హైదరాబాద్, జనవరి18 (నమస్తే తెలంగాణ): మాజీ మంత్రి హరీశ్‌రావు నిర్వహించిన ప్రెస్‌మీట్‌తో ప్రభుత్వం ఉలిక్కిపడింది. హుటాహుటిన ముగ్గురు మంత్రులు కలెక్టర్లతో రేషన్‌కార్డుల జారీపై సమీక్షించడమే కాకుండా అప్పటికప్పుడు ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు జారీ చేసింది. కులసర్వే మాత్రమే ప్రామాణికం కాదంటూ దిద్దుబాటు చర్యలకు దిగింది. మళ్లీ దరఖాస్తులు స్వీకరిస్తామని ప్రకటించింది. రేషన్‌కార్డుల జారీకి ఇటీవల మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం.. కొత్తగా దరఖాస్తులు స్వీకరించబోమని తెలిపింది. కుల సర్వే ఆధారంగా రూపొందించిన జాబితాలో ఉన్న అర్హులైన కుటుంబాలకే రేషన్‌కార్డులను మంజూరు చేస్తామని ప్రకటించింది. ఆ మేరకు గ్రామాల్లో ఇప్పటికే సర్వేను ప్రారంభించింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి హరీశ్‌రావు ఇదే అంశంపై శనివారం ప్రత్యేకంగా ప్రెస్‌మీట్ నిర్వహించి ప్రభుత్వ విధానాన్ని తూర్పారబట్టారు. కొత్తగా ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరించి, అర్హత కలిగిన ప్రతి కుటుంబానికీ రేషన్‌కార్డు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిద్దుబాటు చర్యలకు దిగింది. సచివాలయం నుంచి మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి కీలక ఆదేశాలు జారీ చేశారు. అర్హులైన ప్రతి ఒకరికీ రేషన్కార్డ్లను జారీ చేయాలని కలెక్టర్లకు సూచించారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరు నిరంతర ప్రక్రియగా కొనసాగుతుందని ప్రకటించారు. హరీశ్‌రావు లేవనెత్తిన అంశాలకు వివరణ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల కోసం 21 నుంచి 24 వరకు నిర్వహించే గ్రామసభల్లో దరఖాస్తులను స్వీకరించడంతోపాటు ప్రజాపాలనలో వచ్చిన దరఖాస్తులను కూడా పరిశీలించాలని కలెక్టర్లకు స్పష్టంచేశారు. కులగణన (సామాజిక) సర్వేనే కార్డుల జారీకి ప్రామాణికం కాదని, అదే తుది జాబితా కాదని తెలిపారు.
ప్రజాభిప్రాయం తీసుకోవడంతోపాటు గ్రామసభలు, ప్రజాపాలన సేవాకేంద్రాల్లో కొత్తగా తీసుకున్న దరఖాస్తులు, ఎంపీడీవో కార్యాలయంలో ఇప్పటికే ఉన్న దరఖాస్తులను పరిశీలించిన తర్వాత మాత్రమే అర్హులైన లబ్ధిదారుల తుది జాబితాను ప్రకటిస్తామని మంత్రులు స్పష్టంచేశారు. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఇంటి స్థలమున్న వారి, స్థలం లేనివారి జాబితాలను గ్రామసభల్లో ప్రదర్శించాలని సూచించారు. వ్యవసాయయోగ్యమైన ప్రతి భూమికీ రైతు భరోసా కల్పించాలని, వ్యవసాయ, రెవిన్యూ అధికారులు సంయుక్తంగా రైతు భరోసా లబ్ధిదారులను గుర్తించాలని, ఉపాధిహామీ పథకంలో కనీసం 20 రోజులపాటు కూలి పనికి వెళ్లిన వారికే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అదీ మహిళల బ్యాంకు ఖాతాలకే వర్తింపజేస్తామని తెలిపారు. ఇటీవల రాష్ట్రంలో 156 గ్రామాలను మున్సిపాలిటీల్లో కలపడం జరిగిందని, ఆ గ్రామాల్లో 2023 -24 లో జరిగిన ఉపాధి హామీ పనుల జాబితాను పరిగణనలోనికి తీసుకుంటామని స్పష్టంచేశారు. గ్రామసభలకు విస్తృత ఏర్పాట్లు చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సమావేశంలో సీఎస్ శాంతికుమారి కూడా పాల్గొన్నారు.