టైం ఇస్తే అందరికీ జవాబిస్తా
నేను శ్వేతపత్రంపై మాట్లాడుతుంటే వెంకన్న లేచి ఎస్ఎల్బీసీపై అడుగుతున్నరు.. కృష్ణారావు లేచి కేఆర్ఎంబీపై ప్రశ్నిస్తున్నరు, భట్టన్న లేచి రాజీవ్సాగర్పై, ఇలా నేను ఈ అన్నకు సమాధానం చెప్పాలా, ఆ అన్నకు చెప్పాలా? శ్వేతపత్రంపై మాట్లాడాలా.. ఏం చేయాలె? నాకు సమయం ఇవ్వండి.. ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తా. రాత్రి 12 అయినా సరే అందరికీ సమాధానం చెప్పే సత్తా నాకున్నది. టైం ఇవ్వండి.
-హరీశ్‌రావు
నిరూపిస్తే రాజీనామాకు రెడీ
‘ఎస్సారెస్పీలో అంతర్భాగంగా నిర్మించిన మిడ్ మానేరు ఉమ్మడి రాష్ట్రంలోనే పూర్తయ్యింది. నీళ్లను గత ప్రభుత్వం ఇచ్చినట్టు ప్రచారం చేస్తున్నది’.
-శాసనసభలో ఉత్తమ్ వ్యాఖ్యలు..
‘ఇది పూర్తిగా అవాస్తవం. నేను ఇరిగేషన్ మంత్రిగా బాధ్యతలు చేపట్టేనాటికి ఈ ప్రాజెక్ట్ పూర్తి కాలేదు. 2014 వరకు అయిన పనుల విలువ కేవలం రూ. 106 కోట్లు మాత్రమే. మేం వచ్చాక ఈ ప్రాజెక్ట్ కోసం రూ.775 కోట్లు ఖర్చు చేశాం. మూడేండ్ల తర్వాత ఈ ప్రాజెక్టును పూర్తిచేశాం. ఇంత పచ్చిగా, సత్యదూరమైన విషయాలను మాట్లాడటం దురదృష్టకరం. మిడ్ మానేరు ప్రాజెక్ట్ సమైక్య రాష్ట్రంలో పూర్తయినట్టు నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా. మళ్లీ అసెంబ్లీలో అడుగుపెట్ట’ అని హరీశ్‌రావు సవాల్ విసిరారు.
Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రైతులకు సాగునీరు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. నాడు జలయజ్ఞం కింద 35 పనులు ప్రతిపాదించి, పదేండ్లలో ఒక్కటి కూడా పూర్తి చేయని చేతగాని పాలన నడిచిందని మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ సాగునీటి రంగానికి కేసీఆర్ ప్రభుత్వం దశ..దిశ చూపిందని పేర్కొన్నారు.
శనివారం అసెంబ్లీలో ‘తెలంగాణ సాగునీటి రంగం-శ్వేతపత్రం’పై జరిగిన చర్చలో హరీశ్‌రావు మాట్లాడారు. వైట్‌పేపర్ పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వమే వైట్‌వాష్ అయ్యిందని ఎద్దేవాచేశారు. సాగునీటి రంగంపై మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చినప్పుడు.. ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు కూడా పీపీటీ ప్రదర్శించే అవకాశం ఇస్తే ప్రజలకు వాస్తవాలు వివరించే అవకాశం ఉండేదని అన్నారు.
ఆ అవకాశం లేకపోవడంతో ప్రభుత్వ వాదన మాత్రమే ప్రజల్లోకి వెళ్తుందని, తమ వాదన వెళ్లకపోవడం బాధాకరమని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ అంశంపై నిరసన వ్యక్తం చేస్తున్నట్టు చెప్పారు. 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన తప్పిదాలను కూడా పీపీటీలో పెట్టి ఉంటే బాగుండేదని అన్నారు. ‘ఉత్తమ్ కుమార్‌రెడ్డి మూడు రోజులుగా అసెంబ్లీకి రాకపోతే అద్భుతంగా ప్రిపేర్ అయ్యారని, నీటిపారుదల రంగాన్ని చక్కగా ఆవిష్కరిస్తారని భావించాను. కానీ ఆయన గత ప్రభుత్వం మీద బురద చల్లేందుకే ప్రాధాన్యం ఇచ్చారు తప్ప భవిష్యత్తుకు రోడ్ మ్యాప్ ఇవ్వలేకపోయారు’ అని విమర్శించారు.
ప్రాణహిత-చేవెళ్లపై కాంగ్రెస్ చేతగానితనం
2014 నాటికే ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని, ఇంకో రూ.28 వేల కోట్లు ఖర్చు చేస్తే పూర్తయ్యేదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పడాన్ని హరీశ్‌రావు తప్పుబట్టారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు 2007లో జీవో-120 ద్వారా అంచనాలను రూ.17,825 కోట్లుగా పేర్కొన్నారని, ఏడాదిలోపే అంచనాలను డబుల్ చేశారని విమర్శించారు. 2008 మార్చిలో ఇచ్చిన జీవో-238లో అంచనాలను రూ.38,500 కోట్లకు పెంచారని గుర్తుచేశారు. పనులు ప్రారంభించకుండానే రెట్టింపు చేశారని ధ్వజమెత్తారు.
‘దేశంలో తొలిసారి ఒకే ప్రాజెక్టుకు నాలుగు జిల్లాల్లో శంకుస్థాపన చేసిన ఘనత కూడా నాటి కాంగ్రెస్ ప్రభుత్వానిదే. నాలుగేండ్లలో ప్రాజెక్టు పూర్తి చేస్తామని, తెలంగాణ సస్యశ్యామలం అవుతుందని చెప్పి, నాలుగేండ్ల తర్వాత 2012 నాటికి నాటి కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన ఖర్చు రూ.168 కోట్లు మాత్రమే. మొబిలైజేషన్ అడ్వాన్సులు, సర్వేల పేరుతో రూ.1,426 కోట్ల బిల్లులు మంజూరు చేశారు.
2014 నాటికి ఎనిమిదేండ్లలో చేసిన ఖర్చు రూ.6,116 కోట్లు మాత్రమే. ఇందులో మొబిలైజేషన్ అడ్వాన్స్‌లు రూ.2,328 కోట్లు. భూ సేకరణకు రూ.3,788 కోట్లు వెచ్చించారు. సాధారణంగా ప్రాజెక్టులు కట్టేటప్పుడు ముందు హెడ్‌వర్క్స్ మొదలుపెడతారు. మీరు హెడ్‌ను వదిలేసి తోకలు తవ్వారు. తలాతోక లేకుండా పనిచేశారు. ఇలాగే పనులు కొనసాగితే మీ ముని మనుమలు ప్రాజెక్టును చూస్తారు. అప్పటికి ధరలు ఎంత పెరిగేవో.’ అని ఎద్దేవా చేశారు.
తమ్మిడిహెట్టిని ఎందుకు మార్చామంటే..
కేసీఆర్ ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టును మార్చాలనుకోలేదని, కొనసాగించాలనే ప్రయత్నించిందని హరీశ్‌రావు తెలిపారు. ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ప్రభుత్వం ఏర్పడిన ఐదు రోజులకే.. అంటే 2014 జూన్ 7న కేంద్రానికి కేసీఆర్ లేఖ రాశారని గుర్తుచేశారు. ఆ తర్వాత సెప్టెంబర్ 6న మరో లేఖ రాశామని తెలిపారు.
152 మీటర్ల ఎత్తుతో తమ్మిడిహెట్టి బరాజ్ కడితే మహారాష్ట్రలో మూడువేల ఎకరాలు ముంపునకు గురవుతున్న నేపథ్యంలో.. తమ ప్రభుత్వం ఏర్పడిన నెలరోజుల్లోనే మహారాష్ట్రకు వెళ్లి ఆ రాష్ట్ర సీఎంతో, నీటిపారుదల శాఖ మంత్రితో సంప్రదింపులు జరిపినట్టు చెప్పారు. అయితే అప్పటి కాంగ్రెస్ సీఎం అశోక్ చవాన్ మాట్లాడుతూ ‘ఢిల్లీ కాంగ్రెస్ చెప్పినా, ఏపీ కాంగ్రెస్ చెప్పినా ఒప్పుకోలేదు. ఇప్పుడు అస్సలు ఒప్పుకోము’ అని తెగేసి చెప్పారని వివరించారు.
ఆరు నెలల తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడటంతో మరోసారి వెళ్లి నాటి సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ను కలిశామని, ఆయన కూడా ‘ఈ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా నేను పోరాటం చేసి, జైలుకు వెళ్లాను. అలాంటిది నేను ఎలా ఒప్పుకుంటాను?’ అని తేల్చి చెప్పారని పేర్కొన్నారు. ఇలా కేసీఆర్ స్వయంగా మహారాష్ట్రకు వెళ్లి ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒప్పుకోలేదని తెలిపారు.
అదే సమయంలో కేంద్ర జల సంఘం 2015 మార్చి 4వ తేదీన తెలంగాణకు ఒక లేఖ రాస్తూ తమ్మిడిహెట్టి ప్రతిపాదిత స్థలంలో అనుకున్న మేర నీటి లభ్యత ఉండకపోవచ్చని, భవిష్యత్తులో ఇబ్బంది అవుతుందని, ప్రత్యామ్నాయ స్థలాన్ని చూసుకోవాలని సూచించిందని చెప్పారు. పైగా తమ్మిడిహెట్టిని చాప్రాల్ వన్యప్రాణి సంరక్షణ ప్రాంతంలో ప్రతిపాదించారని, దీంతో ప్రాజెక్ట్‌కు కేంద్రం కూడా ఒప్పుకోలేదని తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయం వైపు ఆలోచించామని పేర్కొన్నారు.
‘నీళ్లు లేని చోట ప్రాజెక్టు కట్టొద్దన్న సీడబ్ల్యూసీ సూచన మేరకు నీళ్లున్న చోటికి మార్చి.. ఖర్చు వృథా కాకుండా సద్వినియోగం చేశాం’ అని పేర్కొన్నారు. ప్రాణహిత-చేవెళ్లలో ప్రతిపాదించిన రిజర్వాయర్ల సామర్థ్యం సరిపోదని సీడబ్ల్యూసీ చెప్తే.. రీడిజైనింగ్‌లో సామర్థ్యాన్ని 14 టీఎంసీల నుంచి 140 టీఎంసీలకు పెంచుకున్నామని తెలిపారు. ‘2007 నుంచి 2014 దాకా ఏపీలో, మహారాష్ట్రలో, ఢిల్లీలో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉండి కూడా అంతర్రాష్ట్ర ఒప్పందం చేసుకోలేదంటే.. తెలంగాణపై మీకు ఎంత ప్రేమ ఉన్నదో అర్థం కావడం లేదా? అలాంటి మీరు మమ్మల్ని విమర్శిస్తరా?’ అని మండిపడ్డారు.
అంచనాలు పెరగడం కొత్త కాదు
కాళేశ్వరం అంచనాలు రెట్టింపు అయ్యాయంటూ పదేపదే విమర్శించడాన్ని హరీశ్‌రావు తిప్పికొట్టారు. ప్రాజెక్టుల అంచనాలు పెరగడం కొత్తేమీ కాదని, గతంలో భారీగా పెంచారని గుర్తుచేశారు. నాగార్జునసాగర్‌ను 1954లో రూ.120 కోట్లతో ప్రారంభిస్తే పూర్తయ్యే నాటికి రూ.1,183 కోట్లకు పెరిందని, అంటే 9 రెట్లు పెరిగిందని గుర్తుచేశారు. ఎస్సారెస్సీ రూ.40 కోట్లతో చేపడితే 107 రెట్లు పెరిగి రూ.4,300 కోట్లకు చేరిందని తెలిపారు.జూరాలను రూ.70 కోట్లతో ప్రారంభిస్తే, రూ.1,815 కోట్లకు చేరిందని చెప్పారు.
పులిచింతల రూ.565 కోట్ల నుంచి రూ.1,816 కోట్లకు, సింగూరు రూ.29 కోట్ల నుంచి రూ.169 కోట్లకు చేరిందని వివరించారు. మేడిగడ్డ బరాజ్ కుంగడాన్ని తాము కూడా హర్షించడం లేదని హరీశ్‌రావు అన్నారు. తప్పు ఎవరు చేసినా తప్పేనని.. కావాలంటే ఎలాంటి విచారణకైనా సిద్ధమని ప్రకటించారు. ‘వర్షాకాలం వచ్చేలోపు యుద్ధప్రాతిపదినక పునరుద్ధరణ పనులు చేసి రైతుల ప్రయోజనాలు కాపాడాలి. ప్రభుత్వం రాజకీయ ప్రయోజనం కోసం ఉద్దేశపూర్వకంగా పునరుద్ధరణ చేయకుండా అలసత్వం ప్రదర్శిస్తున్నదనే అనుమానం కలుగుతున్నది’ అని అన్నారు.
సమర్థంగా వాదిస్తే 600 టీఎంసీలు మనవే
పాలమూరు ఎత్తిపోతల పథకం విషయంలోనూ కాంగ్రెస్ తీరని అన్యాయం చేసిందని హరీశ్‌రావు విమర్శించారు. ‘ప్రాజెక్టుకు 2005లో రిటైర్డ్ ఇంజినీర్లు డీపీఆర్ ఇస్తే.. అనేక పోరాటాల తర్వాత 2013లో సర్వే కోసం జీవో ఇచ్చారు. అయినా టెండర్లు పిలువక సర్వే ప్రారంభం కాలేదు.
మేము పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకాన్ని చేపట్టాం. ప్రాణహిత-చేవెళ్లలో రంగారెడ్డి జిల్లా చివర్లో ఉంటుంది కాబట్టి నీళ్లు అందవనే ఉద్దేశంతో.. రీడిజైనింగ్‌లో ఆ జిల్లాలను పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల కిందికి తీసుకొచ్చాం. 6 లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేలా డీపీఆర్‌లో ప్రతిపాదించాం. దీనిపై ఏపీ ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి స్టే తెచ్చింది.
మేము సుప్రీంకోర్టుకు పోయి దానిని ఎత్తేయించాం. ముందుగా రిజర్వాయర్లు కడితే జలాల్లో వాటా కావాలని ట్రిబ్యునల్‌లో అడగడానికి హక్కులు వస్తాయని పనులు చేపట్టాం. నీటి కేటాయింపులు లేవు గనుక దానిని సాగునీటి ప్రాజెక్టుగా చూపించుకునే అవకాశం లేదు. దీంతో మోటర్లు పెట్టే విషయంలోనే ఒక టీఎంసీకి తగ్గించాం. మైనర్ ఇరిగేషన్ సేవింగ్ కింద 45 టీఎంసీలు, గోదావరి నీళ్లను కృష్ణాకు మళ్లించినందుకు 45 టీఎంసీలు ఇలా.. 90 టీఎంసీలను మనకు వాడుకునే అవకాశం కల్పించాం.
సీడబ్ల్యూసీకి డీపీఆర్ ఇచ్చి కొట్లాడితే ఆరు రకాల అనుమతులు వచ్చాయి. ఈఏసీ కూడా గత ఏడాది ఆగస్టులో రికమెండ్ చేసింది. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఈసీ తెస్తే పంట కాల్వలు తవ్వుకోవచ్చు. కాంగ్రెస్ పనులు ప్రారంభించిన కల్వకుర్తి, నెట్టెంపాడును మేము పూర్తిచేసి సాగునీరు ఇచ్చినట్టే.. కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరు-రంగారెడ్డిని పూర్తిచేసి రైతులకు నీళ్లు అందించవచ్చు’ అని వివరించారు.
సాగునీటి రంగానికి దశ..దిశ
ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ హయాంలో జలయజ్ఞంలో 19 భారీ, 12 మధ్యతరహా ప్రాజెక్టులు, 2 ప్రాజెక్టుల ఆధునీకరణ, వరంగల్, ఖమ్మంలో కరకట్టలు..ఇలా మొత్తం 35 పనులు ప్రారంభించి, పదేండ్లలో ఒక ప్రాజెక్ట్ కూడా పూర్తి చేయలేదని హరీశ్‌రావు విమర్శించారు. టీడీపీ హయాంలో మంజూరై, 90 శాతం పనులు పూర్తయిన గుత్ప-అలీసాగర్ లిఫ్ట్‌ను మాత్రం అందుబాటులోకి తెచ్చారని తెలిపారు.
‘తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత గత పదేండ్లలో రాష్ట్ర సాగునీటి రంగం దిశ, దశను మార్చాం. ఐపీ క్రియేటెడ్, ఐపీ యుటిలైజ్ మధ్య 40 శాతం వ్యత్యాసం ఉన్నట్టు గుర్తించాం. గతంలో కట్టిన ప్రాజెక్టుల కాల్వలు ఆధునీకరించి చివరి ఆయకట్టుకు నీళ్లు అందించాం. ఎస్సారెస్సీ, నాగార్జునసాగర్, రాజోలిబండ, నిజాంసాగర్, ఘనపురం, సదర్మాట్, మూసీ, సాత్నాల, చెలిమెలవాగు, స్వర్ణ, నల్లవాగు, శనిగరం తదితర ప్రాజెక్టుల కాల్వలు ఆధునీకరించాం. ఎస్సారెస్పీ ద్వారా పేరుకు 9 లక్షల ఎకరాల ఆయకట్టు అనేవారు.
కానీ ఎన్నడూ 6 లక్షల ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేదు. మేము దానిని సాధ్యం చేశాం. పదేండ్లలో మేజర్ ఇరిగేషన్ ద్వారా 14.46 లక్షల ఎకరాలు, మీడియం ఇరిగేషన్ కింద 59 వేల ఎకరాలు, మైనర్ ఇరిగేషన్ కింద 60 వేల ఎకరాలు, టీఎస్ఐడీసీ ద్వారా 1.58 లక్షల ఎకరాలు.. మొత్తంగా 17.24 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టు సృష్టించాం. మిషన్ కాకతీయ, ప్రాజెక్టులు కలిపితే 31.50 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేశాం.
తెలంగాణ ఏర్పడిన తర్వాత.. తుమ్మిళ్ల, భక్త రామదాసు, మిడ్ మానేరు, ఎస్సారెస్పీ స్టేజ్-2, అన్నపూర్ణ, రంగనాయక్‌సాగర్, మల్లన్నసాగర్, కొండపోచమ్మ రిజర్వాయర్, ఎస్సారెస్పీ పునర్జీవం, బాగారెడ్డి, సింగూరు ఎత్తిపోతల, కిన్నెరసాని కాల్వలు, గొల్లవాగు, మత్తడివాగు, పాలెంవాగు, ర్యాలీవాగు, గడ్డన్నసుద్దవాగు, చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్, గూడెంలిఫ్ట్, బేతుపల్లి వరద కాల్వ, ఎన్టీఆర్ కాల్వ, గట్టుపొడిచిన వాగు, సమ్మక్క బరాజ్ వంటివాటిని పూర్తిచేశాం. ఇదే సమయంలో కాంగ్రెస్ చేపట్టిన ప్రాజెక్టులను కూడా కొనసాగించాం.
కల్వకుర్తి ప్రాజెక్టుకు కాంగ్రెస్ రూ.2,728 కోట్లు ఖర్చు చేసి 13 వేల ఎకరాలకు నీళ్లిస్తే.. మేము 3.07 లక్షల ఎకరాలకు తీసుకుపోయాం. నెట్టెంపాడుకు కేవలం రూ.1,735 కోట్లు ఖర్చు పెట్టి, 2,300 ఎకరాలకు నీళ్లు ఇచ్చాం. మేము పెండింగ్ పనులు పూర్తిచేసి ఆయకట్టును 1,39,700 ఎకరాలకు పెంచాం. భీమా ప్రాజెక్టును రూ.2 వేల కోట్లు ఖర్చు చేసి 12 వేల ఎకరాలకు నీళ్లు ఇస్తే మేము పెండింగ్ పనులు పూర్తిచేశాం.
మొత్తంగా కల్వకుర్తి, బీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ ద్వారా 2014 వరకు 27,300 ఎకరాలకు మాత్రమే నీళ్లు ఇస్తే.. మేము 9 ఏండ్లలో ఆయకట్టును 6.36 లక్షలకు పెంచాం. ఇదంతా ప్రజల అనుభవంలో ఉన్నది. పండిన పంట సాక్ష్యం, పెరిగిన సాగు విస్తీర్ణం సాక్ష్యం. అసెంబ్లీలో బురద చల్లినంత మాత్రాన నీళ్లు వచ్చినయా లేవా? పంట పండిందా లేదా? అన్నది రైతులు గమనిస్తారు’ అని పేర్కొన్నారు.
కాళేశ్వరం ఆయకట్టుపై తప్పుడు లెక్కలు
కాళేశ్వరం కింద కేవలం డైరెక్ట్ ఆయకట్టు లెక్కలు చెప్పి ప్రభుత్వం మోసం చేస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. ‘ప్రభుత్వం ఇచ్చిన పీపీటీ ప్రకారమే.. డైరెక్ట్ ఆయకట్టు 98,570 ఎకరాలు అని, కాల్వలతో 456 చెరువులు నింపడం ద్వారా 39,144 ఎకరాలకు, ఎస్సారెస్పీ స్టేజీ 1,2 కింద 2,143 చెరువులు నింపడం ద్వారా 1.67 లక్షల ఎకరాలకు, హల్దీ, కూడవెళ్లి కింద చెక్‌డ్యామ్‌లు, చెరువులు నింపి 20,576 ఎకరాలకు సాగునీరు ఇచ్చాం. ఎస్సారెస్పీ స్టేజ్ 1, 2 కింద నీళ్లు తక్కువ పడ్డప్పుడు 17 లక్షల ఎకరాల స్థిరీకరణకు కాళేశ్వరం జలాలు ఉపయోగపడ్డాయి. అంటే కొత్త, స్థిరీకరణ ఆయకట్టు కలిపి 20 లక్షల ఎకరాలకు మేలు కలిగింది. కాంగ్రెస్ హయాంలో ఎస్సారెస్పీ స్టేజ్-2 కాల్వల్లో నీళ్లు ఎందుకు పారలేదు? కేసీఆర్ వచ్చి కాళేశ్వరం కట్టిన తర్వాత తుంగతుర్తి, కోదాడ, డోర్నకల్, మహబూబాబాద్‌కు రెండు పంటలకు నీళ్లు ఎట్లా వచ్చినయి?’ అని ప్రశ్నించారు.
కేసీఆర్ హయాంలో వరం
కాంగ్రెస్ ప్రభుత్వాలు చెరువులను నిర్లక్ష్యం చేయడం వల్ల ధ్వంసం అయ్యాయని హరీశ్‌రావు విమర్శించారు. ‘మేము మిషన్ కాకతీయ చేపట్టి చెరువులను బాగుచేశాం. దానిని రామన్ మెగసెసె అవార్డు గ్రహీత రాజేంద్రన్, ప్రముఖ వ్యవసాయ శాస్త్రవేత్త ఎంఎస్ స్వామినాథన్, రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి మెచ్చుకున్నారు. అమెరికాలోని మిచిగాన్ వర్సిటీ బృందం వచ్చి అధ్యయనం చేసింది. నాలుగేండ్లలో మిషన్ కాకతీయ పూర్తి చేయడంతో 15 లక్షల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ జరిగింది.
మత్స్య సంపద, భూగర్భ జలాలు భారీగా పెరిగాయి. ఒకప్పుడు వానాకాలంలో వేల సంఖ్యలో చెరువుల కట్టలు తెగేవి. 2009లో 1,107 చెరవులు, 2010లో 4,251 చెరువులు, 2011లో 393 చెరువులు, 2012లో 659 చెరువులు, 2013లో 1,868 చెరువులు తెగాయి. మిషన్ కాకతీయ తర్వాత ఎప్పుడూ మూడంకెల సంఖ్య నమోదు కాలేదు. ఒకప్పుడు ప్రాజెక్టుల ద్వారా చెరువులకు నీళ్లు ఇవ్వొద్దని నిబంధన ఉండేది. కేసిఆర్ ప్రభుత్వంలో 6,260 చెరువులను ప్రాజెక్టులకు అనుసంధానం చేసి నీళ్లు నింపింది అని హరీశ్‌రావు అన్నారు.
కాగ్‌పై కాంగ్రెస్ సెల్ఫ్‌గోల్
కాగ్ నివేదిక మీద కాంగ్రెస్ మాట్లాడటం అంటే సెల్ఫ్ గోల్ కొట్టుకోవడమేనని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. ‘చంద్రబాబు హయాంలో కాగ్ రిపోర్ట్ వస్తే ఆయన ‘కాగ్ నివేదిక అశాస్త్రీయం’ అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి హయాంలో ఏపీఐఐసీ ద్వారా 89 వేల ఎకరాలను కనీసం మార్కెట్ ధర కూడా వసూలు చేయకుండా ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టారని కాగ్ నివేదిక ఇస్తే, ‘ప్రభుత్వ విధానాలను తప్పుబట్టే అధికారం కాగ్‌కు లేదు.. ఉండదు’ అని ఆయన అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి ఏకంగా అసెంబ్లీలోనే ‘కాగ్ నివేదిక భగవద్గీతనో, బైబిలో, ఖురానో కాదు.. అందులో ఉన్నవన్నీ సరైనవి కాదు’ అని తేల్చేశారని గుర్తు చేశారు. మాజీ ప్రధాని మన్మోహన్ హయాంలో బొగ్గు గనుల కేటాయింపులో అవినీతి జరిగిందని కాగ్ చెప్తే.. ‘కాగ్ నివేదిక తప్పుల తడక, కాగ్‌కు ప్రామాణికత లేదు’ అన్నారని గుర్తు చేశారు.
ప్రమాదాలు కొత్తేం కాదు
మేడిగడ్డ బరాజ్ కుంగడాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం అనవసరంగా భూతద్దంలో పెట్టి చూపించి, రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నదని హరీశ్‌రావు మండిపడ్డారు. గతంలోనూ ఇలాంటి ఘటనలు ఎన్నో జరిగాయని ఉదహరించారు. ‘కాంగ్రెస్ హయాంలో కడెం ప్రాజెక్టు మొదటి ఫిల్లింగ్‌కే కొట్టుకుపోయింది. ఆ తర్వాత కూడా మరోసారి కొట్టుకుపోయింది. దేవాదుల లిఫ్ట్ ప్రారంభించగానే పైపులు పటాకుల్లాగా పేలిపోయాయి. టన్నెల్ కూలిపోయి ముగ్గురు కార్మికులు చనిపోయారు. సాత్నాల హెడ్ కొట్టుకుపోయింది. మూసీ గేట్లు కొట్టుకుపోయాయి. సింగూరు డ్యాం, ఎల్లంపల్లి రిజర్వాయర్, తాలిపేరు రిజర్వాయర్, వరంగల్ పాలెంవాగు ప్రాజెక్టుల్లోనూ ప్రమాదాలు జరిగాయి. సీడబ్ల్యూసీ ఆధ్వర్యంలో నడుస్తున్న పోలవరం డ్యాంలో కూడా డయాఫ్రం వాల్ కొట్టుకుపోయింది’ అని అన్నారు.
కాంగ్రెస్ ద్రోహంపై కలమెత్తని కవి లేడు
సమైక్య పాలనలో తెలంగాణ ప్రాంతంలోని 10 జిల్లాల్లో 9 జిల్లాలు వెనుకబడ్డాయని ప్లానింగ్ కమిషన్ గుర్తించిందని, అదీ కాంగ్రెస్ పాలన అని హరీశ్‌రావు ఎద్దేవా చేశారు. నాడు కాంగ్రెస్ పాలనలో తెలంగాణ అనుభవించిన బాధలను చూసి కలమెత్తని కవి లేడు.. గళమెత్తని గాయకుడు లేడు అని పేర్కొన్నారు. హరీశ్‌రావు ప్రస్తావించిన కొందరి కవిత్వం.
‘కాంగ్రెస్ పాలనలోరన్నో..
మనకు కన్నీళ్లే మిగిలాయిరన్నో..
గోదావరి తల్లి గొల్లుమని ఏడ్చింది..
కృష్ణమ్మ తల్లి కన్నీల్లు రాల్చింది..
సింగరేణి తల్లి సిన్నబోయినాది..
610 జీవోనేమో జీరో అయినాది’
అని ప్రజా యుద్ధనౌక గద్దర్
‘ఉత్తరాన గోదావరి ఉప్పొంగి ఉరకనేమి..
దక్షిణాన కృష్ణమ్మ దర్జాగా పారనేమి..
నీళ్లు లేక నోళ్లు తెరిచెబీళ్లను చూడు..
మా పల్లెలని బోసిపోగ తల్లడిల్లుతున్న తల్లి..
చూడు తెలంగాణ, చుకలేని నీళ్లు లేనిదాన..
మా గోడు తెలంగాణ, బతుకు పాడైనదాన..
అని అందెశ్రీ
వానమ్మ వానమ్మ వానమ్మ..
ఒకసారన్న వచ్చిపోవే వానమ్మ..
చేలల్ల నీళ్లు లేవు, చెలకల్ల నీళ్లు లేవు,
నిన్నే నమ్మిన రైతు కండ్లల్ల నీళ్లు లేవు..’
అని కవి జయరాజ్
పూర్తి ఆయకట్టుకు సమయం పడుతుంది
ఏ ప్రాజెక్టు అయినా ప్రారంభించేనాటికి ప్రాథమికంగా కొంత ఆయకట్టుకు నీరు అందుతుందని, పూర్తి ఆయకట్టుకు నీరందడానికి సమయం పడుతుందని హరీశ్‌రావు తెలిపారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు వివరించారు.