నంగునూరు, జూన్ 8 : బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక రాయితీలు ఇచ్చి ఆయిల్‌పామ్ సాగును ప్రోత్సహించింది. ఇందులో భాగంగా సిద్దిపేట జిల్లాలో 11 వేల ఎకరాల్లో రైతులు ఆయిల్‌పామ్ మొక్కలు నాటారు. నంగునూరు మండలంలోని నర్మెట గ్రామంలో 65 ఎకరాల్లో రూ.300 కోట్లతో ఆయిల్‌పామ్ ఫ్యాక్టరీ పనులకు బీఆర్ఎస్ హయాంలో హరీశ్‌రావు శంకుస్థాపన చేయగా పనులు కొనసాగుతున్నాయి. కాగా, నంగునూరు మండలంలోని అక్కెనపల్లిలో 26 మంది రైతులు 168 ఎకరాల్లో ఆయిల్‌పామ్ సాగుచేశారు. ముందుగా సాగు చేయడంతో అక్కెనపల్లికి చెందిన నాగేందర్ అనే రైతుకు చెందిన ఆయిల్‌పామ్ తోటలో తొలి గెలలు తీసేందుకు సిద్ధమయ్యాయి. మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆదివారం తొలి గెలలు తీసే కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. ఈ ఏడాది డిసెంబర్ వరకు సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో 415 ఎకరాల్లో పంట చేతికి వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు.