Nitin Gadkari : ఈ20 పెట్రోల్ విషయంలో అనేక వివాదాలు కొనసాగుతున్నాయి. ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతున్నాయని కొందరు యజమానులు అంటుంటే.. అలాంటిదేం లేదని కేంద్రం చెబుతోంది. అందులోనూ పాత వాహనాలు బాగా దెబ్బతింటున్నాయనే ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ అంశంపై పార్లమెంట్లో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పందించారు. కొన్ని రకాల పాత (బీఎస్-3) వాహనాలు ఈ20 పెట్రోల్‌తో నడవాలంటే కొన్ని పార్ట్లు మార్చుకోవాల్సిందే అని స్పష్టం చేశారు.
ఇథనాల్ కలిసిన పెట్రోల్‌తో పనిచేయాలంటే వాహనాల ఇంజిన్‌కు మోడిఫికేషన్ అవసరం లేదని, అలాగే, వాటి సామర్ధ్యంలో కూడా మార్పు ఉండబోదని గడ్కరీ తెలిపారు. ఒక ప్రశ్నకు సమాధానంగా పార్లమెంట్లో బుధవారం గడ్కరీ ఈ వివరాల్ని వెల్లడించారు. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఓసీఎల్), ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం (ఐఐపీ), డెహ్రడూన్‌తోపాటు ఎస్ఐఏఎం, ఏఆర్ఏఐ సంస్థలతో కలిపి సంయుక్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ వివరాలు వెల్లడిస్తున్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే, కొన్ని పాత బీఎస్-3 వాహనాలకు సంబంధించి కొన్ని రబ్బర్ పార్ట్లు, కంపోనెంట్స్ మార్చుకోవాల్సి ఉంటుందని తెలిపారు. బీఎస్-3 వాహనాలు ఏప్రిల్ 1, 2005న అందుబాటులోకి వచ్చాయన్నారు. అప్పటినుంచి 2016లోపు తయారైన వాహనాల్లోనే విడిభాగాలు మార్చుకోవాల్సి ఉంటుందని వివరించారు. కొన్ని రబ్బర్ పార్ట్స్, గ్యాస్కెట్లు మారిస్తే సరిపోతుందన్నారు.
వాహనాల రెగ్యులర్ సర్వీస్ ద్వారా ఈ పార్ట్స్ మార్చుకోవచ్చని, ఇందుకోసం పెద్దగా మోడిఫికేషన్స్ అవసరం లేదని గడ్కరీ చెప్పారు. ఈ కేటగిరికి చెందిన టూవీలర్లు, కార్లలో ఈ20 పెట్రోల్ వినియోగానికి సంబంధించి ఇంజిన్లలో మార్పులు చేయక్కర్లేదని స్పష్టం చేశారు. ఇటీవలి కాలంలో ఈ20 పెట్రోల్ వల్ల వాహనాలు పాడవుతున్నాయని, ఉన్నట్లుండి బ్రేక్‌డౌన్ అవుతున్నాయని, మైలేజ్ తగ్గుతోందని వాహనదారులు ఫిర్యాదు చేస్తున్నారు. దీనిపై గడ్కరీ స్పందిస్తూ మైలేజీ తగ్గడానికి ఈ20 పెట్రోల్ ఒక్కటే కారణం కాదని, అనేక అంశాల ఆధారంగా మైలేజీ తగ్గడం, పెరగడం జరుగుతుందని వివరించారు. ఈ20 పెట్రోల్ వినియోగంపై ప్రజలకు అవగాహనా కార్యక్రమాలు చేపట్టునున్నట్లు మంత్రి తెలిపారు.