Harish Rao | సిద్దిపేట, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ ప్రతినిధి): రేవంత్‌రెడ్డి పాలనలో గురుకులాలు, సాంఘిక సంక్షేమ హాస్టళ్లలో చదువుకొంటున్న వేలాది విద్యార్థులు ఆగమయ్యారని, ఇప్పటికే ప్రభుత్వం 49 మంది విద్యార్థులను పొట్టన బెట్టుకున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. రూ.మూడు లక్షల కోట్ల బడ్జెట్ ఉన్న రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు కనీసం కడుపునిండా అన్నం పెట్టే పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం లేదని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతల మీద కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం కాదు.. పిల్లలకు కడుపునిండా అన్నం పెట్టాలని హితవు చెప్పారు. గురువారం రాత్రి సిద్దిపేట జిల్లా కేంద్రంలోని సమీకృత బాలుర వసతి గృహాన్ని ఆయన ఆకస్మికంగా సందర్శించారు. విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
ఈ సందర్భంగా హాస్టల్లో నెలకొన్న పలు సమస్యలను విద్యార్థులు, వార్డెన్లు ఆయన దృష్టికి తీసుకొచ్చారు. అనంతరం మీడియాతో హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆరు నెలలుగా మెస్‌చార్జీలు పెండింగ్‌లో పెట్టిన రేవంత్‌రెడ్డికి శిక్ష వేయాలని పేర్కొన్నారు. విద్యార్థులను అర్ధాకలితో ఉంచినందుకు ఏడాది విజయోత్సవాలు చేసుకుంటున్నవా? అని సీఎంను ఉద్దేశించి ప్రశ్నించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార ఎస్సీ, ఎస్టీ హాసళ్లకు గ్రీన్‌చానల్ ద్వారా నిధులు విడుదల చేస్తున్నామని చెప్పారని, ఆ నిధులు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వం మెస్‌చార్జీలు పెండింగ్‌లో పెట్టడంతో హాస్టల్ వార్డెన్లు అప్పులు తెచ్చి విద్యార్థుల ఆకలి తీరుస్తున్నారని చెప్పారు.
వికారాబాద్ జిల్లా తాండూరులో ఫుడ్ పాయిజన్ వల్ల దవాఖాన పాలైన విద్యార్థునులను పరామర్శించేందుకు వెళ్తున్న మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్‌ను ప్రభుత్వం అడ్డుకోవడం దుర్మార్గమని హరీశ్‌రావు మండిపడ్డారు. హాస్టళ్ల నిర్వహణలో తప్పులు బయటపడతాయనే భయంతోనే వారిని అడ్డుకున్నారని విమర్శించారు. కేసీఆర్ హయాంలో హాస్టల్ విద్యార్థులకు సన్నబియ్యంతో అన్నం పెడితే, ఇప్పుడు దొడ్డుబియ్యంతో పెడుతున్నారని, అది తినలేక విద్యార్థులు అవస్థ పడుతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.