– ఇంక్రిమెంట్లు, రిటైర్మెంట్ వయస్సు పెంపుపై సానుకూల హామీ
రుద్రంపూర్, ఫిబ్రవరి 04 : పాలిటెక్నిక్ లెక్చరర్స్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి సంబంధించి TSPALA (తెలంగాణ స్టేట్ పాలిటెక్నిక్ అకడమిక్ లెక్చరర్స్ అసోసియేషన్) నాయకులు కీలక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా TSPALA అధ్యక్షుడు గోళ్ల ఉదయ్ భాస్కర్, జనరల్ సెక్రటరీ టి.నవీన్ కుమార్, ఉమెన్ సెక్రటరీ వి.మమత, జాయింట్ సెక్రటరీ ఎం.లక్ష్మణ్ రావు మంత్రి పొన్నం ప్రభాకర్, చీఫ్ సెక్రటరీ రామకృష్ణారావు, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేనను కలిసి బుధవారం వినతిపత్రాలు సమర్పించారు. ఈ సమావేశంలో ప్రధానంగా పాలిటెక్నిక్ లెక్చరర్స్‌కు పెండింగ్‌లో ఉన్న ఇంక్రిమెంట్ల మంజూరు, లెక్చరర్స్ రిటైర్మెంట్ వయస్సును 65 సంవత్సరాలకు పెంచడం అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ అంశాలను పూర్తి స్థాయిలో పరిశీలించి తగిన నిర్ణయం తీసుకుంటామని మంత్రి, సీఎస్, కమిషనర్ హామీ ఇచ్చినట్లు నాయకులు తెలిపారు.

పాలిటెక్నిక్ లెక్చరర్స్ సమస్యలపై కీలక భేటీ
ఈ సందర్భంగా TSPALA అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ.. రాష్ట్రంలో పాలిటెక్నిక్ ఎడ్యుకేషన్‌ను అభివృద్ధి పథంలో నడిపించి, దేశంలోనే మొదటి స్థానంలో నిలిపేందుకు అవసరమైన అన్ని చర్యలకు తాము పూర్తిస్థాయిలో కృషి చేస్తామని తెలిపారు. లెక్చరర్స్‌గా ఇది తమ బాధ్యత అని పేర్కొంటూ, ప్రభుత్వం తీసుకునే ప్రతి సానుకూల నిర్ణయానికి విశాల మనసుతో సహకరిస్తామని, టెక్నికల్ ఎడ్యుకేషన్ అభివృద్ధి కోసం తమ సేవలను నిరంతరం వంద శాతం అందిస్తామని లెక్చరర్స్ తరఫున హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో హర్షవర్ధన్ రెడ్డి, TG TJAC నాయకులు చంద్రశేఖరరావు పాల్గొన్నారు.

పాలిటెక్నిక్ లెక్చరర్స్ సమస్యలపై కీలక భేటీ