అవ్వాతాతల దగ్గరకు పోయి రాక్షసపాలన ఎవరిది? అంటే రేవంత్‌రెడ్డిదే అంటరు. విద్యార్థులు, మహిళలు, పోలీసులను అడిగినా రేవంత్‌రెడ్డే రాక్షసుడు అంటరు. అన్ని వర్గాలను మోసం చేయడంలో రేవంత్‌రెడ్డి విజయవంతమైండు. వచ్చే ఎన్నికల్లో గెలుసుడు కాదు కదా.. కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా రాదు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఆ పార్టీకి సింగిల్ డిజిటే వస్తది. రేవంత్‌రెడ్డి మళ్లా గెలువడం అనేది పగటి కల. తెలంగాణలో వచ్చేది రామరాజ్యం కేసీఆర్ రాజ్యమే.
-హరీశ్‌రావు
హైదరాబాద్ సిటీ బ్యూరో/ శంషాబాద్ రూరల్, ఏఫ్రిల్ 7 : తెలంగాణలో కాంగ్రెస్ గడీలు, బేడీల పాలన కొనసాగుతున్నదని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్, మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు. ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వ నిరంకుశత్వాన్ని ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాలపైకి పోలీసులను పంపుతూ అరాచక పాలన సాగిస్తున్నారని మండిపడ్డారు. ఇండస్ట్రియల్ పార్క్ పేరుతో వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్లో భూ సేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడి రైతులు 15 రోజులుగా దీక్ష చేస్తున్నారు. వారిని పరామర్శించి, సంఘీభావం తెలిపేందుకు మంగళవారం పరిగికి బయలుదేరిన హరీశ్‌రావు ఇంటిని పోలీసులు ముట్టడించారు.
ఆయనతో పాటు మాజీ మంత్రులు సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఎర్రోళ్ల శ్రీనివాస్, బీఆర్ఎస్ అక్రమంగా నేతలను గృహ నిర్బంధం చేశారు. మధ్యాహ్నం పోలీసులు వదిలేయడంతో పరిగి బయలుదేరిన హరీశ్‌రావు నేతృత్వంలోని బీఆర్ఎస్ శ్రేణులను పోలీసులు అడ్డుకొని అప్పా జంక్షన్ వద్ద అక్రమంగా అరెస్ట్ చేసి శంషాబాద్ (పెద్దాపూర్ పోలీస్ స్టేషన్)కు తరలించారు. ఇక్కడ హరీశ్ మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలతో ఏడో గ్యారెంటీగా ప్రజాస్వామ్యాన్ని అమలు చేస్తామని చెప్పి నేడు ప్రతిపక్షాల మీద ఎదురుదాడి చేస్తూ అదే ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని నిప్పులు చెరిగారు. ‘ప్రజా సమస్యల గురించి మాట్లాడితే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేశారు. ఇప్పుడు రైతులను కలిసేందుకు వెళ్తుంటే అరెస్టులు చేస్తున్నరు. గడీలు, బేడీలు, నిర్బంధాల పాలన సాగిస్తున్నరు’ అని ధ్వజమెత్తారు.
రాష్ట్రంలో పోలీసు రాజ్యం నడుస్తున్నదని.. ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదని హరీశ్ హితవుపలికారు. రెండు మూడు పంటలు పండే భూముల్లో పరిశ్రమలు పెట్టాలనుకోవడం దారుణమని ఆవేదన వ్యక్తంచేశారు. భూసేకరణ కోసం ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అప్పటిదాకా రైతుల పక్షాన తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతులకు ధైర్యం చెప్పడానికి వెళ్తుంటే గొంతు నొక్కతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘రేవంత్‌రెడ్డిని మించిన రావణాసురుడు ఎవరూ ఉండరు. పేదల ఇండ్లు కూల్చుతూ వికృతానందం పొందుతున్నడు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తా అని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసిండ్రు’ అని ఆగ్రహం వ్యక్తంచేశారు.

ఉమ్మడి రంగారెడ్డి జిల్లా భూములపై రేవంత్‌రెడ్ది కన్ను పడిందని మాజీ మంత్రి సబితాఇంద్రారెడ్డి విమర్శించారు. పరిగిలో 15 రోజుల నుంచి రిలే నిరాహారదీక్ష చేస్తున్న రైతులకు ధైర్యం చెప్పేందుకు వెళ్తుంటే ఉదయం నుంచీ పోలీసులు అక్రమంగా నిర్బంధించారని చెప్పారు. అనంతరం పరిగి వెళ్తుండగా అరెస్టు చేసి శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు సబితను తీసుకొచ్చారు. ఇక్కడ ఆమె మాట్లాడుతూ ‘గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సేకరించిన భూములున్నయి. వాటిలో పరిశ్రమలు పెట్టాలి. కాని కొత్తగా రైతుల భూములు తీసుకోవడమంటే రైతులను ఇబ్బందులు పెట్టడం కోసమే.. కోహెడ వద్ద సేకరించిన భూమిని రేవంత్‌రెడ్డి తన బంధువులకు కట్టబెట్టడం కోసం మరో చోటుకు పండ్ల మార్కెట్‌ను తరలిస్తున్నడు. సీతారాంపూర్‌లో భూమి ఉన్నది. అక్కడే ఏర్పాటు చేయాలి. వ్యవసాయం చేసుకొని బతికే రైతుల భూములను రియల్ఎస్టేట్ వ్యాపారం కోసం లాక్కోవడం మంచిది కాదు’ అని హితవుపలికారు. ఇక్కడ మాజీ ఎంపీపీలు మురళీధర్‌రెడ్డి, చెక్కల ఎల్లయ్య, పార్టీ మండలాధ్యక్షుడు మోహన్‌రావు, రాష్ట్ర నాయకుడు మంచర్ల శ్రీనివాస్, కొన్నమొల్ల శ్రీనివాస్, బుచ్చిరెడ్డి, మాజీ సర్పంచ్ చెక్కల చంద్రశేఖర్, నాయకులు జయసింహ, గౌస్‌పాషా, జొన్నడ రాఘవేందర్, పవన్పటేల్, బాలూగౌడ్, సురేష్‌నాయక్, సంజీవ ఉన్నారు.

మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావును అరెస్టు చేసి శంషాబాద్ పోలీస్‌స్టేషన్‌కు తీసుకువచ్చిన విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. పోలీస్‌స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. రేవంత్‌రెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హరీశ్‌రావు, సబితాఇంద్రారెడ్డి, దయాకర్‌రావును వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్కడికి వచ్చిన వేలాద మంది నాయకులు, కార్యకర్తలను నిలువరించడం పోలీసులకు సవాల్‌గా మారింది.