కట్టంగూర్, ఫిబ్రవరి 13 : నల్లగొండ జిల్లా కట్టంగూర్ మండలం మల్లారం గ్రామ ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయులుగా చేస్తున్న సమ్మెటి తిరుమలేష్, ఉపాధ్యాయుడు షరీఫ్ తమ సేవాభావంతో అందిరి ప్రశంసలు అందుకుంటున్నారు. కట్టంగూర్ గ్రామ శివారులోని మరమరాల పరిశ్రమలో మహారాష్ట్ర నుండి వచ్చిన వలస కార్మికులు పని చేస్తున్నారు. వారి ఆరుగురు పిల్లలు బడిఈడు పిల్లలు కావడం.. వారు బడికి పోకుండా తల్లిదండ్రుల వద్దనే ఉంటున్నారు. దీంతో వారికి చదువు దూరమవుతుండడాన్ని గమనించిన ఉపాధ్యాయులు వారి తల్లిదండ్రులతో మాట్లాడి పిల్లలను పాఠశాలకు పంపించాలని ఒప్పించారు.
ప్రతి రోజు ఉదయం హెచ్ఎం తిరుమలేష్ ద్విచక్రవాహనంపై ఎక్కించుకుని పాఠశాలకు తీసుకెళ్లి విద్యాబుద్దులు నేర్పించి సాయంత్రం మళ్లీ వారిని మరో ఉపాధ్యాయుడు షరీఫ్ తల్లిదండ్రుల వద్దకు చేరుస్తున్నారు. పిల్లలు చదువుకోవాలి, మంచి స్థాయికి ఎదగాలనే సంకల్పంతో విద్యార్థుల భవిష్యత్ కోసం పని చేస్తున్న హెచ్ఎం తిరుమలేష్, ఉపాధ్యాయుడు షరీఫ్ ను పరువురు అభినందిస్తున్నారు. ఉపాధ్యాయులు సమాజానికి ఆదర్శమని, వారి సేవలు మరెందరికో ప్రేరణగా నిలుస్తాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

వలస కూలీల పిల్లలకు విద్యా దీవెనలు