Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 15 (నమస్తే తెలంగాణ): రుణమాఫీ పేరుతో సీఎం రేవంత్‌రెడ్డి రైతులను దగా చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. నోటికి వచ్చినట్టు దిగజారుడు భాషలో బీఆర్ఎస్ను తిడితేనో, తెచ్చిపెట్టుకున్న ఆవేశంతో రంకెలు వేస్తేనో అబద్ధాలు నిజాలు అయిపోవని అన్నారు. రేవంత్‌రెడ్డి రైతు ద్రోహానికే కాదు దైవ ద్రోహానికీ పాల్పడ్డారని మండిపడ్డారు. ఆగస్టు 15 నాటికి రాష్ట్రంలోని రైతులకు రూ.31వేల కోట్ల రుణమాఫీ చేస్తామని ఊదరగొట్టి అందులో రూ.9 వేల కోట్ల కోతపెట్టిన ఘనుడు రేవంత్‌రెడ్డి అని ధ్వజమెత్తారు.
రేవంత్‌రెడ్డి సీఎంలా ప్రవర్తించటం లేదనే విషయాన్ని ప్రతి సందర్భంలోనూ నిరూపించుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కానీ, తెలంగాణ చరిత్రలోనూ రేవంత్‌రెడ్డిలా దిగజారిన, దికుమాలిన సీఎం ఇంకెవరూ ఉండరని ఉదహరించారు. అబద్ధం కూడా సిగ్గుపడి మూసీలో దూకి ఆత్మహత్య చేసుకునేలా రేవంత్‌రెడ్డి ప్రవర్తన ఉన్నదని ధ్వజమెత్తారు. దేవుళ్ల మీద ఒట్లు పెట్టుకొని కూడా మాట మీద నిలబడక పోగా, నిస్సిగ్గుగా బీఆర్ఎస్పై, తనపై అవాకులు చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికలకు ముందు సోనియాగాంధీ పుట్టినరోజు కానుకగా డిసెంబర్ 9 నాటికి రూ.40 వేల కోట్ల రైతు రుణమాఫీ ఏకకాలంలో చేస్తానని చెప్పింది రేవంత్‌రెడ్డేనని.. అది నెరవేర్చలేక పార్లమెంట్ ఎన్నికల ముందు మరో నాటకానికి తెరలేపారని, ఆగస్టు 15 వరకు రూ.31వేల కోట్లు మాఫీ చేస్తానని అన్నారని వెల్లడించారు. అసెంబ్లీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నికల సమయానికి రూ.9 వేల కోట్లను కోతపెట్టిన చరిత్ర రేవంత్‌రెడ్డిది అని నిప్పులు చెరిగారు.
అప్పటికీ ప్రజలు నమ్మటం లేదని ఏ ఊరికిపోతే ఆ ఊరి దేవుడిపై ఒట్లు పెట్టాడని గుర్తుచేశారు. సోనియాగాంధీ మీద ఒట్టుపెట్టినా, దేవుళ్ల మీద ఒట్టుపెట్టినా ‘అబద్ధమే నా లక్షణం. మోసమే నా విధానం. మాట తప్పడమే నా నైజం’ అనే రీతిలో నగ్నంగా తన నిజసర్వరూపాన్ని మరోసారి రేవంత్‌రెడ్డి నిరూపించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మోసం చేసినట్టు తెలిసిపోయాక ఎవరు రాజీనామా చేయాలి? ఏటిలో దుంకి ఎవరు చావాలి? అని ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో మొదటి దశకే రూ.17 వేల కోట్లు
కేసీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ సర్కారు మొదటి దఫాలో 35 లక్షల మంది రైతులకు రూ.1 లక్ష రుణమాఫీ చేశామని, అప్పుడు రూ.17 వేల కోట్లు అయ్యిందని హరీశ్‌రావు గుర్తుచేశారు. అదే, కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగా రూ.2 లక్షల రుణమాఫీ చేస్తే 22 లక్షల మంది రైతులే ఉంటారా? వారికి రూ.17,869 కోట్లు మాత్రమే అవుతాయా? అని ప్రశ్నించారు.
దేవుడా.. రేవంత్ తప్పులు తెలంగాణకు శాపంగా మారొద్దు
‘రేవంత్‌రెడ్డి నువ్వు రైతు ద్రోహానికి మాత్రమే కాదు, దైవ ద్రోహానికీ పాల్పడ్డావు’ అనే విషయాన్ని విస్మరించకూడదు అని హరీశ్‌రావు పేర్కొన్నారు. సీఎంగా ఉండి దేవుళ్ల మీద ఒట్టుపెట్టి మాట తప్పి చేసిన అపచారానికి వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలని సీఎంకు సూచించారు. రేవంత్‌రెడ్డికి వికారమే తప్ప సంస్కారం లేదని విమర్శించారు.
సీఎం స్థాయిలో రేవంత్ మాట తప్పినందుకు ఆ దేవుళ్లు తెలంగాణ మీద ఎకడ ఆగ్రహిస్తారోనని ఆవేదన వ్యక్తంచేశారు. రేవంత్‌రెడ్డి చేసిన పాపఫలితం ప్రజలకు ఎకడ శాపంగా మారుతుందోనని ఆందోళన వ్యక్తంచేశారు. రేవంత్ చేసిన తప్పులకు, దైవ ద్రోహానికి తెలంగాణపై ఆగ్రహించవద్దని ముకోటి దేవుళ్లను వేడుకున్నారు. రేవంత్‌రెడ్డి ఏ దేవుళ్ల మీద ఒట్టు పెట్టి మాట తప్పాడో.. ఆ దేవాలయాలకు త్వరలో తాను స్వయంగా వెళ్లి దేవుళ్లను ప్రార్థిస్తానని పేర్కొన్నారు.