Harish Rao | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 1న బీఆర్ఎస్ హైదరాబాద్‌లో నిర్వహించిన వేడుకలను పాకిస్థాన్ అవతరణ వేడుకలతో సీఎం రేవంత్‌రెడ్డి పోల్చడం ఆయన కుసంసారానికి, అవగాహన రాహిత్యానికి నిదర్శనమని మాజీ మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, కాంగ్రెస్ నేత భూపేశ్ భగేల్ కూడా రాష్ట్ర అవతరణ వేడుకలను మూడురోజులపాటు నిర్వహించారు. అంటే, పాకిస్థాన్‌లో ఒక రోజు ముందు స్వతంత్ర దినోత్సవం జరపడం అన్నట్టేనా? ఆ మూడు రోజుల సంబురాలు కూడా?’ అని ఎక్స్ వేదికగా హరీశ్‌రావు నిలదీశారు. ‘తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసినవారికి, తెలంగాణ గడ్డ మీద ప్రేమ ఉన్నవారికి రాష్ట్ర అవతరణ ప్రాముఖ్యత అర్థం అవుతుంది. ఉద్యమంలో ఏనాడు పాల్గొననివారికి, నోటి నుంచి ఒకసారి కూడా జై తెలంగాణ అని నినదించని వారికి, అమరులకు ఏనాడూ నివాళులర్పించని వారికి ఆ ఆర్తి, ఆ భావోద్వేగం ఎలా అర్థమవుతుంది?. ఒక రోజు ముందుగా జరపడం కాదు, ఏడాది పొడుగునా పండుగగా దశాబ్ది ఉత్సవాలను మా ప్రభుత్వం నిర్వహించే ప్రణాళిక చేసినం.
2023 జూన్ 2వ తేదీ నుంచి 21 రోజులపాటు జరిపిన ఉత్సవాల్లో ఆటపాటలు, కవి సమ్మేళనాలు, అష్టావధానాలు, సంగీత విభావరి, సినిమా, జానపద కళాకారులతో ప్రదర్శనలు, సంగీత, నృత్యం, జానపద, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినం. జూన్ 2న జెండా ఆవిషరణతో దశాబ్ది ఉత్సవాలు ప్రారంభమై, జూన్ 22న అమరుల సంస్మరణతో ముగించినం. స్వతంత్ర పోరాటాన్ని చూడని నవతరం, తెలంగాణ ఉద్యమ పోరాటాన్ని చూసింది. ప్రత్యక్షంగా పాల్గొన్నది. ఆ ఆర్తి ఉన్నది కాబట్టే, 2023లో బీఆర్ఎస్ నిర్వహించిన తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు విజయవంతమయ్యాయి. తాజాగా జూన్ 1న గన్పారు వద్ద నిర్వహించిన ర్యాలీలో పెద్దసంఖ్యలో పాల్గొని మరోసారి విజయవంతం చేశారు. ఇవన్నీ ఉద్యమకారులపైకి తుపాకీ ఎకుపెట్టిన వారికి ఎలా అర్థం అవుతాయి? అందుకే వారికి కేసీఆర్ జూన్ 1న నిర్వహించిన క్యాండిల్ లైట్ ర్యాలీ, సంబురాలు పాకిస్థాన్ అవతరణలా అనిపించాయి’ అని హరీశ్‌రావు తీవ్రస్థాయిలో విమర్శించారు.
అరవై ఏండ్ల గోసకు, సుదీర్ఘ పోరాటాలకు, అమరుల త్యాగాలకు ఫలితం సాధించిన రోజు (జూన్ 2) నేడు అని మాజీ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. సబ్బండవర్ణాల ప్రజలు ఏకమై గొంతెత్తగా, తెలంగాణ వచ్చుడో, కేసీఆర్ సచ్చుడో అని తెగించి కొట్లడగా.. స్వరాష్ట్రం సాధించిన రోజు నేడు అని తెలిపారు. రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని తెలంగాణ ఉద్యమ విశేషాలు, రాష్ట్రం ఏర్పాటయ్యాక సాధించిన ప్రగతిని ఎక్స్ వేదికగా ఆయన గుర్తుచేశారు. తెచ్చుకున్న తెలంగాణను అభివృద్ధి, సంక్షేమంలో అనతికాలంలోనే అగ్రస్థానానికి చేర్చిన ఘనత బీఆర్ఎస్ పార్టీదని తెలిపారు. దశాబ్దిలో శతాబ్దకాల అభివృద్ధిని చేసుకొని, అభివృద్ధి సంక్షేమంలో తెలంగాణను దేశానికి రోల్ మాడల్‌గా నిలిపింది బీఆర్ఎస్ పార్టీ అని పేర్కొన్నారు. ‘తొమ్మిదేండ్ల కాలంలో వ్యవసాయాన్ని పండుగ చేసింది.
విద్యుత్తు రంగాన్ని పటిష్ఠం చేసింది. విద్యారంగాన్ని ఆదర్శంగా నిలిపింది. వైద్యరంగాన్ని అగ్రస్థానానికి చేర్చింది. పెట్టుబడులతో ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. కరువుల బాధలు లేకుండా చేసింది. వలసలు వెళ్లినవారిని వాపస్ తెచ్చింది. పంట పొలాలను సస్యశ్యామలం చేసింది. ఆర్థిక క్రమశిక్షణతో అభివృద్ధి చేసి శభాష్ తెలంగాణ అని దేశం మెచ్చుకునేలా చేసింది. ఈ అభివృద్ధి, ఉద్యమ స్ఫూర్తి ఇక మీదట కూడా ఉండాలని, తెలంగాణ దేశానికి రోల్ మాడల్‌గా కొనసాగాలని ఆకాంక్షిస్తూ తెలంగాణ దశాబ్ది ఉత్సవ శుభాకాంక్షలు. తెలంగాణ అమరవీరులకు జోహార్.. జోహార్.. జై తెలంగాణ’ అని హరీశ్‌రావు పేర్కొన్నారు.