షాద్‌నగర్, సెప్టెంబర్ 10: అబద్ధాలను యూట్యూబ్ చానెళ్ల ద్వారా ప్రచారం చేసి, లేనివి ఉన్నట్టు, ఉన్నవి లేనట్టు గత ప్రభుత్వంపై విషప్రచారం చేసి అధికారంలోకి వచ్చిన సీఎం రేవంత్‌రెడ్డి ఇప్పుడు అవే యూట్యూబ్ చానెళ్లను తక్కువ చేసి మాట్లాడటం సరికాదని మాజీమంత్రి, ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. ఆయన మంగళవారం నాగర్‌కర్నూల్ వెళ్తూ మార్గమధ్యంలో ఫరూఖ్‌నగర్ మండలం రాయికల్ వద్ద మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్‌రెడ్డి అధికారం కోసం యూట్యూబ్ చానెళ్లను అడ్డంపెట్టుకొని అవాస్తవాలను వాస్తవాలుగా ప్రచారం చేయలేదా? అని ప్రశ్నించారు.
ఏరు దాటక ముందు ఓడ మల్లన్న, ఒడ్డు దాటాక బోడి మల్లన్న అనే తీరులో సీఎం రేవంత్‌రెడ్డి వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పనితీరును, డొల్లతనాన్ని, ఇచ్చిన మాటను తప్పిన తీరును యూట్యూబ్ చానెళ్లు బయటపెడుతుంటే తట్టుకోలేకపోతున్నారని విమర్శించారు. సీఎం డొల్లతనాన్ని, ఆయన మోసాలను బయటపెడితే తట్టుకోలేకపోతున్నారని, కచ్చితంగా సీఎంకు తగిన శాస్తి జరుగుతుందని చెప్పారు. రానున్న రోజుల్లో యూట్యూబ్ చానెళ్లన్నీ ఒక్కటై రేవంత్‌రెడ్డిని గద్దె దించడం ఖాయమని అన్నారు. హరీశ్‌రావుతోపాటు ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్సీ నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే వై అంజయ్యయాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు రాజవరప్రసాద్ పాల్గొన్నారు.
అప్పుడు ఉపయోగించుకొని… కేటీఆర్
కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యూట్యూబ్ జర్నలిస్టులను వాడుకొని, ఇప్పుడు యూట్యూబ్ జర్నలిస్టుల పట్ల ఆనాలోచితంగా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి యూట్యూబ్ జర్నలిస్టులపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆయన స్పందించారు.