Harish Rao | అసెంబ్లీలో గతేడాది గవర్నర్ ప్రసంగానికి.. ఈ సారి గవర్నర్ ప్రసంగానికి తేడా ఏం లేదని.. గవర్నర్లు మారడం తప్ప.. ప్రసంగాలు మారలేదని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. చేయనివి చేసినట్లు, ఇవ్వని ఇచ్చినట్లుగా అబద్ధాలు, అవాస్తవాలతో కూడిన ప్రసంగాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం గవర్నర్‌తో చెప్పించిందన్నారు. గవర్నర్ ప్రసంగంపై మాజీ మంత్రి హరీశ్ రావు మీడియాతో మాట్లాడారు. ఏడాదిన్నర ప్రభుత్వ పాలనా వైఫల్యానికి గవర్నర్ ప్రసంగం నిదర్శనమన్నారు. రేవంతు అబద్దాల ప్రచారాన్ని నమ్మించేందుకు గవర్నర్‌ను వాడుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. గవర్నర్ మహాత్మా గాంధీ చెప్పిన మాటలతో 32 పేజీల ప్రసంగం మొదలు పెట్టారని.. ‘నిన్ను నువ్వు కనుగొనడానికి అత్యుత్తమ మార్గం ఇతరుల సేవలో నిమగ్నమవ్వడమే’ అని.. నిజానికి రేవంత్ రెడ్డి అత్యుత్తమ మార్గం ఢిల్లీ, చంద్రబాబు సేవలో నిమగ్నం అయ్యాడని తెలంగాణ ప్రజలు భావిస్తున్నారన్నారు. ట్రాన్స్ ఫార్మింగ్ లైవ్స్ అన్నారని.. ఎవరి లైవ్స్ ట్రాన్స్ ఫార్మ్ చేశారని ప్రశ్నించారు.
లగచర్ల, న్యాల్కల్, అశోక్‌నగర్‌లో రైతులను, నిరుద్యోగులను పోలీసులతో కొట్టించడం, ప్రశ్నిస్తే అరెస్టులు చేయడం ఇదేనా మీరు చెప్పిన ట్రాన్స్ ఫార్మింగ్ లైవ్స్ అంటూ నిలదీశారు. ఇవాళ ఇద్దరు జర్నలిస్టులను అరెస్టు చేసి ప్రజాపాలన పేరుతో పెద్ద ట్రాన్స్ ఫార్మేషన్ చేశారని ఎద్దేశా చేశారు. ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అంటే అన్ని వర్గాల ప్రజల డెవలప్మెంట్ కావాలని.. అంతే గానీ కాంగ్రెస్ మంత్రులు, నాయకుల డెవలప్మెంట్ కాదంటూ చురకలంటించారు. 20శాతం కమీషన్లు తీసుకోవడమేనా? మీరు చెప్పిన ఇంక్లూసివ్ డెవలప్మెంట్ అంటూ ధ్వజమెత్తారు. ప్రజల సేవ ఎక్కడిది.. స్వయం సేవా, ఢిల్లీ సేవలో రేవంత్ రెడ్డి, మంత్రి వర్గం తరిస్తుందన్నారు. తెలంగాణ తల్లి విగ్రహం మార్చారని.. తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోట రాహల్ గాంధీ తండ్రి విగ్రహం పెట్టారని ఆరోపించారు. తెలంగాణ సంస్కృతి అభివృద్ధికి చేపట్టిన చర్యలుగా భావించాలా? అని ప్రశ్నించారు. వ్యవసాయం పెంచింది ఎవరు.. గొప్పలు చెబుతున్నది ఎవరు? అని నిలదీశారు.
34లక్షల ఎకరాల నుంచి కోటి ఎకరాల మాగాణంగా మార్చింది కేసీఆర్ కాదా? కాళేశ్వరం సహా ఇతర ప్రాజెక్టులు, మిషన్ కాకతీయతో అది సాధ్యమైందన్నది వాస్తవమన్నారు. గొప్పగా చెప్పిన 260 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి రికార్డు కేసీఆర్ పదేళ్ల కృషితో సాధ్యమైందా? ఏడాదిన్నర కాంగ్రెస్ పాలనలో సాధ్యమైందా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రుణమాఫీ అనేది పెద్ద బోగస్ అని, రూ.41వేల కోట్ల రుణమాఫీ అని చెప్పి.. బడ్జెట్లో రూ.31వేల కోట్లు చెప్పి, 20వేలకోట్లు అంటూ ప్రచారం చేసుకుంటున్నారన్నారు. రైతు భరోసా రూ.15వేలు ఇస్తమని, సిగ్గులేకుండా రూ.12వేలకు తగ్గించారని.. దాన్ని గొప్పగా గవర్నర్ ప్రసంగంలో చెప్పుకున్నారని విమర్శించారు. రైతు కూలీలకు రూ.12వేలు ఇస్తున్నామని పచ్చి అబద్ధాలు గవర్నర్‌తో చెప్పించారన్నారు. ఇప్పటి వరకు కనీసం రూపాయి అయినా ఎవరి ఖాతాల్లో అయినా పడిందా? అని ప్రశ్నించారు.
అసలు 566 రైతు వేదికలు కట్టింది ఎవరు ? అది కూడా మీ ఘనతేనా? అని నిలదీశారు. కేసీఆర్ చేసింది కూడా కేసీఆర్ ముందే మీ ఘనత గా చెప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. చేనేతలకు ఉన్న పథకాలన్నీ రద్దు చేసి.. వాళ్లను బలహీనం చేసి.. దెబ్బతీసి.. ఇప్పుడు కొత్త పథకాన్ని ప్రకటించారన్నారు. రుణమాఫీ, రైతు భరోసాలాగానే ఈ పథకం అమలు అంతేనా? అంటూ అనుమానం వ్యక్తం చేశారు. అన్ని పంటలకు బోనస్ అని చెప్పి సన్నాలకు పరిమితం చేశారని, ఇంకా రూ.400కోట్లు పెండింగ్ ఉందని.. రూ.1200 కోట్లు ఇచ్చామనడం పచ్చి అబద్ధమన్నారు. మీరు ఏర్పాటు చేసిన వ్యవసాయ కమిషన్ ఏం చేసిందని.. యాసంగిలో పంటలు వేయకండి అని చెప్పిందని.. అంతకు మించి చేసిన పనేంటి అంటూ నిలదీశారు. 445 రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. కనీసం రైతు బీమా డబ్బులు కూడా ఇవ్వడం లేదన్నారు.