Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్ల రైతులు తక్కువ ధరకు పంటను అమ్ముకోవాల్సి వస్తున్నదని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ఎండగడుతూ సీఎం రేవంత్‌రెడ్డికి బుధవారం బహిరంగ లేఖ రాశారు. పప్పు దినుసుల సాగుతో మెరుగైన లాభాలు సాధించవచ్చనుకున్న రైతుల ఆశలు అడియాసలయ్యానని చెప్పారు. ‘కేంద్రం ఈ ఏడాది క్వింటాలు పెసరకు మద్దతు ధర రూ.8,682 ప్రకటించినా ఆ ధరకు ఎవరూ కొంటలేరు. చేసేది లేక రైతులు వ్యాపారులకు రూ.6,000 నుంచి రూ.6,500కే అమ్ముకుంటున్నరు. దీంతో క్వింటాల్‌పై రూ.2,500 పైగా నష్టపోతున్నరు’ అని లేఖలో పేర్కొన్నారు.
వ్యాపారులు మద్దతు ధరకు పంట కొనుగోలు చేయని పరిస్థితుల్లో గత కేసీఆర్ ప్రభుత్వం మార్ఫెడ్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. దీంతో మారెట్లో పోటీ ఏర్పడి వ్యాపారులు కూడా ఎకువ చెల్లించి కొనుగోలు చేశారని చెప్పారు. ఈ సంవత్సరం మార్ఫెడ్ కొనుగోలు కేంద్రాల ఏర్పాటులో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ‘ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయకపోవడం పెసర రైతులకు శాపంగా మారింది. ఖమ్మం, మహబూబాబాద్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, నారాయణపేట, సూర్యపేట తదితర జిల్లాల రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నరు’ అని తెలిపారు. రుణమాఫీ, రైతుబంధును అటకెకించారని, వరికి రూ.500 బోనస్ మాటను బోగస్ చేశారని, ఇప్పుడు మద్దతు ధరకు కొనుగోలు బాధ్యతను విస్మరించారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి వ్యవసాయ, రైతు వ్యతిరేక విధానాలను వీడాలని, మార్ఫెడ్ కేంద్రాలు పెట్టి పెసర దిగుబడులు కొనాలని డిమాండ్ చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్‌లో ఉపాధ్యాయులు లేక పాఠశాల మూతపడటం సిగ్గుచేటని హరీశ్‌రావు బుధవారం ఎక్స్ వేదికగా ఎద్దేవా చేశారు. 15 రోజుల నుంచి పాఠశాల నడవకున్నా ఎవరూ పట్టించుకోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు.
‘ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ సూల్ ఏర్పాటు చేస్తామని మ్యానిఫెస్టోలో చెప్పి, ఇప్పుడు ఉన్న ప్రభుత్వ సూళ్లను మూతపడేలా చేస్తున్నారు. పేద పిల్లలకు ప్రాథమిక విద్యను దూరం చేస్తున్నారు. పాఠశాలలు మూతపడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు? విద్యాశాఖ సీఎం వద్దే ఉన్నా ఎందుకు నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నట్టు?’అంటూ ప్రశ్నించారు. తక్షణమే వలంటీర్లను నియమించి పాఠశాలలను మూతపడకుండా చూడాలని డిమాండ్ చేశారు.