హైదరాబాద్, ఫిబ్రవరి 21 (నమస్తే తెలంగాణ): ‘తెలంగాణను ఎండబెట్టి ఏపీకి నీళ్లిస్తరా? మన రాష్ట్ర వాటాగా దాచిపెట్టుకున్న కృష్ణా నీటిని ఏపీ అక్రమంగా తరలిస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు చోద్యం చూస్తున్నది?’ అంటూ మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఏపీ నీటి చౌర్యాన్ని తక్షణమే అడ్డుకోకుంటే తెలంగాణలో సాగు, తాగు నీటికి కటకట ఏర్పడే ప్రమాదం ఉన్నదని హెచ్చరించారు. మాజీ మంత్రి హరీశ్‌రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా సాగునీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి సోయిలేకుండా సొల్లు పురాణం చెప్పారని మండిప్డడారు. రాష్ర్టానికి పొంచి ఉన్న నీటి ఎద్దడి ప్రమాదం గురించి మాట్లాడితే కాంగ్రెస్ నేతలు రాజకీయాలు మాట్లాడుతున్నారని విమర్శించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం మాజీ ఎమ్మెల్యేలు నలమోతు భాస్కర్‌రావు, గాదరి కిశోర్‌కుమార్, భిక్షమయ్యగౌడ్, బొల్లం మల్లయ్యయాదవ్, నోముల భగత్, పార్టీ నేతలు నర్సింహారెడ్డి, వెంకట్, నవీన్కుమార్గౌడ్తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణకు సరైన నీటి వాటా దకకపోవడానికి కాంగ్రెస్, బీజేపీ, చంద్రబాబు, రేవంత్‌రెడ్డే కారణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి తిట్లతో సీఎం అయ్యారని, తాను కూడా అదే భాష మాట్లాడితే సీఎం అవుతానని ఉత్తమ్ అనుకుంటున్నారేమోనని ఎద్దేవాచేశారు. ఏపీ నీటి చౌర్యంపై హరీశ్‌రావు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా రేవంత్‌రెడ్డి మాట్లాడిన చెత్తనే ఉత్తమ్ కేసీఆర్ మీద మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ‘ఉత్తమ్ మాట్లాడాల్సింది నీటిచౌర్యం జరుగుతున్నా పట్టించుకోని కేంద్రం మీద, అక్రమంగా నీటిని తరలిస్తున్న పక రాష్ట్రం చంద్రబాబు మీద’ అని హితవుపలికారు.
కాంగ్రెస్‌ది ద్రోహ చరిత్ర
ఏపీలో ప్రాజెక్టుల మీద జగన్, చంద్రబాబు ఒకే వైఖరి మీద ఉన్నారని, తెలంగాణలో మాత్రం కేసీఆర్ ప్రాజెక్టులు కడుతుంటే కాంగ్రెస్ నేతలు కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్నారని జగదీశ్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. పోతిరెడ్డి పాడు ప్రాజెక్టును వ్యతిరేకించి ఆనాడు తమ పార్టీ నేతలు వైఎస్ క్యాబినెట్ నుంచి బయటకొచ్చారని గుర్తుచేశారు. కాంగ్రెస్ తెలంగాణకు చేసిన ద్రోహ చరిత్ర చాలా ఉన్నదని విమర్శించారు. కృష్ణా జలాల్లో 50 శాతం వాటా కోసం ప్రయత్నిస్తున్నామని ఉత్తమ్ చెప్తున్నారని, ముందు వేసిన పంటలు ఎండిపోకుండా చూడాలని సూచించారు. మోదీకి, చంద్రబాబుకు ఉత్తమ్ భయపడుతున్నారని విమర్శించారు. ‘అవినీతి గురించి కాంగ్రెస్ మాట్లాడుకుంటే అవినీతి అనే పదమే సిగ్గుపడుతుంది. ప్రతి దాంట్లో కమీషన్ అడుగుతున్న కాంగ్రెస్ నేతలా.. కేసీఆర్ గురించి మాట్లాడేది?’ అని ఫైరయ్యారు. మంత్రుల అవినీతి చిట్టా తమ వద్ద ఉన్నదని, ప్రజలు కూడా దీనిపై చర్చించుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. పంటలను కాపాడుకోవడానికి, కృష్ణా జలాల వాటా కోసం బీఆర్ఎస్ ఎంతదూరమైనా వెళ్తుందని స్పష్టంచేశారు.
సోయిలేకుండా సొల్లు పురాణం
కాంగ్రెస్ మంత్రులు కృష్ణా జలాలపై సోయి లేకుండా, అవగాహన లేకుండా సొల్లు పురాణం చెప్తున్నారని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. ఇసుక దోపిడీ కోసం కాళేశ్వరాన్ని ఎండబెట్టారు కాబట్టే గతంలో మాదిరిగా వరంగల్, సూర్యాపేట, మహబూబాబాద్ జిల్లాలకు నీళ్లు రావడం లేదని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘చర్చకు వస్తావా ఉత్తమ్? శ్రీరాంసాగర్ నీళ్లు ఎందుకు రావడం లేదో చర్చిద్దాం’ అని సవాల్ విసిరారు. కేసీఆర్‌ను తిట్టడం బంద్ చేసి కృష్ణా జలాల వాటాను సాధించుకోవడం మీద మంత్రులు దృష్టిపెట్టాలని సూచించారు.
వీళ్లకు నీళ్లను ఎట్ల కొలుస్తరో తెలుసా?
‘సర్పంచ్‌కు కూడా సమాధానం చెప్పలేని స్థాయి కాంగ్రెస్ నేతలది, వీళ్లా కేసీఆర్ గురించి మాట్లాడేది?’ అని జగదీశ్‌రెడ్డి నిప్పులు చెరిగారు. ‘అసలు నీళ్లను ఎట్లా కొలుస్తారో కాంగ్రెస్ నేతలకు తెలుసా? టీఎంసీ అంటే తెలుసా?’ అని ప్రశ్నించారు. ‘కేసీఆర్‌ను విమర్శించేందుకు కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌లకు సిగ్గుండాలె.. కేంద్రమంత్రులుగా ఉన్న వీరు కేఆర్ఎంబీ అధికారులతో మాట్లాడి తెలంగాణకు రావాల్సిన నీటివాటాను సాధించడం చేతకాదా?’ అని నిలదీశారు. కేసీఆర్ హయాంలో పాలమూరు నుంచి వలసలు ఆగాయా లేదా? నల్లగొండ నుంచి ఫ్లోరైడ్ భూతం పోయిందా లేదా? అని జగదీశ్‌రెడ్డి ప్రశ్నించారు.