హైదరాబాద్, మే 4 (నమస్తేతెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 17 నెలల్లో విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ కింద కనీసం 17 పైసలు కూడా చెల్లించలేదని మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. బడా కాంట్రాక్టర్లకు వేలకోట్ల బిల్లులు చెల్లించిన ప్రభుత్వం.. విద్యార్థుల కోసం ఫీజు బకాయిలు ఎందుకివ్వడం లేదని ప్రశ్నించారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి.. విద్యార్థుల పాలిట శాపంగా మారిందని ఆదివారం ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తంచేశారు. పేద విద్యార్థుల అభ్యున్నతి కోసం ఈ పథకాన్ని కేసీఆర్ అమలు చేస్తే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం తూట్లు పొడుస్తున్నదని నిప్పులు చెరిగారు. డిగ్రీ కాలేజీలకు రూ.800 కోట్ల రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో 6 లక్షల మంది విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు.
‘విద్యార్థులే పరీక్షలు పెట్టాలని వేడుకునే దుస్థితి నెలకొనడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం కాదా? ఏప్రిల్‌లో జరగాల్సిన పరీక్షలను శాతవాహన, తెలంగాణ, పాలమూరు, మహాత్మాగాంధీ సహా కొన్ని యూనివర్సిటీల పరిధిలో ఇప్పటికీ నిర్వహించకపోవడం సర్కారు చేతగానితనానికి నిదర్శనం కాదా?’ అని ప్రశ్నించారు. సకాలంలో పరీక్షలు పెట్టకపోవడంతో డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులు లా, పీజీ సెట్లు, ఇతర పోటీ పరీక్షలు రాసే అవకాశం కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తంచేశారు.
ప్రైవేట్ డిగ్రీ కాలేజీల యాజమాన్యాలు పరీక్షలను పక్కనబెట్టి నిరసనలకు దిగుతుంటే ప్రభుత్వం మాత్రం మొద్దునిద్ర నటిస్తున్నదని ధ్వజమెత్తారు. కాలేజీల యాజమాన్యాలు అప్పుల ఊబిలో కూరుకుపోయి సిబ్బందికి జీతాలివ్వలేని దారుణ పరిస్థితులు నెలకొన్నాయని పేర్కొన్నారు. అద్దెలు, అప్పులభారం భరించలేక కొన్ని కాలేజీలు అడ్మిషన్లనే నిలిపివేశాయని, మరికొన్ని తాళాలు వేసి సెలవులు ప్రకటించాయని తెలిపారు.
ఇంత జరుగుతున్నా ముఖ్యమంత్రి, మంత్రులు ఏమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ప్రతి విద్యార్థికి రూ.5 లక్షల చొప్పున విద్యాభరోసా కార్డులు ఇస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వ హామీకి అతీగతీలేకుండా పోయిందని హరీశ్‌రావు విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఇప్పటికైనా కండ్లు తెరిచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.