PM Modi : లోక్సభలో ప్రతిపక్షాలు బుధవారం భారీ నిరసన చేపట్టాయి. స్పీకర్ పోడియంతోపాటు ప్రధాని మోదీ కూర్చునే సీటు వద్దకు పలువురు ఎంపీలు వచ్చి ఆందోళన చేశారు. అందులోనూ కాంగ్రెస్ పార్టీకి చెందిన మహిళా ఎంపీలు కూడా ఈ ఆందోళనలో పాల్గొన్నారు. విపక్షాల ఆందోళన మధ్య సభ వాయిదా పడింది.
దీంతో ప్రధాని మోదీ ధన్యవాద ప్రసంగం కూడా వాయిదా పడినట్లైంది. షెడ్యూల్ ప్రకారం నేటి సాయంత్రం ప్రధాని మోదీ సభలో మాట్లాడాలి. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై ప్రసంగించాల్సి ఉంది. అయితే, సాయంత్రం ఐదు గంటల తర్వాత సభ ప్రారంభంకాగానే విపక్ష ఎంపీలు ఆందోళనకు దిగారు. దీంతో సభ గురువారానికి వాయిదా పడింది. ప్రధాని ప్రసంగం కూడా రేపే ఉండే అవకాశం ఉంది. సభలో రాహుల్ గాంధీ ఒక పుస్తకం గురించి ప్రస్తావిస్తున్న సంగతి తెలిసిందే. భారత సైన్య మాజీ అధిపతి ఎంఎం నరవాణే రచించిన పుస్తకంలోని కొన్ని అంశాల్ని చదివేందుకు ఆయన ప్రయత్నించగా.. ఇందుకు స్పీకర్ అనుమతించలేదు. దీంతో రాహుల్ సహా, కాంగ్రెస్ ఎంపీలు సభలో నిరసనకు దిగారు. బుధవారం ఉదయం నుంచి వారి నిరసన కొనసాగుతూనే ఉంది.
ఈ నేపథ్యంలో సభ పలుమార్లు వాయిదాపడింది. మరోవైపు రాహుల్ గాంధీ ఈ రోజు ఉదయం మీడియాతో మాట్లాడారు. ప్రధాని మోదీ సభకు వస్తే.. ఈ పుస్తకాన్ని తానే ఆయనకు అందిస్తానని, అయితే, ఆయన సభలోకి వస్తారని అనుకోవడం లేదని అన్నారు. ఇదే సమయంలో రాహుల్ గాంధీకి, కేంద్ర మంత్రి రవనీత్ సింగ్ బిట్టుకు మధ్య పార్లమెంట్ ప్రాంగణంలో చిన్న వాగ్వాదం జరిగింది. రవనీత్ను ద్రోహి స్నేహితుడు అంటూ రాహుల్ అభివర్ణించారు. దీనికి ఆయన కూడా గట్టిగానే బదులిచ్చారు. కానీ, రవనీత్పై రాహుల్ వ్యాఖ్యల్ని బీజేపీకి చెందిన సిక్కు ఎంపీలు ఖండించారు.