ వద్ద ఫొటోలకు పొజులు ఇస్తూ బాధ్యాతారహితంగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు.
కేసీఆర్ కూలీలను కాపాడుకున్నరు
తెలంగాణ పునర్నిర్మాణంలో బయటి రాష్ట్రాల కార్మికుల పాత్ర ఎంతో ఉన్నదని భావించి కేసీఆర్ వారిని కాపాడుకున్నారని జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. కరోనా కాలంలో వారికి సరుకులు, బియ్యంతోపాటు నగదు అందించి సురక్షితంగా వారిని సొంత రాష్ట్రాలకు పంపించారని గుర్తుచేశారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం పొరుగు రాష్ట్రాల కూలీలు ఆపదలో చిక్కుకుంటే కనీసం మానవత్వం చూపడంలేదని దుయ్యబట్టారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారానికి ఇచ్చిన విలువ వారి ప్రాణాలకు ఇవ్వడంలేదని విమర్శించారు. ఉమ్మడి రాష్ట్ర పాలకులు ఎవరికీ పనికిరాని ఎస్ఎల్బీసీ ప్రాజెక్ట్‌ను రాష్ట్రంపై బలవంతంగా రుద్దారని దుయ్యబట్టారు. నల్లగొండ జిల్లా ప్రజలకు కృష్ణా జలాలు అందకుండా చేసే కుట్రతోనే ఈ పథకాన్ని ప్రారంభించారని మండిపడ్డారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత కనీస జాగ్రత్తలు తీసుకోకుండా ఆదరాబాదరాగా సొరంగం పనులు చేపట్టి కూలీల ప్రాణాలను బలిపెట్టేందుకు సిద్ధమైందని విమర్శించారు. సీపేజీ ఆగకపోవడంవల్లే గతంలో పనులు ముందుకుసాగలేదనే విషయాన్ని విస్మరించి టన్నెల్ తవ్వకం పనులు చేపట్టిందని దుయ్యబట్టారు. రేవంత్ సర్కారు ఇప్పటికైనా వాస్తవాలు వెల్లడించాలని డిమాండ్ చేశారు.
ఎస్ఎల్బీసీకి మంగళం పాడేందుకే లీకులా?
ఎస్ఎల్బీసీ ప్రమాదం జరిగి మూడు రోజులైనా ఏ ప్రాంతంలో చోటుచేసుకున్నది? టీబీఎం మిషన్‌కు ఎంత దూరంలో ఉన్నది? మధ్యలో ఖాళీ ప్రదేశం ఉన్నదా? అనే విషయాలను ప్రభుత్వం చెప్పలేకపోతున్నదని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. ‘ప్రమాదం గురించి, సహాయ చర్యల గురించి మాట్లాడని ప్రభుత్వం.. తనకు అనుకూలంగా ఉండే మీడియాతో మాత్రం పనికిమాలిన రాతలన్నీ రాయిస్తున్నది. టీబీఎం మిషన్ పనికిరాదని, ప్రత్యామ్నాయ మార్గం కావాలంటూ కథనాలు వండివారుస్తున్నారు. అంటే ప్రభుత్వం ఈ టన్నెల్ పనులకు ప్రత్యామ్నాయం వెతుకుతున్నట్టా? ఎస్ఎల్బీసీకి మంగళంపాడినట్టేనా?’ అంటూ జగదీశ్‌రెడ్డి అనుమానం వ్యక్తంచేశారు.