నల్లగొండ ప్రతినిధి, మే 18 (నమస్తే తెలంగాణ): కేసీఆర్ హయాంలో ఆనందబాష్పాలు రాల్చిన రైతులు.. నేడు కాంగ్రెస్ పాలనలో కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. నాడు చంద్రబాబు, కాంగ్రెస్ హయాంలో రైతులు ఎన్నో తిప్పలు పడగా మళ్లీ చంద్రబాబు శిష్యుడు రేవంత్‌రెడ్డి హయాంలోనూ నాటి కష్టాలే మొదలయ్యాయని ఆందోళన చెందారు. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ప్రజలను గాలికొదిలేసి కేవలం దోచుకోవడం, దాచుకోవడంపైనే సీఎం రేవంత్‌రెడ్డితోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు దృష్టిసారించారని ఆరోపించారు. సోమవారం నల్లగొండ కలెక్టరేట్ ఎదుట మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి ఆధ్వర్యంలో రైతు మహాధర్నా నిర్వహించారు.
ధర్నాకు నల్లగొండ నియోజకవర్గం నుం చి రైతులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలిరావడంతో కలెక్టరేట్ ఆవరణ దద్దరిల్లిపోయింది. ధర్నాకు బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, మాజీ ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రకుమార్, నల్లమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జగదీశ్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులు ధాన్యం అమ్ముకునేందుకు ఎన్నో కష్టాలు పడుతుంటే ప్రభుత్వానికి పట్టింపులేదని విమర్శించారు. రైతులు ప్రభుత్వంపై తిరుగుబాటుకు సిద్ధం కావాలని, అది నల్లగొండ నుంచే జరుగాలని పిలుపునిచ్చారు.
మంత్రుల పర్యటన తరువాత పెరిగిన దోపిడీ
కేసీఆర్ హయాంలో ఇబ్బందుల్లేకుండా ధాన్యం కొనుగోళ్లు చేపట్టిన విషయాన్ని గుర్తుచేశారు. ప్రస్తుతం నల్లగొండ జిల్లా మంత్రులు మూడు నెలలుగా అడ్రస్సు లేకుండా పోయారని జగదీశ్‌రెడ్డి విమర్శించారు. రైతులు నిత్యం రోడ్లెక్కుతుండటంతో ఇటీవల ముగ్గురు మంత్రులు జిల్లాలో పర్యటిస్తే పరిస్థితి మెరుగు పడాల్సింది పోయి.. వాళ్లు వచ్చి వెళ్లాక తరుగు పేరుతో దోపిడీ క్వింటాల్‌కు 10 కిలోల నుంచి 20కిలోలకు పెరిగిందని ఆరోపించారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నది సగం కాంగ్రెస్, సగం చంద్రబాబు, సగం మోదీ కాంగ్రెస్ అని ఎద్దేవా చేశారు. మోదీ, చంద్రబాబుకు పుట్టిన హైబ్రీడ్ కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలో ఉన్నదని దుయ్యబట్టారు. అసలు కాంగ్రెస్ వాళ్లంతా ప్రస్తుతం తీవ్ర బాధలో ఉన్నారని, వాళ్లంతా కేసీఆర్ వైపు చూస్తున్నారని తెలిపారు. ఇప్పటికే తనతో చాలామంది టచ్‌లో ఉన్నారని, కేసీఆర్ నాయకత్వంలో పనిచేసేందుకు సిద్ధమని చెప్తున్నారని వెల్లడించారు. హైబ్రీడ్ కాంగ్రెస్‌ను, రేవంత్ సర్కార్‌ను బొంద పెట్టేందుకు అసలు కాంగ్రెస్, ప్రజలు సిద్ధ్దమవుతున్నారని తెలిపారు.
సమీక్షలో రైతుల ప్రస్తావనేది?: ఆర్ఎస్పీ
తాను 18 గంటలు రివ్యూ చేస్తుంటే అధికారులు వణికిపోతున్నారని ఇటీవల ఒక చానల్ ఇంటర్వ్యూలో సీఎం రేవంత్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ అన్నారు. మరీ 18 గంటల రివ్యూలో ఒక్కరోజైనా రైతుల కష్టాలపై సమీక్ష చేశారా? అని ప్రశ్నించారు. కేవలం రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు, ఎక్కడ ఖాళీ భూమి ఉన్నది? దాన్ని ఎలా కబ్జా చేయాలన్న సమీక్షలే తప్ప మరోటి లేదని దుయ్యబట్టారు. కేసీఆర్ హయాంలో కొనుగోళ్లకు మూడు నెలల ముందు నుంచే సమీక్షలు జరిగేవని గుర్తుచేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి డబ్బుల సంచులు మోస్తూ కప్పం కడుతున్నాడని ఆరోపించారు. ప్రజలు, మహిళలు, బీఆర్ఎస్ కార్యకర్తలు వారం రోజులుగా పెద్ద ఎత్తున రోడ్డు మీదకు వచ్చి పోరాడితేనే బండి భగీరథ్‌ను పోలీసులు అరెస్టు చేసినట్టు చెప్పారు.