సూర్యాపేట, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : ‘బీఆర్ఎస్ కార్యకర్త కాలిగోటికి కూడా సరిపోని రేవంత్‌రెడ్డికి ఎలాంటి స్థాయీ లేదు. రెండేండ్లుగా నోటికొచ్చినట్టు మాట్లాడుతున్నడు. ఆయన నోటికన్నా మురుగు కాలువే నయమని జనం అసహ్యించుకుంటున్నరు. అలాంటి వ్యక్తికి కేసీఆర్ పేరు ఉచ్ఛరించే అర్హతే లేదు’ అని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి అన్నారు. సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనంలో రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలు విని ఆ పార్టీకి మద్దతు ఇచ్చిన సర్పంచ్‌లే సిగ్గుపడుతున్నారని దుయ్యబట్టారు. నీళ్లపై జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ గంటపాటు మాట్లాడితే సమాధానం చెప్పలేక విషం కక్కుతున్నాడని ధ్వజమెత్తారు. ఎప్పుడు ఎన్నికలొచ్చినా రేవంత్‌కు, కాంగ్రెస్ పార్టీకి రాళ్లుకట్టి మూసీలో పడేయడం ఖాయమని జోస్యం చెప్పారు.
బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తూ గురువారం సూర్యాపేటలోని తన క్యాంపు కార్యాలయంలో జగదీశ్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. అడ్డిమారి గుడ్డి సూటిన ముఖ్యమంత్రి అయిన రేవంత్‌రెడ్డికి ఒక విధానం లేదని మండిపడ్డారు. దేనిపైనా అవగాహన లేదని, కేవలం పదవులు కొనుక్కునేందుకు నాడు రెడ్‌హ్యాండెడ్‌గా డబ్బు మూటలతో ఎలా దొరికాడో.. అదే మాదిరి నేడు మూటల సీఎం అయ్యాడని విమర్శించారు. రేవంత్‌రెడ్డి తన వ్యాఖ్యలతో గల్లీ స్థాయి నాయకుడిగా మళ్లీ రుజువు చేసుకున్నాడని దుయ్యబట్టారు. తెలంగాణకు జరుగుతున్న అన్యాయంపై కేసీఆర్ గంటపాటు మీడియాతో మాట్లాడి విమర్శిస్తే సమాధానాలు చెప్పాలే తప్ప.. ఎదురు దాడికి దిగడం సిగ్గుమాలిన చర్య అని ఆగ్ర హం వ్యక్తంచేశారు.
‘మా బాస్ కేసీఆర్ ఏం మాట్లాడిండో.. కోట్లాది మంది జనం చూశా రు. తెలంగాణకు కృష్ణా, గోదావరి జలాల్లో అన్యాయం జరిగితే ప్రభుత్వం తోలుతీస్తా అన్నాడే తప్ప.. స్ట్రీట్ ఫెలోస్ గురించి మాట్లాడలేదు. నదీ జలాలు దోపిడీకి గురవుతున్నాయని చెప్పినా పట్టించుకోలేదు. నదులపై హక్కులను కేంద్రం గుంజుకుంటుందంటే వినలేదు. నీటి విషయంలో చంద్రబాబు, మోదీ ద్రోహం చేస్తున్నారని చెప్తున్నా రేవంత్‌రెడ్డి పెడచెవిన పెడుతున్నడు’ అని ధ్వజమెత్తారు. ‘ఇరిగేషన్ మంత్రి కనీస అవగాహన లేకుండానే 45 టీఎంసీలకు ఒప్పుకుంటున్నట్టు మీకు తెలియకుండానే కేంద్రానికి లేఖ రాశాడా?’ అని ప్రశ్నించారు. ఈ విషయంలో కేసీఆర్ మాత్రమే కాదు.. ప్రజలు కూడా ప్రభుత్వం తోలు వొలుస్తారని జగదీశ్‌రెడ్డి హెచ్చరించారు.