సూర్యాపేట, సెప్టెంబర్ 7 (నమస్తేతెలంగాణ) : తెలంగాణలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. మంత్రులకు పాలన చేతకావడం లేదని విమర్శించారు. ప్రజల నుంచి వస్తున్న ప్రశ్నలకు సమాధానం చెప్పలేక పోలీసులను అడ్డు పెట్టుకొని పాలన సాగిస్తూ బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, సోషల్ మీడియాపైన అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
సూర్యాపేట జిల్లా దురాజ్‌పల్లికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు షేక్ బాషామియా అక్రమ అరెస్టును ఖండిస్తూ చివ్వెంలలో మీడియాతో మాట్లాడారు. రైతులు యూరియా కోసం క్యూలో నిల్చున్న వీడియో తీసి సోషల్ మీడియాలో పెడితే కేసులేంటని ప్రశ్నించారు.