మెదక్, జనవరి 28 (నమస్తే తెలంగాణ): మార్చిలోగా ఆరు గ్యారెంటీలను అమలు చేయకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజలే కర్రు కాల్చి వాతపెడతారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు హెచ్చరించారు. అలవికాని హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ప్రజలకు మొండిచెయ్యి చూపుతున్నదని మండిపడ్డారు. ఆదివారం ఆయన మెదక్ జిల్లాకేంద్రంలోని వైస్రాయ్ గార్డెన్స్‌లో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. కర్ణాటకలో అనేక హామీలిచ్చి కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిందని, గెలిచి ఎనిమిది నెలలవుతున్నా ఒక్క హామీ సరిగ్గా అమలు చేయడం లేదని తెలిపారు.
కాంగ్రెస్ సర్కారుపై ప్రజలకు భ్రమలు తొలగిపోయాయని, ఆరు నెలలు ఓపిక పడితే ప్రజలు వచ్చే అన్ని ఎన్నికల్లో బీఆర్ఎస్కే ఓట్లు వేస్తారని చెప్పారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కర్ణాటకలో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్ ఎక్కువ స్థానాలు గెలవడం ఖాయమని పేర్కొన్నారు. రూ.2 లక్షల రుణమాఫీ చేయకుండా పార్లమెంట్ ఎన్నికలకు వెళ్తే కాంగ్రెస్‌కు రైతులు ఓట్లేయరని అన్నారు. పార్లమెంట్ ఎన్నికల కోడ్ రాకముందే హామీలను అమలుచేసి, కాంగ్రెస్ పార్టీ తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని హితవు పలికారు. తాము ఎన్నికల మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా అమలు చేశామని, కాళేశ్వరం నీళ్లు తెచ్చి రైతుల కాళ్లు కడిగామని గుర్తుచేశారు.
ఇంటింటికీ మంచినీళ్లు, రాష్ట్రంలో 11 లక్షల మంది ఆడబిడ్డలకు కల్యాణలక్ష్మి ఇచ్చామని చెప్పారు. రైతుబంధు హామీ ఎన్నికల్లో ఇవ్వకపోయినా అమలు చేశామని గుర్తు చేశారు. కరోనా కష్ట సమయంలో సైతం ప్రభుత్వం వద్ద పైసలు లేకున్నా బిల్లులు, ఎమ్మెల్యేల జీతాలు ఆపి రైతుబంధు ఇచ్చామని, ఇప్పుడు ఏ సమస్య లేకపోయినా కాంగ్రెస్ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ సర్కారు దళితబంధు పక్కన పెట్టిందని, గొల్లకుర్మలకు గొర్రెలు ఇవ్వడం లేదని, రూ.2 లక్షల సాయం కూడా అందలేదని పేర్కొన్నారు.
రూ.4 వేల పింఛన్, మహిళలకు రూ.2500 సాయం ఏమయ్యాయని కాంగ్రెస్ సర్కారును హరీశ్‌రావు ప్రశ్నించారు. ఇచ్చిన హామీలపై ప్రశ్నిస్తే బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ నేతలకు పాలన చేతకాక ప్రతిపక్షాల మీద దాడులు చేస్తున్నారని విమర్శించారు. బీఆర్ఎస్ అధికారంలో ఉండగా తెలంగాణను ఎలా అభివృద్ధి చేయాలనే పనిమీద ఉంటే.. కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రతిపక్షాలపై ఎలా దాడి చేయాలన్న కోణంలో ఆలోచిస్తున్నది అని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ నేతలపై కేసులు పెడితే ప్రజలే తిరగబడతారని హెచ్చరించారు.
మంచినీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడగబోమని చెప్పిన దమ్మున్న లీడర్ ఒక్క కేసీఆర్ మాత్రమేనని తెలిపారు. ప్రజలకు సన్నబియ్యం ఇవ్వాలని తాము భావిస్తే కాంగ్రెస్ వాళ్లు ఉన్న బియ్యం ఇవ్వడం లేదని ఎద్దేవా చేశారు. డీడీలు కట్టినా ఎందుకు గొర్రెలు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సెక్రటేరియేట్‌లో కంప్యూటర్లు, ఫైల్స్ ఉంటాయని, లంకె బిందెలు ఉండవని, లంకెబిందెలు లేవనే సాకుతో పార్లమెంట్ ఎన్నికల తర్వాత చేతులు ఎత్తేస్తారా? అని రేవంత్‌కు చురకలంటించారు. తెలంగాణ రాష్ర్టాన్ని తీసుకువచ్చిన కేసీఆర్ భిక్షతోనే ఈ రోజు రేవంత్‌రెడ్డి సీఎం కుర్చీలో కూర్చున్నారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ఆర్ సత్యనారాయణ, బీఆర్ఎస్ నాయకులు దేవేందర్‌రెడ్డి, కంఠారెడ్డి తిరుపతిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్ పాల్గొన్నారు.