గజ్వేల్, జనవరి 18: రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి అతి త్వరలోనే తలకిందులవుతుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు అన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మూడోంతుల కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోతారని తెలిపారు. ఏడాదిలోనే ప్రజలు బీఆర్ఎస్ను గుర్తిస్తారని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్‌లో గురువారం నిర్వహించిన నియోజకవర్గస్థాయి కృతజ్ఞతా సభకు ఆయన ముఖ్య అథితిగా విచ్చేసి మాట్లాడారు.
మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్ జలాశయాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే నీళ్లు నింపారని, యాసంగిలో రైతులకు ఆ నీటిని విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దేవాదుల లిఫ్ట్ ఇరిగేషన్ కాలువ ద్వారా కొండపాక మండలంలోని చెరువులను నింపి యాసంగి పంటలకు జీవం పోయాలని డిమాండ్ చేశారు.
గజ్వేల్‌లో ఎంతో అభివృద్ధి జరిగినా అలాంటిదేం లేదంటూ అసెంబ్లీ సాక్షిగా కాంగ్రెస్ పార్టీ అక్కసం ఎల్లగక్కే ప్రయత్నం చేసిందని మండిపడ్డారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడేలా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పనిచేశారని కొనియాడారు. అభివృద్ధిలో కేసీఆర్ పోటీ పడితే.. కేసులు పెట్టడంలో కాంగ్రెస్ నాయకులు పోటీ పడుతున్నారని విమర్శించారు.
హామీలపై చేతులెత్తేసిన సర్కారు
ప్రభుత్వం ఏర్పాటైన తరువాత డిసెంబర్ 9న రైతులకు రుణమాఫీ చేస్తామని, రూ.2 వేల పింఛన్‌ను రూ.4 వేలకు పెంచుతామని, ఉచిత కరెంట్ ఇస్తామని, రైతులకు రైతుబంధు రూ.15వేలు చేస్తామని, ధాన్యం క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తామని హామీలిచ్చి కాంగ్రెస్, ఇప్పుడు వాటిని ఎందుకు అమలు చేయడం లేదని హరీశ్‌రావు ప్రశ్నించారు.
ఎన్నికల ప్రచారంలో నిరుద్యోగులకు భృతి ఇస్తామని కాంగ్రెస్ నేత ప్రియాంకాగాంధీ చెప్పినప్పటికీ, అలాంటి హామీనే ఇవ్వలేదని డిఫ్యూటీ సీఎం భట్టి విక్రమార్క అసెంబ్లీ సాక్షిగా అబద్ధాలు చెప్పారని ఆగ్ర హం వ్యక్తంచేశారు. ‘దేశం మొత్తం అదానీ, అంబానీ చేతుల్లో ఉన్నదని, అదానీ అవినీతి వెనుక ప్రధాని ఉన్నారనీ, ఇద్దరి చేతుల్లో 500 కంపెనీలున్నాయని రాహుల్‌గాంధీ బస్సుయాత్రలో మాట్లాడితే.. ఇప్పుడు రేవంత్‌రెడ్డి వెళ్లి అదానీని అలుముకుంటున్నారు.
ప్రగతి భవన్లో 250 బెడ్రూంలు, స్విమ్మింగ్ ఫూల్స్ ఉన్నాయని మాట్లాడిన భట్టి విక్రమార్కను అసెంబ్లీలో నిలదీస్తే సమాధానం చెప్పలేక నీళ్లు నమిలారు. ఝూటా మాటలు మాట్లాడే కాంగ్రెస్ నాయకులను ప్రజలు గమనిస్తున్నారు. గతంలో కేటీఆర్ దావోస్ పర్యటనకు వెళితే పెట్టుబడులు తేవడం దండగ అని అప్పటి పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. మరిప్పుడు మీ ముఖ్యమంత్రి ఎందుకు పోయారో సమాధానం చెప్పాలి’ అని నిలదీశారు.
లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ గల్లంతే
బీజేపీతో కొట్లాడుతామని చెప్పిన కాంగ్రెస్ నాయకులు ఎవరితో కొట్లాడారో చెప్పాలని హరీశ్‌రావు ప్రశ్నించారు. బండి సంజయ్, అరవింద్, బాబురావు, ఈటల రాజేందర్, రఘునందన్‌రావును ఓడించింది బీఆర్ఎస్సేనని స్పష్టంచేశారు. ‘పాలమూరు ప్రాజెక్టుకు జాతీయహోదా ఇచ్చేది లేదన్న బీజేపీపై కాంగ్రెస్ ఎందుకు కొట్లాడటంలేదు? మెడలు వంచుతామని చెప్పిన కాంగ్రెస్‌వాళ్లు, నేడు బీజేపీ కేంద్ర మంత్రుల మెడలో పూలదండలు వేయటానికి పోటీ పడుతున్నారు.
గజ్వేల్ అభివృద్ధి కోసం కేసీఆర్ తెచ్చిన నిధులను వెనక్కి తీసుకోవడం కాదు.. చేతనైతే మరిన్ని నిధులు మంజూరు చేసి అభివృద్ధి చేయాలి’ అని కోరారు. 15 రోజుల్లో కేసీఆర్ ఆరోగ్యం కుదుటపడుతుందని, ఆయన త్వరలోనే గజ్వేల్ వస్తారని చెప్పారు. గజ్వేల్‌లో కేసీఆర్‌ను ఓడించేందుకు రెండు జాతీయపార్టీలు కుట్రలు పన్నాయని విమర్శించారు. కులమతాల పేరుతో చిచ్చు పెట్టే ప్రయత్నం చేశాయని ఆరోపించారు.
అయినా కేసీఆర్‌కు 45 వేల అద్భుతమైన మెజార్టీని ఇచ్చి గెలిపించుకున్నారని గజ్వేల్ ఓటర్లను ప్రశంసించారు. కేసీఆర్ వచ్చాక సాగు, తాగునీటి కష్టాలు తీరాయని.. కేసులు, కుట్రలు తగ్గాయని చెప్పారు. గజ్వేల్‌లో కేసీఆర్ మంజూరు చేసిన అభివృద్ధి పనులను ఆపితే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు.